Suryaa.co.in

Editorial

పొత్తులపై ‘రాధా’ బాధ!

– తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు కథనాలు బూమెరాంగ్
– బీజేపీతో టీడీపీ పొత్తు రాధాకృష్ణ సొంత అజెండానా?
– ఆ మేరకు తన మీడియాలో కథనాలు
– ఏ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ ఇన్చార్జి తరుణ్ స్పష్టీకరణ
– తెలంగాణలో ఒంటరిపోటీయేనన్న ఇంద్రసేనారెడ్డి
– దానితో పోయిన పరువు టీడీపీ
– గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వద్దన్న రాధాకృష్ణ
– ఆ మేరకు వారాంతపు కథనాలతో మైండ్‌గేమ్
– కమలంతో కలిస్తే మునిగిపోతామంటూ హెచ్చరిక కథనాలు
– ఆ సలహాతోనే కమలంపై క త్తికట్టిన చంద్రబాబు
– గత ఎన్నికల్లో వైసీపీని పరోక్షంగా గెలిపించిన బీజేపీ
– టీడీపీ ఆర్ధికమూలాలలపై బీజేపీ చావుదెబ్బ
– టీడీపీకి ఆర్ధిక సాయం చేసే వారిపై ఐటీ-ఈడీ దాడులు
– తనపై బాబు యుద్ధాన్ని ఇంకా మర్చిపోని మోదీ
– బాబు మేధస్సు ఏమైందంటున్న టీడీపీ సీనియర్లు
– ఫలితాలను మీడియా మారుస్తుందా అని ప్రశ్న
– రాధాకృష్ణ పార్టీకి మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా అంటున్న మాజీ మంత్రులు
– తన సొంత అజెండాను పార్టీపై రుద్దుతున్నారంటూ టీడీపీ సీనియర్ల రుసరుస
( మార్తి సుబ్రహ్మణ్యం)

చంద్రబాబునాయుడు అపర చాణక్యుడు. ఒక తరానికి ముందే ఆయన ఆలోచలు ఉంటాయి. ఎక్కడ నె గ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన రాజనీతిజ్ఞుడాయన. ఇవీ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి, బయట ప్రపంచానికి ఉన్న అభిప్రాయాలు. కానీ.. ఆయన ఇప్పుడు సొంతంగా ఆలోచించడం మానేశారా? ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ ఆలోచనల ప్రకారమే నడుస్తున్నారా? పాలిటిక్స్‌లో ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబును, రాధాకృష్ణ చేయి పట్టి నడిపిస్తున్నారా?

మళ్లీ బీజేపీని టీడీపీకి దూరం చేసేవరకూ, రాధాకృష్ణ నిద్రపోరా? గత ఎన్నికల్లో ఇలాంటి ఐయిడాలిచ్చి, కమలం కన్నెర్రకు గురిచేసిన రాధాకృష్ణ.. మళ్లీ ఈసారీ అదే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయాలనుకుంటున్నారా? బీజేపీ-టీడీపీ పొత్తు కథనాలను వండివార్చిన వైనం, బూమెరాంగ్ ఎందుకయింది?

అసలు టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ అధికారికంగా ప్రకటన ఇచ్చేంత స్థాయిలో, కొంపముంచడానికి కారణమెవరు? అసలు రాధాకృష్ణ టీడీపీని ఏం చేయదలచుకున్నారు? ముంచదలచుకున్నారా? పెంచదలచుకున్నారా? ఇవీ.. ఇప్పుడు టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్లు, పొలిట్‌బ్యూరో సభ్యుల గుండెల్లో గూడుకట్టుకున్న సందేహాలు.

టీడీపీతో పొత్తుపై యోచిస్తున్నామని, బీజేపీ ఇన్చార్జి తరుణ్‌చుగ్ చెప్పారంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం.. టీడీపీని అడ్డంగా ఇరికించింది. ఆయన తన నివాసంలో నిర్వహించిన ‘లోరి’ వేడుకల సందర్భంగా, ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆంధ్రజ్యోతి వెల్లడించింది. అంటే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో కలసి పోటీ చేసే యోచన, బీజేపీకి ఉందన్న పరోక్ష సంకేతాలు పంపినట్టయింది.

