• వాసిరెడ్డి పద్మ మహిళాకమిషన్ కు ఛైర్ పర్సనా… లేక జగన్ రెడ్డి కమిషన్ కా? ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడానికే ఆమెకు సర్వాధికారాలుంటాయా?
• ఆడబిడ్డ మానప్రాణాలకు ఖరీదుకట్టే దుస్థితిలో మహిళాకమిషన్, జగన్ రెడ్డి, హోంమంత్రి ఉన్నారు
తెలుగు మహిళ రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి అనిత
అన్నగా ఆడబిడ్డలకు అండగాఉంటానని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాటతప్పి మడమతిప్పాడని, ముఖ్యమంత్రి అయ్యాక మహిళలరక్షణ గాలికొదిలేసి కిరాతకులు, నేరస్థులకు అండగా నిలబడుతున్నాడని, తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆమె జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే ..
“రాష్ట్రంలో రోజుకు సగటున మహిళలపై 49 నేరాలు జరుగుతున్నాయంటే ఆడబిడ్డల రక్షణ అంశంలో జగన్ రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధంచేసుకోవచ్చు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం కావడంవల్లే మహిళలకు రక్షణకరువైంది. ఇంటినుంచి బయటకు వెళ్లి ఆడపిల్ల భద్రంగా తిరిగివస్తుందన్న నమ్మకంలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉత్పన్నం అయ్యాయంటే అందుకు ముఖ్యమంత్రి అసమర్థత, చేతకాని పాలనే కారణం. సైకో సీఎం, అసమర్థత చేతగానితనంవల్ల రాష్ట్రంపూర్తిగా అధోగతిపాలైంది.
అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని వారిని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, నేడు రాష్ట్రంలోని ప్రతిఆడబిడ్డకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. సైకో సీఎం మూడున్నరేళ్ల పాలనలో ఆడబిడ్డలపై 45వేలకు పైగా నేరఘటనలు జరిగాయి. రాష్ట్రంలో సగటున రోజుకి 49వరకు నేరఘటనలు మహిళలపై జరుగుతున్నాయంటే, ఆడబిడ్డలమానప్రాణాలకు ఈ ముఖ్యమంత్రి ఎంతవిలువ ఇస్తున్నాడో అర్థంచేసుకోవచ్చు. లెక్కకుమిక్కిలిగా ఇన్నిదారుణాలు జరిగినా, ఏ ఒక్కదానిపైనా ఏనాడు ముఖ్యమంత్రి స్పందించింది లేదు. ఆడబిడ్డలకు రాష్ట్రంలో రక్షణలేదని ప్రతిపక్షాలు, మీడియా మొత్తుకుంటున్నా, జగన్ రెడ్డి చెవికి ఎక్కడంలేదు.
ముఖ్యమంత్రి సొంతజిల్లాలోని ఆడబిడ్డలే దుర్మార్గుల దుశ్చర్యలకు బలైపోతున్నారు. పోలీసుల నిర్లక్ష్యంవల్లే కడపజిల్లా బద్వేల్ మండలంలో అనూష చనిపోయింది. పోస్ట్ మార్టమ్ కు సంబంధించి ప్రాథమికనివేదిక రాకుండానే అనూషది ఆత్మహత్య అని పోలీసులు ఎలానిర్ధారిస్తారు? తమబిడ్డను కోల్పోయిన అనూష తల్లిదండ్రులు, బంధువులు న్యాయంచేయమని రోడ్డెక్కినా జగన్ రెడ్డి స్పందించలేదు. జగన్ రెడ్డి ఆర్భాటంగా చెప్పే జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థ ఆడబిడ్డల రక్షణకు కొరగాకుండా పోయింది. అనూష తల్లిదండ్రుల కడుపుకోతకు ఈ ముఖ్యమంత్రి అసమర్థత, పోలీసుల చేతగానితనం కారణం కాదా?
ఒక్క అక్టోబర్ నెలలో కేవలం 20రోజుల్లోనే మహిళలపై దురాగతాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 17సంఘటనలు జరిగాయి. ఆయా ఘటనల్లో జగన్ రెడ్డి గొప్పగా చెప్పే వాలంటీర్ల ప్రమేయం కూడా ఉంది. ఈ నెలలోనే ఇన్నిదారుణాలు జరిగినా డీజీపీ ఎందుకు స్పందించడు? ఆయనకూడా పప్పెట్ లా మారితే రాష్ట్రంలోని మహిళల పరిస్థితేమిటి? జగన్ రెడ్డి, ఆయన వ్యవస్థపై ప్రజలకు నమ్మకంలేదు. జగన్ రెడ్డిపై భక్తితో ఆయనసేవలో తరిస్తూ, పోలీసులుకూడా వారిపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆడపిల్ల మానానికి రూ.5లక్షలు, ప్రాణానికిరూ.10లక్షలు ఖరీదుకట్టే దుస్థితిలో మహిళా కమిషన్, జగన్ రెడ్డి, హోంమంత్రి ఉన్నారు.
సమయం, సందర్భం లేకుండా ఏదిపడితే అది మాట్లాడేస్థితిలో హోంమంత్రి ఉన్నారు. ఆడబిడ్డలపై జరిగే దారుణాలు, వారిరక్షణపై స్పందించే స్థితిలో జగన్ రెడ్డిలేడు..గంజాయి, ఇతరమాదకద్రవ్యాలపై మాత్రమే ఆయన స్పందిస్తాడు. దేశవ్యాప్తంగా చూస్తే గంజాయిరవాణా, అమ్మకాల్లో ఏపీనే టాప్ లో ఉంది. ఎక్కడ మాదకద్రవ్యాలు పట్టుబడినా వాటితాలూకామూలాలు రాష్ట్రంతో కనెక్ట్ అవుతుండటం నిజం గా పాలకులు సిగ్గుపడాల్సిన విషయం.
మహిళా కమిషన్ పనిచేయాల్సింది ఆడబిడ్డల రక్షణకోసమా… జగన్ రెడ్డి కోసమా?
రాష్ట్రంలోని మహిళల పరువుతీసేలా ఏపీ మహిళాకమిషన్ వ్యవహరిస్తోంది.మహిళలరక్షణ, వారిన్యాయంకోసం చంద్రబాబునాయుడు మహిళాకమిషన్ ను ఏర్పాటుచేశారు. కానీ రాష్ట్రమహిళా కమిషన్ ‘జగన్ కమిషన్’ లా మారిపోయింది. ఆడబిడ్డలకు న్యాయంచేయలేని మహిళాకమిషన్ ఆ పేరు తొలగించుకొని, జగన్ కమిషన్ గా పనిచేస్తే మంచిది. మహిళలకు అన్యాయంజరిగితే స్పందించని వాసిరెడ్డిపద్మ, జగన్ రెడ్డిని, ఆయన సతీమణి గురించి మాట్లాడేవారిపై అత్యుత్సాహంతో స్పందిస్తోంది. చంద్రబాబునాయుడిగారికి, పవన్ కల్యాణ్ కి నోటీసులు ఇవ్వడానికి మాత్రమే వాసిరెడ్డిపద్మకు సర్వాధికారాలుంటాయా?
మహిళలకు న్యాయంచేయడానికి ఆమెకున్న అధికారాలు, హోదా పనికిరావా? అత్యాచారబాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన ప్రధానప్రతిపక్షనేతకు నోటీసులివ్వడం ఎలాంటి సర్వాధికారమో పద్మ సమాధానం చెప్పాలి. జనసేన నాయకుడు మహిళల గురించి తప్పుగా మాట్లాడారని ఆయనకు నోటీసులిచ్చామంటున్నారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన వారందరికీ పద్మ నోటీసులిచ్చుకుంటూ పోతే, వైసీపీనేతలకు ఇవ్వడానికే బస్తాలకొద్దీ పేపర్లుకావాలి. వాసిరెడ్డి పద్మకు సర్వాధికారాలుంటే, ఆ అధికారంతో ఆమె జగన్ రెడ్డికే తొలినోటీస్ ఇవ్వాలి. రెండో నోటీసు బూతులుమాట్లాడే మాజీమంత్రి, ప్రస్తుత మంత్రులకు ఇవ్వాలి.
తెలుగువారికి పవిత్రమైన, ప్రతిష్టాత్మకమైన పండుగైన సంక్రాంతికి క్యాసినోలు నిర్వహించి, ఆడబిడ్డలతో అర్థనగ్నప్రదర్శనలు ఇప్పించిన కొడాలినానీకి నోటీసులు ఇవ్వాలి. నానీ చేసింది ఆడవాళ్లను అవమానించడం కాదా? వారిని అంగట్లో సరుకుగా మార్చడం నేరంకాదా? మహిళై ఉండి, ఆయన సిగ్గుమాలిన చర్యలను, క్యాసినో సంస్కృతిని సమర్థించిన రోజాకు నోటీసులివ్వాలి. పర్యాటకశాఖఅని బోర్డుపెట్టుకొని, ప్రజాధనంతో పర్యటనల్లో మునిగి తేలుతూ, నోరుతెరిస్తే బూతులుమాట్లాడే రోజాకు కచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సిందే.
గోరంట్ల మాధవ్ అర్థనగ్నప్రదర్శనలతో రాష్ట్రం పరువుతీసినప్పుడు పద్మకు నోటీసులు గుర్తురాలేదా? సర్వాధికారాలని విర్రవీగితే వాసిరెడ్డిపద్మకున్న అధికారమంతా, వైసీపీవాళ్లకు నోటీసులు ఇవ్వడంతోనే సరిపోతుంది. వాసిరెడ్డి పద్మ నిజంగా ఆడబిడ్డలకు న్యాయం చేసేదే అయితే, ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి తెలుగుదేశంపార్టీ పుస్తకం ఇచ్చినప్పుడే స్పందించేది. ఆమెకు తెలిసిందల్లా చంద్రబాబు, లోకేశ్, ప్రతిపక్షాలపై పడి ఏడవడమే.
బూతుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే, ప్రజలు సిగ్గుపడుతున్నారు
అవనిగడ్డలో బూతులగురించి ముఖ్యమంత్రి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. జగన్ రెడ్డిలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి, వినరాని బూతులు వింటున్నందుకు నిజంగా ప్రజలు ఇప్పటికే సిగ్గుపడుతున్నారు. కేబినెట్ లో బూతులుమాట్లాడని మంత్రి ఎవరైనా ఉన్నారేమో జగన్ రెడ్డి చెప్పగలడా? ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు ఏ మంత్రి అయినాసరే, బూతులు మాట్లాడకుండా ఉంటున్నాడా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ రెడ్డే, పబ్లిక్ మీటింగ్ లో నా వెంట్రుక కూడా పీకలేరంటూ పిచ్చెక్కినట్టు మాట్లాడలేదా? బూతులు మాట్లాడేవారే.. వాటిగురించి మాట్లాడటం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. రాష్ట్రంలోని ఆడబిడ్డలకోసం, రాక్షసులతో పోరాడుతున్న ప్రతిపక్షాలకు రాష్ట్రమహిళాలోకమంతా ఒక్కతాటిపై నిలిచి మద్దతు ఇవ్వాలి” అని అనిత విజ్ఞప్తిచేశారు.