జగన్‌కు మంత్రి సవిత హెచ్చరిక
పెనుకొండ / శ్రీసత్యసాయి:తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన వెంకన్న లడ్డూలో పాలతో చేసిన నెయ్యి కాకుండా కల్తీ నెయ్యి వాడిన విషయం బట్టబయలవ్వడంతో వైసీపీ వర్గాల్లో వణుకు మొదలైందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత-జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్రంగా మండిపడ్డారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు బూతులు తిడుతూ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆమె ఆరోపించారు.
పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ… హిందువులు మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో పాలు తయారు చేసిన నెయ్యి లేదని, ప్రసాదం కల్తీ అయిందని సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్వయంగా స్పష్టం చేసిందన్నారు. ఈ వ్యవహారంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వైసీపీ నాయకుల అవినీతి బయటపడిందన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రావడంతో వైసీపీ నాయకులు బూతులు తిడుతూ, “రప్పా రప్పా నరుకుతాం” అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రలో భాగంగానే సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌లపై వైసీపీ నాయకులు జోగి రమేశ్, అంబటి రాంబాబు వ్యక్తిగత దూషణలకు దిగారని తెలిపారు. ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని, తమకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని మంత్రి సవిత తేల్చిచెప్పారు.
కాపులకు జగన్ తీరని ద్రోహం
2019 ఎన్నికల ముందు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుని జగన్ నమ్మకద్రోహానికి పాల్పడ్డారని మంత్రి సవిత ఆరోపించారు. ఊరూరూ తిరుగుతూ కాపులకు మేలు చేస్తానని చెప్పి వారి ఓట్లను దండుకున్నారని విమర్శించారు. బీసీలను కూడా “నా బీసీలు” అంటూ మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చాక తీరని అన్యాయం చేశారన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు వర్గాలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడ్డారని, అయిదేళ్ల పాలనలో ఈ వర్గాలపై దాడులు జరిగినప్పుడు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. స్వయం ఉపాధి లేక, ఉద్యోగాలు లేక కాపు-బీసీ యువత రోడ్డున పడ్డప్పుడు జగన్‌ను ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నాక కులాల కార్డులు వాడుకుంటున్న వైసీపీ రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు.
వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతున్న జగన్
తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తోందని, తిరుపతి లడ్డూ కల్తీ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. తాము కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఈ 18 నెలల్లో వైసీపీ నాయకులు బయట తిరగగలిగేవారా? జగన్ పరామర్శలు చేయగలిగేవారా? అని ప్రశ్నించారు. గత వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, భువనేశ్వరమ్మపై వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు జగన్‌ను వైసీపీ శ్రేణులు ఎందుకు నిలదీయలేదని అన్నారు. ఇప్పుడు అదే జగన్ పార్టీ శ్రేణులను బూతులు తిట్టాలని, బెదిరింపులకు పాల్పడాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు