Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా క్విడ్ ప్రోకో పరిపాలన

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపణ

రాష్ట్రంలో నాలుగేళ్లుగా మూడు పువ్వులు, ఆరు కాయలతో నీకింత, నాకింత అంటూ క్విడ్ ప్రోకో పాలన జరుగుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వనరులను, ఆదాయాన్ని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు నీకింత, నాకింత అన్నట్లుగా పంచుకుంటున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితోనూ క్విడ్ ప్రోకో ఫార్ములానే కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నతో నేర్చుకున్న విద్య ఇదొక్కటే అని చెప్పారు. నవరత్నాలు ద్వారా అరకొర లబ్ధి చేకూరుస్తూ, దానినే బ్రహ్మాండం బద్దలైన అభివృద్ధిగా చూపుతున్నారని ఆరోపించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరుకు, ఢిల్లీ మద్యం కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్ గా మారటానికి కూడా క్విడ్ ప్రోకో లో లింక్ ఉందని అన్నారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు అమ్మకం, రాజధాని అమరావతి, అప్పులు, కేసులు వంటి అన్ని అంశాలలో కేంద్ర ప్రభుత్వంతో వైకాపాకు రహస్య ఎజెండా అమలు జరుగుతుందని తెలిపారు. బిజెపి కేంద్ర పెద్దలు కేంద్రంలో ఒకలా, రాష్ట్ర బిజెపి పెద్దలు రాష్ట్రంలో ఒకలా వ్యవహరించటం కూడా ఎజెండాలో భాగమే అన్నారు. రాష్ట్రంలోనూ వైన్,మైన్,లాండ్, శాండ్ వంటి వనరులను దోచుకుంటూ, వైకాపా నాయకులు పందారం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రికి అంగ బలం, అర్థబలంతో పాటు మీడియా బలం బలంగా ఉన్నా, తాను ఏమీ లేని అనాధను అన్నట్లుగా మాట్లాడున్నారని, తాను ఒంటరి వాడినని, ప్రత్యర్థులు మాత్రమే బలం కలిగిన వారిగా దుష్ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. పదే పదే ప్రతిపక్షాలపై రాళ్లు వేయడం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారి స్థితిగతులను, అభివృద్ధిలేమిని,వారికి జరుగుతున్న అన్యాయాలను మరిచిపోయేలా చేస్తున్నారని పేర్కొన్నారు.

మూడేళ్లుగా రాష్ట్రంలో జరిగిన డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, చీరాల కిరణ్, పులివెందుల నాగమ్మ,నంద్యాల మహాలక్ష్మి , అబ్దుల్ సలాం వంటి హత్యా సంఘటనల గూర్చి ఉద్యమిస్తున్నా, ఏ ఒక్క ప్రభుత్వ సలహాదారు కూడా సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. హత్య కేసులో నిందితులకు గజమాలలు, సన్మాన సభలు, ముందస్తు బెయిల్ ఇప్పించే పనిలో బిజీగా ఉంటూ దొంగే దొంగ దొంగ అంటూ ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కింది కులాల ప్రజలు ప్రభుత్వం ఆడుతున్న దాగుడు మూతలను అర్థం చేసుకోవాలని, రాష్ట్రంలో పిడికెడు ఆత్మగౌరవం కోసం నిర్వహిస్తున్న సభలను జయప్రదం చేయాలని కోరారు. ఒంగోలు డిక్లరేషన్ తో తాము రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంకెళ్లు వేసిన వారినే వచ్చి సంకెళ్లు తీయమని అడగటం కంటే, సత్తా పెంచుకొని సంకెళ్ళు ఛేదించడం మంచిది అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బోధనల మార్గదర్శకత్వంలో దళిత ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నట్లు బాలకోటయ్య వివరించారు.

LEAVE A RESPONSE