– ‘సారథ్యం’లో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
పుట్టపర్తి: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయిబాబా చేసిన సేవలు అమోఘమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కొనియాడారు. ఆయన మహిమలు, చేసిన సేవలతోనే అనంతపురం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టపర్తికి ఒక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ‘సారథ్యం’లో భాగంగా ఆయన శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తిలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా చైతన్య హోటల్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల టీ స్టాల్ ఎదురుగా పార్టీ నేతలతో కలిసి మాధవ్.. మేధావులు, స్థానికులు కార్యకర్తలతో కలిసి చాయ్ పే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించారు. పలువురు స్థానికులు స్థానికంగా ఉన్న సమస్యలను మాధవ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మాధవ మాట్లాడారు. పుట్టపర్తిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శేఖర్, కదిరి మాజీ ఎమ్మెల్యే మిట్టాపార్థసారథి, నేతలు పాల్గొన్నారు.