– రఘురామ కస్టోడియల్ టార్చర్ ఎపిసోడ్
– రాజు గుండెపై కూర్చుని హింసించిన ఆ ‘తులసి’దళం ఎవరు?
– ఇప్పుడు గుడివాడలో చక్రం తిప్పుతున్న ఘనుడు
– తనను సిఐడి కస్టడిలో ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి కొట్టారన్న రఘురామ
– సునీల్ దన్నుతో అడ్డుగోలుగా సంపాదించిన ఆ ముగ్గురు
(సుబ్బు)
గుంటూరు సీఐడీ ఆఫీసులో తనను చిత్రహింసలు పెట్టిన ఆ నలుగురిలో ఒకరి పేరును రఘురామ ఈ రోజు రివీల్ చేశారు. రఘురామ రివీల్ చేసిన వారిలో ఒకరు తులసి కాగా, మిగిలిన ఇద్దరు గౌరీ శంకర్, చంద్రశేఖర్. తులసి, గౌరిశంకర్, చంద్రశేఖర్ ఈ ముగ్గురు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు అత్యంత సన్నిహితులు. సునీల్ కుమార్ సహకారంతో ఆర్ధికంగా ముగ్గురు బాగా స్ధిరపడ్డారన్న ప్రచారం లేకపోలేదు.
సునీల్ కుమార్ సెటిల్మెంట్లు చక్కబెట్టడంలో, వీరి ముగ్గురే కీలకంగా వ్యవహరించారు. తప్పుడు కేసులతో బెదిరించి భయబ్రాంతులకు గురిచేసి కొన్ని వ్యాపారాలను సదరు ముగ్గురు వ్యక్తుల పరం చేయడంలో సునీల్ కుమార్ గణనీయమైన పాత్ర పోషించారు.
ఎవరా తులసి? ఏమా కథ?
కాగా తానుగుంటూరు సీఐడీ ఆఫీసు నిర్బంధంలో ఉన్నప్పుడు ముగ్గురు తనను చిత్రహింసలు పెడితే, ఒకరు తనను కొట్టిన దృశ్యాలను వీడియో తీశారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. అందులో భారీ కాయుడైన తులసి, తన గుండెపై కూర్చుని తనకు ఊపిరాడకుండా హింసించారన్నది రాజు ఆవేదన. అప్పటికే గుండె ఆపరేషన్ చేయించుకున్న తనకు, ఊపిరి ఆడలేదని రాజు గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అదే తులసి.. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యేకు కుడిభుజంగా వ్యవహరిస్తూ, షాడో ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారన్నది బహిరంగ రహస్యమేనంటున్నారు.
ఎక్కడ బెడిసి కొట్టింది?
ఒక ఎన్.ఆర్.ఐ. వ్యవహారంలో సెటిల్మెంట్ కోసం అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీచేసి, ఇక్కడ ఉన్న అతని కుటుంబసభ్యులు సునీల్ అండ్ కో (ముగ్గురు) తీవ్రంగా వేదింపులకు గురిచేసింది. దీనితో ఆ ఎన్.ఆర్.ఐ. అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఆశ్రయించారు. అప్పటికే తులసి సునీల్ కుమార్ తో సన్నిహితంగా ఉంటూ, వెనిగండ్ల రాము వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇప్పటికీ బంధం కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు. రాము సతీమణికి సునీల్ దగ్గరి బంధువన్న ప్రచారం కూడా లేకపోలేదు.
దీనితో కొడాలి నాని ఎన్.ఆర్.ఐ. వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన జగన్.. సునీల్ ను సిఐడి ఛీఫ్ గా తప్పించడం జరిగింది.
అదీకాక.. ఒంగోలులో ఎమ్మెల్యే కరణం బలరామ్ బంధువైన, కెబి రెస్టారెంట్ యజమాని వీరయ్యను.. సునీల్ ఏర్పాటుచేసిన సంస్థ సభ్యులు బెదిరించడం ప్రారంభించారు. దాదాపు పదిసార్లు బార్‌లోకి వెళ్లి బీభత్సం సృష్టించారు. సంస్థకు చందాలివ్వాలని బెదిరించారు. బార్‌లోని కంప్యూటర్లు ఎత్తికెళ్లి భయానక వాతావరణం సృష్టించారు.
నాటి ఎంపి నందిగం కుటుంబసభ్యులు రంగంలోకి తాము ఈ వ్యవహారాన్ని సెటిల్ చేస్తామన్నారు. విషయం తెలిసిన నాటి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరాం, కరణం వెంకటేష్ నేరుగా తాడేపల్లికి వెళ్లి, జగన్ కార్యదర్శి ధనంజయరెడ్డి వద్ద పంచాయితీ పెట్టారు. తమ వారిపైనే జులుం చేస్తున్నారని, తెగబడి చందాలు వసూలు చేస్తే ఎలా సహించాలని అగ్గిరాముళ్లయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకోకపోతే తాను ఎక్కడికైనా వెళతానని కరణం బలరామ్ హెచ్చరించారు. అసలు తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఇంత దౌర్జన్యం చేస్తే తాను చూస్తూ ఊరుకోలేనని బాలినేని స్పష్టం చేశారు. దానితో దిద్దుబాటుకు దిగిన ధనంజయరెడ్డి, ఈ వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారట. ఈ ఫిర్యాదు చేసిన మరుటిరోజునే సునీల్ సీఐడీ నుంచి బదిలీ కావడం విశేషం. సిఐడి ఛీప్ గా సునీల్ ను తప్పించడంతో, ఆ ముగ్గురు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తులసి వెనిగండ్ల రాము దగ్గర ఉండిపోయి గుడివాడకు పరిమితమయ్యారు.
ఇక రెండవ వ్యక్తి గౌరీ శంకర్ .. గౌరీశంకర్ అనే వ్యక్తి లోకేష్ పై సిఐడి లో తప్పుడు కేసు పెట్టిన వ్యక్తి. ఈ నేపధ్యంలో లోకేష్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తులను పట్టుకుని, తనను బెదిరించి కేసు పెట్టించారని నమ్మబలికే వైసిపికి చెందిన కొంత సమాచారం ఇస్తాను అని చెప్పి లోకేష్ టీం గుడ్ బుక్స్ లో చేరిపోయారు. అయితే ఈ గౌరీ శంకర్ ప్రస్తుతం వి డిజిటల్ అనే కేబుల్ రన్ చేస్తున్నారు.
ఈ వి డిజిటల్ కేబుల్ విశాఖపట్టణానికి చెందిన భార్యాభర్తలది. సునీల్ కుమార్ సహకారంతో వి డిజిటల్ యజమానులైన భార్యాభర్తలపై తప్పుడు కేసులు పెట్టి, బెదిరించి మరి ఆ కేబుల్ వ్యాపారాన్ని గౌరిశంకర్ హస్తగతం చేసుకున్నారు. మరో వ్యక్తి చంద్రశేఖర్ గురించి పూర్తి సమాచారం తెలియాల్సిఉంది