– ఏపీసీసీ చీప్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: ఓట్ చోర్.. గద్దె చోడ్… ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ తీగలాగుతుంటే మోడీ డొంక కదులుతోంది. ఓట్ల దొంగ మోడీ బాగోతం ఒక్కొక్కటిగా బట్టబయలవుతోంది… కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు పథకం ప్రకారమే దేశంలో ఓట్ చోర్ జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె ఇంకా, ఏమన్నారంటే…
నేడు ఈసీఐపై రాహుల్ జి పేల్చింది హైడ్రోజన్ బాంబే. వాస్తవాలను ఆధారాలతో సహా రాహుల్ గాంధీ దేశం ముందుంచారు. ఓట్ల దొంగను సీఈసీ ఎలా కాపాడుతున్నారో కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని అధికారం కోసం మోడీ చేసింది నిజంగా చీకటి రాజకీయమే. స్వయం ప్రతిపత్తి సంస్థ ఈసీఐ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.
లక్షలాది మంది ఓటు హక్కును కాలరాసింది. మోడీ కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు.. వద్దనుకున్న చోట్ల ఓట్లు తొలగించి బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలా మారింది. కాంగ్రెస్ విజయం సాధించే అలంద్ నియోజక వర్గంలో ..
6వేల ఓట్లను నకిలీ లాగిన్లతో తొలగించడం సహించరాని చర్య. సాఫ్ట్ వేర్ ను హైజాక్ చేసి, ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ఉపయోగించడం అంటే ఇది దేశ ద్రోహంతో సమానం. నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు ఫోన్ నంబర్లతో అక్రమంగా ఓట్లను తొలగించడం ఉగ్రవాద చర్యకు నిదర్శనం.
రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగా ఈసీఐ వెంటనే స్పందించాలి. ఎన్నికల సంఘం ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు బయటపెట్టాలి. వాటికి ఉపయోగించిన ఫోన్ నంబర్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలి. లేకపోతే ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని ఈసీఐ స్వయంగా కాపాడుతున్నట్టు పరిగణించాల్సి ఉంటుంది. డెమొక్రసీ విల్ నాట్ బి డిలీటెడ్!