ఇది బీజేపీలోని టీడీపీ వ్యతిరేక వర్గంలో కలకలం రేపింది. దానితో తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలను సదరు వర్గం, ఆగమేఘాలపై ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. దానితో ఆగ్రహం చెందిన తరుణ్‌చుగ్.. అసలు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పోటీ చేయదని, టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి సైతం ఇదే విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

నిజానికి రానున్న ఎన్నికల్లో.. బీజేపీతో కలసి పోటీ చేస్తుందన్న భావన, తెలంగాణ టీడీపీ వర్గాల్లో ఉంది. గతంలో టీడీపీ పొత్తుతోనే బీజేపీ ఐదు సీట్లు సాధించింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో , టీడీపీ బలంతో తమ పార్టీ కూడా బలం పెంచుకోవచ్చన్న భావన, అటు బీజేపీ వర్గాల్లోనూ లేకపోలేదు. మీడియాలో బీజేపీ హడావిడి చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దాని బలం తక్కువేనన్నది వారి నిశ్చితాభిప్రాయం. ఇప్పటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో 19నుంచి 25 స్థానాల్లోనే, బీజేపీ గట్టి పోటీ ఇస్తుందన్న భావన బీజేపీ వర్గాల్లో ఉంది.

ఇటీవలి ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం, ఫిబ్రవరిలో నిజామాబాద్‌లో మరో సభకు టీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో.. క్యాడర్ బేస్డ్ పార్టీ అయిన టీడీ పీతో కలిస్తే , బీజేపీ లక్ష్యం నెరవేరుతుందన్నది బీజేపీలోని ఒక వర్గం అంచనా. గత జీఎహెచ్‌ఎంసీ ఎన్నికల్లో.. టీడీపీ సీరియస్‌గా పోటీ చేయకపోవడం వల్లే, సెటిలర్లు ఉన్న డివిజన్లలో సెటిలర్లు టీఆర్ ఎస్‌ను గెలిపించారని, బీజేపీలోని ఒక వర్గం విశ్లేషిస్తోంది. పోటీ చేయడం వల్ల డబ్బులు వృధా అన్న అంచనాతో.. టీడీపీ నాయకత్వం, ఆ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదంటున్నారు.

అదే టీడీపీ సీరియస్‌గా కొన్ని డివిజన్లలో పోటీకి తలపడితే, బీజేపీకి అన్ని సీట్లు వచ్చేవి కావన్నది ఆ వర్గం విశ్లేషణ. అందువల్ల, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేస్తే, ఇరు పార్టీలూ లబ్ధిపొందుతాయన్న భావన, అటు టీడీపీ-ఇటు బీజేపీ వర్గాలలో లేకపోలేదు. ప్రధానంగా కొందరు బీజేపీ సీనియర్లు.. టీడీపీతో పొత్తు ఉంటే పార్టీ లబ్ధిపొందుతుందని, ఈపాటికే బీజేపీ నాయకత్వానికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

అటు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ మేధోవర్గం, రాయబారాలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. జనసేన-బీజేపీతో కలసి.. టీడీపీ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందన్న ప్రచారం, గత కొద్దికాలం నుంచీ వినిపిస్తోంది. గత ఎన్నికల గుణపాఠాల నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎట్టి పరిస్థితిలో దూరం చేసుకోకూడదన్న భావన, టీడీపీ నాయకత్వంలో లేకపోలేదంటున్నారు. అందుకే పార్లమెంటులో బిల్లులు, రాష్ట్రపతి-ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా, బీజేపీ కోరకుండానే మద్దతునిచ్చిన వైనాన్ని, టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

ఈవిధంగా గతంలో తన చర్యలపై ఆగ్రహించి, తన పార్టీని అధికారం కోల్పోయేలా చేసిన బీజేపీకి దగ్గరయేందుకు, టీడీపీ తన ముందున్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఆ నేపథ్యంలో… తరుణ్‌చుగ్ చేశారన్న వ్యాఖ్యలు ఆంధ్ర జ్యోతిలో రావడాన్ని, బీజేపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దానితో వచ్చే ఎన్నికల్లో తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, స్వయంగా తరుణ్‌చుగ్ ప్రకటన ఇచ్చేంతవరకూ వ్యవహారం బెడిసికొట్టింది.

