Suryaa.co.in

Editorial

యాంటీగా పోస్టు పెట్టు.. మంత్రితో అవార్డు కొట్టు!

– సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు పెట్టిన జర్నలిస్టుకు మంత్రి దుర్గేష్ అవార్డు
– లిక్కర్‌పై వ్యంగ్యంగా పోస్టు పెట్టిన దూరదర్శన్ జర్నలిస్టు శివన్నారాయణరెడ్డి
– ఆయన గోదావరి పుస్తకానికి ఉత్తమ అవార్డు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరు అజమాయిషీ చేస్తున్నారు? అసలు సమన్వయం ఉందా? ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? వాటికి ప్రాతిపదిక ఏమిటి? గతంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను మళ్లీ అందలం ఎక్కిస్తున్నారు. వైన్‌షాపులు కూడా వైసీపీ వారికే ఎక్కువ ఎలా వచ్చాయి? ఇలాంటి ప్రశ్నాస్త్రాలతో తమ్ముళ్లు విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. దానికి అదనంగా కాకినాడ కథ ఒకటి తాజాగా తోడయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారికి మంత్రిగారే ఎలా అవార్డు ఇస్తారు? ఇలా చేస్తే మనది గుడ్డి ప్రభుత్వం అని నవ్విపోరా?.. అంటూ తూర్పుగోదావరి తమ్ముళ్లు సోషల్‌మీడియాలో శివాలెత్తుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే..

ఆయనో జర్నలిస్టు. వివిధ సామాజిక అంశాలు, ఇతర రంగాలపై పుస్తకాలు రాస్తుంటారు. అందుకు ఆయనకు ప్రభుత్వం- ప్రభుత్వేతర సంస్థల నుంచి అవార్డులు లభించాయి. మంచిదే. కానీ సదరు జర్నలిస్టు తన ఫేస్‌బుక్‌లో, సర్కారుకు వ్యతిరేకంగా మద్యంపై పెట్టిన వ్యంగ్య పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమయింది. అంటే కూటమి ప్రభుత్వం ముందు హామీ ఇచ్చినట్లు.. ‘అమ్మకు వందనం’ పథకం కాకుండా.. మద్యం పాలిసీని అమలుచేయడాన్ని ఆక్షేపిస్తూ పెట్టిన పోస్టు అది. ఇంతకూ సదరు జర్నలిస్టు పెట్టిన పోస్టు ఏమిటంటే.. ‘అమ్మకం వందనం’ కంటే ‘‘నాన్నకు ఇంధనం’’ వచ్చేసింది. అమ్మ ఎందుకో వెనకబడింది! ఇదీ కాకినాడకు చెందిన దూరదర్శన్ రిపోర్టర్ డాక్టర్ సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి తన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు!!

అయితే రాష్ట్ర పర్యాటక అవార్డు గ్రహీత, జర్నలిస్టు డాక్టర్ శివన్నారాయణ రెడ్డిని అభినందించిన కలెక్టర్ షణ్మోహన్ అంటూ.. కాకినాడ జిల్లా డీపీఆర్‌ఓ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆ జర్నలిస్టు రాసిన పుస్తకాలు, వాటికి వచ్చిన అవార్డులు చూసిన కలెక్టర్ ఆయనను అభినందించారన్నది దాని వార్త సారాంశం.

ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన పర్యాటక వివరాలకు సంబంధించి రాసిన ఐదు పుస్తకాలకు, ఐదు అవార్డులు రావటం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ అభినందించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. 2012లో యాత్ర, 2014లో తూర్పుగోదావరి యాత్ర, 2016లో అమరావతి, 2024లో గోదావరి పుస్తకాలు రాసినట్లు డీపీఆర్‌ఓ ప్రకటలో వెల్లడించారు.

ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజాగా సర్కారుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సదరు జర్నలిస్టు రెడ్డిగారిని, కలెక్టర్ అభినందించడం ఏమిటి? ఇప్పటికే జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భక్త అధికారులు ఎక్కువయ్యారు. ఎవరు ఏమిటో చూసుకునే పనిలేదా? ఇదేం గుడ్డి ప్రభుత్వం’’ అంటూ తూర్పు గోదావరి తమ్ముళ్లు, తమ పార్టీ-ప్రభుత్వంపై అగ్గిరాముళ్లలవుతున్నారు.

వారం క్రితం జర్నలిస్టు రెడ్డిగారికి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, విజయవాడలో నిర్వహించిన సభలో మంత్రి కందుల దుర్గేష్ అవార్డు ఇచ్చారు. దానిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారట. మంత్రి దుర్గేష్ అసలు టీడీపీ కార్యకర్తలను లెక్క చేయడం లేదంటూ ఇప్పటికే తమ్ముళ్లు రుసరసలాడుతున్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి, మంత్రి గారే ఎంపిక చేసి మరీ అవార్డు ఎలా ఇస్తారని తమ్ముళ్లు శివాలెత్తుతున్నారు.

LEAVE A RESPONSE