-వందశాతం హాజరు
-ప్రశ్నలలో ఆయనే ముందు
-‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్స్’ ఏజెన్సీ తన నివేదికలో వెల్లడి
-టీడీపీ-జనసేన పోరాటానికి ముందే కూసిన తొలికోడి రఘురామరాజు
-జగన్ సర్కారుపై ఫిర్యాదుల్లో రికార్డు ఆయనదే
( అన్వేష్)
అప్పటికి ఇంకా టీడీపీ-జనసేన కోడి కూయలేదు. కూయడమే కాదు.. అసలు గంప నుంచి ఇంకా బయటకు రాలేని సమయం. అప్పటికి జనసేనది పార్ట్‌టైం పోరాటం. గొంతెత్త్తితే జగన్ సర్కారు ఎక్కడ నిర్దాక్షిణ్యంగా నొక్కిపడేస్తుందోనన్న భయం. ఆస్తులు ఎక్కడ కబ్జా చేస్తుందోనన్న ఆందోళన. వ్యాపారాలపై దాడులు చేసి ఎక్కడ కేసులు పెడుతుందేమోనన్న భయం. ధర్నాలు చేస్తే ఎన్ని కేసులు పెడతారేమోనన్న పలాయనం. కలసి వెరసి టీడీపీ-జనసేన నేతల మౌనవ్రతం.
ఆ సమయంలో పార్లమెంటు వేదికగా చేసుకుని.. ఓ తెలుగు ఎంపీ జగన్‌రెడ్డి సర్కారుకు నిద్రలేని రాత్రులు చూపించారు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారమే ఆ తెగింపునకు కారణం. అసలు జగన్‌రెడ్డి పేరెత్తేందుకే వణికిపోయిన ఆరోజుల్లో.. ఎవరికీ భయపడకుండా, చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకున్నా వెరవకుండా.. జగన్ సర్కారుతో కలబడి,నిలబడిన ఆ ఎంపీ.. 2019-2014 లోక్‌సభలో తన పనితీరుతో వందశాతం మార్కులు సాధించారు. ఆయనే నర్సాపురం మాజీ ఎంపి రఘురామకృష్ణంరాజు.
ఇప్పటి ఉండి టీడీపీ ఎమ్మెల్యే.. మొన్నటి నర్సాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో రికార్డు సృష్టించారు. అప్పట్లో ఆయన సాంకేతికంగా వైసీపీ ఎంపీగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ ఎంపీలు వేయనన్ని ప్రశ్నలు వేశారు. ప్రతిరోజూ సభకు హాజరవడంలో ఆయనే నెంబర్ వన్‌గా నిలిచారు. ఒక్కరోజు కూడా సభకు డుమ్మా కొట్టకుండా, లోక్‌సభకు హాజరైన ఏకైక ఎంపీగా రికార్డు సృష్టించారు. ఇవన్నీ ‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్స్’ ఏజెన్సీ తన నివేదికలో వెల్లడించింది. పార్లమెంటులో హాజరు, లేవనెత్తిన ప్రశ్నల ఆధారంగా ఈ ర్యాంకులు వెల్లడించింది. గల్లా జయదేవ్, వంగాగీత, రామ్మోహన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారట.
నాలుగేళ్లపాటు జగన్ సర్కారు అప్రజాస్వామ్యవిధానాలు, ప్రజలపై వేధింపులు, సీఐడీ దాడులు, జగన్ సర్కారు అప్పులు, ప్రాజెక్టులలో అవినీతి అంశాలపై శరపరంపరగా లేఖలు రాసిన రఘురామకృష్ణంరాజు.. ఆమేరకు లోక్‌సభలో తన వాణి వినిపించారు. సహచర వైసీపీ సభ్యులు తనను అడ్డుకుంటున్నా లెక్కచేయకుండా, జగన్ సర్కారు అవినీతిని దేశానికి చాటారు. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా.. కేంద్రహోంమంత్రికి ఆయన రాసినన్ని లేఖలు ఏ ఎంపీ కూడా రాయలేదు.