అసలు ఇలాంటి కథనాలు.. టీడీపీనే రాయిస్తోందన్న అనుమానం, బీజేపీ నాయకత్వంలో స్థిరపడేందుకు అవకాశం ఏర్పడిందని, టీడీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.బీజేపీ-టీడీపీ పొత్తుకు సంబంధించి.. ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన తరుణ్‌చుగ్ వ్యవహారం, తమ పార్టీ పరువుపోయినట్లయిందని వారు తలపట్టుకుంటున్నారు.

ఈ విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారన్న వ్యాఖ్యలు, టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. టీడీపీ-బీజేపీ కలసి పోటీ చేయాలన్న రాధాకృష్ణ సొంత ఆలోచన- అజెండానే, ఇప్పుడు తమ కొంప ముంచిందని పలువురు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.

గత ఎన్నికల్లో కూడా రాధాకృష్ణ బీజేపీ విషయంలో.. తమ అధినేత చంద్రబాబును, ఇదేవిధంగా తప్పుదోవ పట్టించారని గుర్తు చేస్తున్నారు. బీజేపీతో కలసి పోటీ చేస్తే.. మునిగిపోతామని రాధాకృష్ణ , తన వారాంతపు కథనాల్లో బాబును హెచ్చరించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

దానితో రాధాకృష్ణ సలహాతోనే, తాము బీజేపీపై యుద్ధం ప్రకటించాల్సిన వచ్చిందని టీడీపీ సీనియర్లు చె బుతున్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయంటూ, అప్పుడు రాధాకృష్ణ చెప్పిన జోస్యం బూమెరాంగయిందని గుర్తు చేస్తున్నారు.

రాధాకృష్ణ సలహాతో, బీజేపీపై యుద్ధం చేసిన తమ పార్టీ.. ఇప్పటివరకూ రాజకీయంగా- ఆర్ధికంగా కోలుకోలేకపోతోందటున్నారు. గత ఎన్నికల ముందు బీజేపీతో శత్రుత్వం పెట్టుకోవడంతో, తమ పార్టీకి వచ్చే నిధులన్నీ నిలిచిపోయాయంటున్నారు. తమకు నిధుల సాయం చేసే వ్యక్తులు-సంస్థలపై ఈడీ,ఐటీ దాడులు చేసిన విషయాన్ని, టీడీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు గుర్తు చేస్తున్నారు. వీటికి మించి.. బాబు భరోసాతో ఎన్నికల సమయంలో అప్పులు చేసిన తాము, ఆర్ధికంగా ఇప్పటికీ కోలుకోలేదని పలువురు సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

గతంలో తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా ఉండేదని, ఇప్పుడు ఆ ధీమా సన్నగిల్లిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇదంతా రాధాకృష్ణ సలహా-సూచనలను, తమ అధినేత గుడ్డిగా పాటించడమే కారణమంటున్నారు. ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అయిన తమ అధినేత, ఒక మీడియా అధినేత సలహాలు గుడ్డిగా అమలుచేయడమే, తమకు ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

ఏపీలో బీజేపీతో శత్రుత్వం తెచ్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఇప్పుడు తెలంగాణలో కూడా.. తమ పార్టీ ఉనికి లేకుండా చేసేవరకూ, నిద్రపోయేలా లేరన్న వ్యాఖ్యలు, టీడీపీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ‘‘ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఈలోగా ఎవరి పార్టీలు వారి బలాన్ని పెంచుకునే పనిలో ఉంటాయి. అప్పుడు ఎదుటి పార్టీ వాళ్లే పొత్తులకు వస్తారు. ఇది కామన్‌సెన్స్‌తో కూడిన వ్యవహారం. తెలివైన ఏ పార్టీ కూడా, అప్పుడే పొత్తుల గురించి మాట్లాడదు. కానీ, బీజేపీతో టీడీపీ పొత్తుకు బీజేపీ ఆలోచిస్తుందని ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం, మాలాంటి వారికే అతిగా అనిపించింది. మరి బీజేపీకి మాత్రం ఎందుకు కోపం రాదు? ఏపీలో రాధాకృష్ణ ఈ తెలివితేటలు ప్రద ర్శించే, గతంలో బీజేపీని దూరం చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తెలివితేటలు ప్రదర్శించి, మరోసారి సమాధి చేసేలా ఉన్నార’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE