-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని దాడి చేసింది మా పార్టీ గుండాలా?, టిడిపి కార్యకర్తలో తేల్చండి
-వైసిపి గుండాలతో కలిసి నడిచిన పోలీసులు… విజువల్స్ ఆధారంగా ఐదు నిమిషాల్లో నిందితుల్ని గుర్తించి అరెస్టు చేయవచ్చు
-రాష్ట్రంలో సంఘవిద్రోహక శక్తుల్లా కొంతమంది పోలీసులు… వారి సంఖ్య రోజు కింద రెట్టింపవుతోంది
-సర్పంచ్ వ్యధ – పంచాయితీరాజ్ వ్యవస్థ వద ను ఇంటింటికి ప్రచారం చేయండి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల వ్యవహార శైలి ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పుంగనూరు నుంచి పూతల పట్టుకు వెళ్లే దారిలో , ఆయనపై, ఆయన తో కలిసి నడుస్తున్న కార్యకర్తలు, నాయకులపై మా పార్టీ జెండాలు పట్టుకున్న వారు రాళ్లదాడి చేశారు. తమ పార్టీ జెండాలను పట్టుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలే ఆ రాళ్ళ దాడికి పాల్పడ్డారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొంటూ, సాక్షి దినపత్రికలో రాసుకుని, చిత్తూరు జిల్లా బంద్ నిర్వహించడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని చంద్రబాబు నాయుడుతో పాటు టిడిపి కార్యకర్తలపై రాళ్ళదాడికి పాల్పడ్డ వారితో కలిసి పోలీసులు ముందుకు నడిచారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడింది ఎవరో తేల్చండి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని దాడి చేసింది మా పార్టీ కార్యకర్తలు నాయకులా?, లేకపోతే టిడిపి కార్యకర్తల అన్నది విజువల్స్ ఆధారంగా ఐదు నిమిషాల వ్యవధిలో తేల్చవచ్చు. పులివెందుల, కదిరి బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి లభించిన అపూర్వ ఆదరణ చూసి మా పార్టీ నేతల గుండెలు బెంబేలెత్తినట్టయింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పై రాళ్ల దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు ప్రతిఘటించినట్లుగా ఎక్కడ కనిపించలేదు. అధికార పార్టీ కార్యకర్తలతో మమేకమైనట్లుగా కనిపించారు.
టిడిపి కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని వచ్చారని అంటున్నారు. మరి పోలీసులు వారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకొని కలిసి నడిచారా?, లేకపోతే వారు టిడిపి కార్యకర్తలని పోలీసులకు తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. సాక్షి మీడియాలో ఎడిట్ చేసిన విజువల్స్ ప్రదర్శించినప్పటికీ, మిగతా ఛానళ్ల ను కూడా ప్రజలు చూస్తారని తెలుసుకోవాలి.
టిడిపి కార్యకర్తలే తమ వాహనాలు, బస్సుల పై దాడి చేసుకుని ధ్వంసం చేసుకుంటారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాళ్ల దాడి చేసిన వారిపై కాకుండా పోలీసులు, తలలు పగిలిన వారిపై, దెబ్బలు తగిలిన వారిపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. గతంలో తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేయడం, న్యాయమూర్తులు కూడా వారికి 14 రోజులు రిమాండ్ విధించడం సర్వ సాధారణంగా జరిగేది. కానీ పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని తెలుసుకున్న న్యాయమూర్తులు కూడా ఇప్పుడు అన్ని విషయాలను ఆరా తీస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
పోలీసుల్లో కొంతమంది ఎంత వెధవలో నాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు..
పోలీసుల్లో కొంతమంది ఎంత పనికిమాలిన వెధవలో నాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. పోలీసుల గురించి మాట్లాడితే… ఆ సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారట. నన్ను గతంలో ఏ కారణం చేత అరెస్టు చేశారు. కెమెరాలను తొలగించి, లాకప్ లో చిత్రహింసలకు ఎందుకు గురి చేశారు. నా సెక్యూరిటీని తొలగించి దారుణంగా హింసించిన ఘటనపై పోలీసు సంఘం ప్రతినిధులు సమాధానం చెప్పాలి. పోలీసుల దాష్టికాలు నాకంటే ఎక్కువగా మరెవరికి తెలియవు. రాష్ట్ర పోలీసులలో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నారు. అందరూ కాదు. అటువంటి వారి సంఖ్య రోజుకింత పెరుగుతోంది. అది వ్యవస్థకు మంచిది కాదు.
జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ లేకపోతే మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ని హతమార్చినట్లుగానే నన్ను కూడా గొడ్డలితో చంపే వారేమోనని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. హింసకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు మా పార్టీ కాదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు. హింసను ప్రేరేపించేది ఎవరు?, వ్యతిరేకించేది ఎవరో ప్రజలందరికీ తెలుసు.
ఎవరైనా దాడి చేసినా ఇంకా రెండు దెబ్బలు తిన్నా సరే తిరగబడమని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. అటువంటి చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడి జరిగినప్పుడు ఎన్ ఎస్ జి రక్షణ సిబ్బంది ప్లాస్టిక్ షీల్డ్ లను అడ్డంపెట్టి ఆయన్ని రక్షించారు. ఒకవేళ రాళ్లదాడిలో రాయి తగలరాని చోట తగిలి ఉంటే ప్రాణం పోయి ఉండేది. మా వాళ్లు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు. బాబాయిని లేపేసిన బ్యాచ్.
శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజు కాగా, పోలీసులు మాట్లాడిన తీరు ప్రజాస్వామ్యానికి దుర్దినమని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ సిబ్బంది వెళ్తున్న బస్సులపై కూడా రాళ్ల దాడి చేశారట. వాళ్లపై కూడా టిడిపి కార్యకర్తలే దాడి చేశారా?, తమ పార్టీ ఎంపీ కి చెందిన కంపెనీ బస్సులపై ఎవరైనా దాడి చేస్తారా?, అమర్ రాజా బ్యాటరీ సంస్థ ఉద్యోగుల బస్సులపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
టిడిపి కార్యకర్తలు తిరగబడతారని మా పార్టీ పెద్దలు ఊహించలేదు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై, టిడిపి కార్యకర్తలపై జరిగిన రాళ్ల దాడికి ఆ పార్టీ కార్యకర్తలు తిరగబడి ప్రతిఘటిస్తారని మా పార్టీ పెద్దలు ఊహించలేదు. టిడిపి కార్యకర్తలు తిరగబడి కొట్టేసరికి వైసిపి గుండాలు పరుగందుకున్నారు. ఇన్నాళ్లు కొడితే ప్రజలు కొట్టించుకున్నారు. తిడితే తిట్టించుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కొడితే తిరిగి కొడుతున్నారు. ఎవరైనా దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించిన శిక్ష లేదని చట్టమే చెబుతోంది. ఈ లెక్కన టిడిపి నాయకుల పై జరిగిన రాళ్ల దాడిని తిప్పి కొట్టడం చట్ట ప్రకారం నేరమేమీ కాదని రఘు రామ కృష్ణంరాజు అన్నారు .
దరిద్రంగా పోలీసుల వ్యవహార శైలి
రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహార శైలి దరిద్రంగా ఉంటోంది . రాళ్లదాడి అనంతరం చిత్తూరు పోలీసులు మాట్లాడుతూ… రెండు పార్టీలను సమానంగా చూస్తామని చెబుతూనే, ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంతోమంది నా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే వాటిని దగ్గరుండి తొలగింప చేశారు. ఫ్లెక్సీలను తొలగించకపోతే గంజాయి రవాణా తో పాటు ఇతర కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. ఎవరు, ఎవరు ఏమేమి మాట్లాడారో ఫోన్ నెంబర్లతో సహా సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తాను. ఫోన్లో నా ఫోటోను ఎవరైనా డీపీగా పెట్టుకున్నా కూడా వారిని బెదిరించి తొలగించాలని హెచ్చరించారు. నా ఫ్లెక్సీలను, డిపి లను తొలగించాలని బెదిరించాల్సిన అవసరం పోలీసులకు ఏమిటి?, పోలీసులు నిస్వార్ధంగా వ్యవహరించే వారే అయితే ఇటువంటి చర్యలకు పాల్పడతారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఎటువంటి కేసులు నమోదు చేయని సిఐడి పోలీసులు, ఒక సమాజ హితమైన సందేశాన్ని ఫార్వర్డ్ చేసినందుకు మహిళ అని కూడా చూడకుండా రంగనాయకమ్మ పై కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా జనసేన, టిడిపి కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టారు?, వైసీపీ కార్యకర్తలపై ఏమైనా కేసులు నమోదు చేశారా, గుండెపై చేయి వేసుకొని చెప్పాలన్నారు. సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ వ్యవహరించిన నాటి నుంచి నేటి వరకు టిడిపి, జనసేన కార్యకర్తల పై నమోదు చేసిన కేసులు ఎన్ని?, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై నమోదు చేసిన కేసులు ఎన్ని? లిస్టు బయట పెట్టాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. దళితులపైనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి వేధించిన ఘనత ఏపీ పోలీసులకే దక్కుతుందన్నారు.
పోలీసులు నిస్వార్ధంగా వ్యవహరిస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇకనైనా తమ చేతల ద్వారా ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి. పులులు మాంసాహారం తినడం మానేశాయంటే, నక్కలు జిత్తులు వేయడం మానేశాయంటే ఎవరైనా నమ్మగలరా?, అలాగే పోలీసులు కూడా నిజాలు చెబుతామంటే ఎవరు నమ్మరు. సోషల్ మీడియా కేసులే దానికి ఉదాహరణ. ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు. ఇప్పుడు పిచ్చి వేషాలు వేస్తున్న వాళ్ళందరికీ తగిన శాస్తి జరగకుండా ఉండాలంటే, ఇకనైనా న్యాయంగా ఉండండి. అన్యాయం చేయకండి. తప్పు చేసిన వారిని శిక్షించండి. అంతేకానీ కాసులకు కక్కుర్తి పడి, పదవి కోసం నాలాగా ప్రజల కోసం పోరాడే వారిని, నిజాలు చెప్పే వారిని ఏదో చేయాలని ప్రయత్నిస్తే… ఈ ప్రభుత్వానికి మిగిలింది ఐదే నెలలు. ఆ తర్వాత సదరు అధికారుల తోక కట్ అవుతుంది. వెధవ వేషాలు వేస్తున్న వైసీపీ కార్యకర్తలు ఇకనైనా మారణ హోమాన్ని ఆపండి అని హెచ్చరించారు.
పెద్దిరెడ్డి మనుషులే దాడి చేశారని పరోక్షంగా చెప్పిన సత్తిబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆ పార్టీ కార్యకర్తల పై దాడి చేసింది మంత్రి పెద్దిరెడ్డి అనుచరులేనని చెప్పకనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని రఘురామకృష్ణం రాజు అన్నారు. పెద్దిరెడ్డి మనుషులను కొడితే కొట్టిచ్చుకోమ్మంటారా అని సత్తిబాబు ప్రశ్నించడం పరిశీలిస్తే, ఆ దాడి చేసింది పెద్దిరెడ్డి మనుషులేనని చెప్పకనే చెప్పినట్లు అయింది. గతంలో కొడితే రాష్ట్ర ప్రజలు, టిడిపి కార్యకర్తలు కొట్టించుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సభలు, సమావేశాలు ఇకపై మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత ప్రజల్లో తిరగకపోతే భయపడిపోయారని మా పార్టీ వారే అంటారు.
అందుకే ఆయన విస్తృతంగా రాష్ట్రవ్యాప్త పర్యటన చేసే అవకాశం ఉంది. ఇకపై పిచ్చి వేషాలు వేస్తే జనమే మా పార్టీ కార్యకర్తలను తన్నడం ఖాయం. గతంలో రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల పై ప్రతిపక్ష పార్టీల నాయకులపై జరిగిన దాడుల గురించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. చంద్రబాబు నాయుడు పై తాజాగా జరిగిన రాళ్ల దాడిని విజువల్స్ తో సహా ఒక లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకు వెళ్తాను. ఈ సంఘటనపై నిష్పక్షపాతమైన విచారణ జరపాలని కోరుతానని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ఇదే తరహా పిచ్చి వేషాలు వేస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన హెచ్చరించారు. చంద్రగ్రహం కాస్త ప్రజాగ్రహంగా మారిందని, పోలీసులు అబద్ధాలు చెప్పడం మానాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.
గతంలో పూల యుద్ధం ఇప్పుడు గదా యుద్ధం
రాష్ట్ర సమస్యలపై గతంలో అధికార పార్టీతో బిజెపి రాష్ట్ర నాయకత్వం పూల యుద్ధం చేసేదని, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందరేశ్వరి నియమితురాలు అయిన తర్వాత గదా యుద్ధం జరుగుతోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. పంచాయితీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తస్కరించడాన్ని బాబు రాజేంద్రప్రసాద్, సర్పంచులతో కలిసి నేను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సర్పంచ్ల సమస్యలను, పంచాయతీ నిధుల దారి మళ్లింపు పై పురందరేశ్వరి తన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారన్నారు. పంచాయతీ నిధుల దారి మళ్లింపు పై తక్షణ చర్యలకు ఆదేశిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. రాష్ట్రంలో 12,800 పై చిలుకు గ్రామపంచాయతీలు ఉండగా, అందులో 80 శాతం మంది సర్పంచులు మా పార్టీకి చెందినవారే.
ప్రజా జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరాలని సొంత నిధులు వెచ్చించి ఎనర్జీ ఎస్ పనులు చేపట్టిన సర్పంచులకు ఇప్పటివరకు బిల్లులు అందకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారయింది. సర్పంచులు తమకు జరిగిన అన్యాయాన్ని గ్రామాలలో ఇంటింటికి తిరిగి వివరించాలి. గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని జమోరె ప్రభుత్వం వివస్త్రను చేసింది. రేపు గ్రామాలలో సర్పంచులు తిరగబడితే, వాలంటీర్ వ్యవస్థ కాపాడుతుందా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రేపు నేను , లేకపోతే మరొకరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే అవకాశం ఉంది. వాలంటీర్ల వల్ల ప్రజలతో ప్రజాప్రతినిధులకు సంబంధాలు లేకుండా పోతున్నాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి తో పాటు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖాలను చూసి ప్రజలు ఓట్లు వేయలేదు. స్థానిక నాయకత్వాన్ని చూసే ఓట్లు వేశారన్న విషయాన్ని గుర్తించాలి. ఇప్పటికైనా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి లు తమ ఫేస్ వ్యాల్యూ ని తగ్గించుకొని, ఇతరుల పేస్ కు వ్యాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలి. అలాగే మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను గౌరవించాలి. లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి తిరుగుబాటు తప్పదని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.