– ప్రజాస్వామ్య పద్దతిలో మళ్ళీ పారదర్శకంగా నిర్వహించాలి
– శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ డిమాండ్
అనంతపురం: ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుపడేలా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికను నిర్వహించారని మాజీ మంత్రి, సింగమల నియోజకవర్గ సమన్వయకర్త సాకె శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. పోలీసులే టీడీపీ గూండాలతో దొంగ ఓట్లు వేయించడం ద్వారా చట్టవిరుద్దంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను రద్దు చేసి, నిస్పక్షపాతంగా, పారదర్శకంగా మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే…
నా రాజకీయ జీవితంలో ఎన్నికలు ఇంత అనైతికంగా ఎప్పుడూ జరగడం చూడలేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. వైయస్సార్సీపీ గెలుపును అడ్డుకోవడానికి సీఎం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. వాడని వ్యవస్థ లేదు. చేయని తప్పు లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దిగజారి వ్యవహరించారు. పోలింగ్ బూత్‌లను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చడం, మా పార్టీకి చెందిన బూత్ ఏజెంట్లను బూత్‌ల నుంచి తరిమేసి బూత్ క్యాప్చరింగ్లకు పాల్పడటం, వైయస్సార్సీపీ కార్యకర్తలను బైండోవర్ చేయడం, నాయకులను హౌస్ అరెస్టులు చేయడం, పోలింగ్ బూత్ ల వద్దకు మా ఓటర్లు రాకుండా కర్రలతో కొడతామని బెదిరించి అడ్డుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను పిలిపించుకుని తీసుకొచ్చి అడ్డగోలుగా వ్యవహరించారు.