– సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు : వైసీపీ హయాంలో మాదిరిగా వేధింపులుండవ్… చీమకు కూడా హానిచేయబోం… సేద్యం చేసే ప్రతి రైతుకూ యూరియా బస్తాలు పంపిణీ చేస్తామని పొదలకూరు మండలం నల్లపాళెంలో మీడియాతో సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి యూరియా కోసం జైలుకెళ్లాల్సిన అవసరం లేదు… చేసిన పాపాలు చాలా ఉన్నాయి.. ఇప్పటికే కొన్ని పాపాలకు జైలుకు పోయివచ్చాడు… ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం… ఇప్పటికే అన్ని కాలువలకు నీరు విడుదల చేశామని ఎమ్మెల్యే చెప్పారు.
ఒక టీఎంసీకి కచ్చితంగా 10 వేల ఎకరాలకు తగ్గకుండా పంట పండించే బాధ్యత రైతులతో పాటు అధికారులపైనా ఉంది. సేద్యం చేసే ప్రతి రైతుకు యూరియా అందేలా ముందస్తుగానే కార్డులు అందిస్తున్నాం. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎకరాకు 3 యూరియా బస్తాలు అందుబాటులో ఉంచుతున్నాం. ఎరువుల కొరత జాతీయ స్థాయి సమస్య…అది సర్వేపల్లికో, నెల్లూరుకో పరిమితం కాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు యూరియా అందకుండా వేధించారు.
టీడీపీ సానుభూతి పరుల భూముల రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేశారు. ఇప్పుడేమో నిత్యం నన్ను, చంద్రబాబు నాయుడిని, ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న మంచి ఆయనతో పాటు వాళ్ల పార్టీకీ కనిపించదు. యూరియా విషయంలో మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం..ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. రైతులకు ఉపయోగపడే డొంక రోడ్లు, లింక్ రోడ్ల విషయంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం..ఇప్పటికే పలు రోడ్లకు నిధులు మంజూరు చేశామని తెలిపారు.
ప్రజాపయోగ పనుల విషయంలో రాజకీయాలకు తావే లేదు. చీమకు కూడా హాని తలపెట్టే మనస్తత్వం మాది కాదు. గోవర్ధన్ రెడ్డి మాదిరిగా అమాయకులను జైళ్లకు పంపలేదు… నల్లపాళెంలో సురేష్ రెడ్డి పొలాల్లో పైపులను ధ్వంసం చేయించినట్లు చేయలేదు. చేతనైతే పేదలకు సాయం చేస్తాం కానీ… కాకాణి మాదిరిగా అమాయకులను వేధించమని ఆయన హామీ ఇచ్చారు.