– బ్రాహ్మణపల్లిలో విపిఅర్ కు ఘన స్వాగతం
– విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వాటర్ ప్లాంట్లు ప్రారంభం
– ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సరక్షిత తాగునీరు అందివ్వడమే నా లక్ష్యం
– నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేయడం తన అభిమతమన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కలిసి మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు ఆర్ ఓ ప్లాంట్స్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాలలోనికి రాక ముందు నుంచే సేవా రంగంలో వున్నట్టు తెలిపారు. ఉదయగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో 2017 నుంచి అమృతధార పేరిట తన స్వంత నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అనంతరం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమృతధార కార్యక్రమాన్ని జిల్లా అంతటా విస్తరించినట్లు వివరించారు. స్థానిక అవసరాలను గుర్తించి ఎస్సీ కాలనీలో ఒకటి బ్రాహ్మణపల్లి గ్రామంలో మరొక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాము ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్లలో శుద్ధి చేసిన తాగునీరు ఉచితంగా తీసుకెళ్లవచ్చన్నారు. వాటర్ ప్లాంట్ల నిర్వహణ తమ ఫౌండేషన్ చూసుకుంటుందన్నారు. ఎన్నికల్లో గెలిచాక తొలిసారిగా వచ్చిన తన పట్ల బ్రాహ్మణపల్లి వాసులు చూపించిన ఆదరాభిమానాలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి వాసులు ఎంపీ వేమిరెడ్డి ని పూల మాలలతో సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆనం టిడిపి నాయకులు ఆనం రంగ మయూర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.