Suryaa.co.in

Andhra Pradesh

పురందేశ్వరిది క్రిమినల్ స్వభావం

కేసులు త్వరితగతిన పరిష్కారానికి సంస్కరణలు తేవాలి
రాష్ట్రంలో అనైతిక రాజకీయ పొత్తులు
ఎంపీ విజయసాయిరెడ్డి

నవంబర్ 6: పురందేశ్వరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారని, దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో పేరుకుపోయిన కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని, అలా కాకుండా బెయిల్ రద్దు చేయమని కోరడం వెనుక ఆమె క్రిమినల్ మైండ్ అర్థం చేసుకోవచ్చని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

ఈ మేరకు ఒంగోలులో సోమవారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ పురందేశ్వరి స్వభావం, అలోచనల్లో ఏదో పొరపాటు ఉందని తెలుస్తోందని అన్నారు. కోర్టు కేసులేమీ ఆస్తి కాదని, వాటిని ఎవ్వరూ తమ వద్ద ఉంచుకోవాలని కోరుకోరని, సాధ్యమైనంత తొందరగా వాటినుండి బయటపడాలని కోరుకుంటారని అన్నారు. పురందేశ్వరి అధికార పార్టీలో కీలక స్థానంలో ఉన్నందుకు కేసులు సత్వర పరిష్కారానికై సంస్కరణలు తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని కోరారు. అది ఆమె చేతుల్లోనే ఉందని, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ చేతుల్లోనే ఉందని అన్నారు.

బెయిల్ రద్దు చేయమనడంలో ఎంత మాత్రం అర్థం లేదని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటు సంక్షేమంలో అటు అభివృద్దిలో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతుందని రానున్న 2024 ఎన్నికల్లో ఈ మేరకు ప్రజలు తమ తీర్పుతో అభివృద్ది లేదన్న వారికి సమాధానం చెబుతారని అన్నారు. అలాగే నకిలీ స్టాంపుల కుంభకోణం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కుంభకోణానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, విచారణ జరపాలని మొట్టమొదటిగా డిమాండ్ చేసింది వైకాపాకు చెందిన నేతలేనని గుర్తుచేశారు.

నకిలీ స్టాంపుల కుంభకోణం ఎప్పటిదో ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. తమ నేతల డిమాండ్ మేరకు కొంతమందికి అరెస్టు చేశారని, త్వరలోనే మిగిలిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో నైతిక విలువల్లేని రాజకీయ పొత్తులు నడుస్తున్నాయని తేదేపా, జనసేన పొత్తుపై అడిగిన ప్రశ్నకు బదిలిచ్చారు. తెలంగాణాలో ఒకరకంగా, ఆంధ్రాలో మరో రకంగా రాజకీయ పొత్తులు ఎవరికీ అర్థం కాని రీతిలో ఉన్నాయని అన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోదని, భవిష్యత్తులో కూడా పొత్తుపెట్టుకోదని అన్నారు.

మరోవైపు సోషల్ మీడియాలో పురందేశ్వరి వ్యవహార శైలిపై ఘాటుగా స్పందించారు
నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఆయన పురందేశ్వరి వ్యవహారర శైలిపై ఘాటుగా స్పందించారు..

తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా అని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు పురందేశ్వరి చిరునామాగా మారిందని మండిపడ్డారు. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారని చెప్పారు.

ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే నని అన్నారు.. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిదని చెప్పారు. సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబు ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకినే మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులని చెప్పారు.

అన్న టీడీపీ అనే పార్టీని పురందేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్ లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడని చెప్పారు. పురందేశ్వరి పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయిందని రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వదిలేసి…అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని మండిపడ్డారు.

ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్ గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా ఆమెను తీసేసారని అన్నారు. దీంతో కష్టపడి పిత్రార్జితంగా ఆమెకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆమె ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారని చెప్పారు. రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని ఆమె వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కు కాలమే సమాధానం ఇస్తుందని ఆయన అన్నారు.

స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ అభరణాలని అన్నారు. టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారని మండిపడ్డారు. బంధుత్వం మాటున బావ చంద్రబాబు సహాయంతో ఎంపీగా గెలిచి బిజెపి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావడమే ఆమె రహస్య ఎజెండా అని చెప్పారు. అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE