October 13, 2026

రాహుల్ గాంధీ ‘రౌడీ గాంధీ’గా మారిపోయారు

  • ఏఐసిసి చీఫ్ కావాలన్నదే రేవంత్ అసలు టార్గెట్
  • 13 కోట్ల ఓట్ల చోరీ ఆరోపణలు కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగమే
  • దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తో సహా ఏ బూత్‌కైనా రండి
  • ఐకిడో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ పేరుతో ‘మౌంటెడ్ ఎల్బో చోక్’ అనే ప్రమాదకర టెక్నిక్‌ను సొంత కార్యకర్తపైనే ప్రయోగించే ప్రయత్నం చేశారు
  • ఒక వైద్యుడిగా చెబుతున్నాను.. మెడ, శ్వాసనాళం పై ఒక్క నిమిషం పాటు ఆ ఒత్తిడి పడితే స్పాట్‌లోనే మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం
  • మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్: దేశంలో సంక్షోభాన్ని సృష్టించేందుకు రాహుల్ గాంధీ కుట్ర పన్నుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ‘రౌడీ గాంధీ’గా మారిపోయారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ దాడిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి. 13 కోట్ల ఓట్ల చోరీ ఆరోపణలు కేవలం కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగమే. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తో సహా ఏ బూత్‌కైనా రండి.. పరిశీలిద్దాం. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకనే ఈసీ, న్యాయవ్యవస్థ వంటి స్వతంత్ర సంస్థలపై నిరాధార నిందలు వేస్తున్నరు.

ర్యాలీల పేరిట మహిళా జర్నలిస్టులు, పోలీసులపై రాహుల్ గాంధీ దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్య.. దేశంలో కృత్రిమంగా సంక్షోభ పరిస్థితిని సృష్టించి, విదేశీ శక్తుల అండతో ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరిచేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుట్రలు పన్నుతున్నారు. పార్లమెంట్‌లో మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు, రోడ్లమీదికి వచ్చి ఒక వీధి రౌడీలా ప్రవర్తిస్తూ ‘రౌడీ గాంధీ’గా మారిపోయారు.

మొన్న జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నా రాహుల్ గాంధీకి పట్టుకున్న తీవ్రమైన అభద్రతా భావం, క్రెడిబిలిటీ లేమికి నిదర్శనం. నిరసనల పేరిట రాహుల్ గాంధీ చేస్తున్న విన్యాసాలను మీడియా విజువల్స్‌లో దేశమంతా చూసింది. ఐకిడో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ పేరుతో ‘మౌంటెడ్ ఎల్బో చోక్’ అనే ప్రమాదకర టెక్నిక్‌ను సొంత కార్యకర్తపైనే ప్రయోగించే ప్రయత్నం చేశారు. ఒక వైద్యుడిగా చెబుతున్నాను.. మెడ, శ్వాసనాళం పై ఒక్క నిమిషం పాటు ఆ ఒత్తిడి పడితే స్పాట్‌లోనే మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విచక్షణ కోల్పోయి వీధి రౌడీల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులను నెట్టేయడం, దురుసుగా ప్రవర్తించడం దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడలేదు. ‘చలో సుప్రీంకోర్టు’ పేరిట ర్యాలీ చేస్తూ, విధి నిర్వహణలో ఉన్న రిచా పరాశర్ అనే మూడు నెలల గర్భిణి అయిన మహిళా జర్నలిస్టును బలవంతంగా తోసేశారు. కడుపులోని బిడ్డ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ప్రవర్తించిన ఈ చర్య అత్యంత అమానుషం. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

సైనిక పాలన ఉండే పాకిస్తాన్‌లో సైతం న్యాయవ్యవస్థ అంటే భయభక్తులు ఉంటాయి. కానీ, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, నేతలు బాధ్యతారాహిత్యంగా న్యాయస్థానాలను బెదిరిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా అడిగారు, రేపు సీజేఐని అడుగుతారు, ఆ తర్వాత ఆర్మీ చీఫ్‌ను కూడా రాజీనామా చేయమంటారేమో.

బంగ్లాదేశ్, శ్రీలంక, అరబ్ స్ప్రింగ్ తరహాలో దేశంలో అరాచకం సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న విదేశీ కుట్రల భాగస్వామిగా కాంగ్రెస్ మారింది. అజిత్ దోవల్ వంటి అధికారులపై కూడా వీరు విమర్శలు చేస్తున్నారు. ఈ అరాచక వైఖరిపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి, రాహుల్ గాంధీపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ర్యాలీలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఎంత అవమానకరంగా పక్కకు నెట్టేశారో చూశాం. తమ కుటుంబానికి కాపలా కాసే సీనియర్ నేతలను కించపరచడం గాంధీ నెహ్రూ కుటుంబానికి తొలినుంచీ ఉన్న అలవాటే.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మన తెలంగాణ బిడ్డ టంగుటూరి అంజయ్య గారిని బేగంపేట ఎయిర్‌పోర్టులో రాజీవ్ గాంధీ ఎలా అవమానించారో తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆ ఆత్మగౌరవ పోరాటమే నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి, కాంగ్రెస్ పతనానికి దారితీసింది.

కర్ణాటకలోనూ వీరేంద్ర పాటిల్‌ను అలాగే అవమానించారు. ఆత్మాభిమానం, కనీస విచక్షణ ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. 13 కోట్లలో దాదాపు 3 కోట్ల మంది ట్రేస్ చేయలేని అబ్సెంట్ ఓటర్లు (వీరిలో బంగ్లాదేశీలు, అక్రమ చొరబాటుదారులు సైతం ఉంటారు). 6.30 కోట్ల మంది ఓటర్లు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి షిఫ్ట్ అయినవారు. 2.80 కోట్ల మంది చనిపోయినవారు కాగా, కోటి మందికి పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల సంఘం సాధారణ ప్రక్షాళనలో భాగంగానే ఈ డూప్లికేట్ ఓట్లను తొలగించింది. హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 40 లక్షల ఓట్లు తగ్గాయి. ఎల్బీనగర్‌లో ఉండే 40–50 వేల మందికి మునుగోడులోనూ ఓట్లు ఉన్న పరిస్థితిని చూశాం. ఉప్పల్, బోధన్, ఆలేరు, జనగాంలలోనూ డబుల్ ఓట్లు బయటపడ్డాయి.

ఈ అంశంపై బీజేపీ బహిరంగ సవాల్ విసురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తో సహా రాష్ట్రంలో ఏ పోలింగ్ బూత్‌కైనా రండి, మీడియా సమక్షంలో కూర్చుని నిగ్గుతేలుద్దాం. కాంగ్రెస్ ఆరోపణలు తప్పని తేలితే రాజీనామా చేస్తారా? రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వచ్చే దమ్ముందా?

రాహుల్ గాంధీని తప్పించి ఏఐసీసీ పీఠం దక్కించుకోవాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి రోజూ మాటలు మారుస్తున్నారు. నిన్నటివరకు ‘ఆర్య వర్సెస్ ద్రావిడ’, ‘శివ వర్సెస్ రామ్’ అన్న రేవంత్ రెడ్డి.. నిన్న గోవా వెళ్లి కాంగ్రెస్ అంటే రాముడు, బీజేపీ అంటే రావణుడు అంటున్నారు. అసలు వీరికి రాముడితో పోల్చుకునే నైతిక హక్కు ఎక్కడుంది?

Total Visitors: 2,950,810