– రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఇదే నిదర్శనం
– అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు హేయం
– సామాన్యులతో పాటు మాజీ మంత్రులకూ రక్షణ కరువు
– కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన మేలు శూన్యం
: వైయస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్ వీ సతీష్ రెడ్డి
కడప: మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం వైయస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్ వీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గూండాలతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ అంశంలో సిట్ నివేదికలో చంద్రబాబువి అబద్ధాలు అని తేలడంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని ఆయన మండిపడ్డారు.
కూటమి పాలనలో సామాన్య ప్రజలతో పాటు, మాజీ మంత్రులుకు కూడా భద్రత లేకుండా పోయిందన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ, మాజీ సీఎం వైయస్ జగన్తో పాటు టీటీడీ మాజీ చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ద్వారా దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు.
తమ వైఫల్యాలు ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులు.. దాడి చేసే గూండాలకు రక్షణగా నిలబడి, బాధితులపైనే కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా అని చంద్రబాబును ప్రశ్నించారు.
రాయలసీమకు ప్రాణాధారమైన ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి… ఆ ప్రాంత ప్రజల హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్, హింసా రాజకీయాలు ఎక్కువకాలం సాగవని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన బుద్ధిచెప్పడం ఖాయమని హెచ్చరించారు.
లడ్డూ ప్రసాదంలో సుప్రీం కోర్టు నియమించిన దర్యాప్తు సంస్థ జంతుకొవ్వులు లేవని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకమైన ఆరోపణలు చేసే స్దాయికి దిగజారడంపై ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. వాటిపై నుంచి డైవర్ట్ చేయడానికే మీరు ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడికి దిగారు.
మీ తప్పులను నిలదీస్తే మా ఇళ్లపై గుండాలతో దాడి చేయిస్తారా? ఈ రకమైన సాంప్రదాయం మంచిది కాదు. రానున్న రోజుల్లో ఇదే సాంప్రదాయం కొనసాగితే మీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకొండి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖ రెండేళ్లుగా చేష్టలుడిగి చూస్తోంది.
ఎన్డీయేలో భాగస్వామ్యులుగా ఉన్న టీటీపీ.. ఇవాళ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కనీస మేలు జరగలేదు. అయినా మీరు మాట్లాడ్డం లేదు. కంటితుడుపు చర్యగా రూ.3 వేల కోట్లు, రూ.1100 కోట్లు అమరావతి కోసం, రూ.2 వేల కోట్లు ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి దాటి రుణం పొందేందుకు అనుమతి తప్ప ప్రయోజనం ఏం లేదు.
మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్, మా పార్టీ నాయకులు తిరుమల లడ్డూని అపవిత్రం చేయాలని కానీ, తిరుమలకు అపకీర్తి చేయాలన్న పనికి పాల్పడితే కచ్చితంగా మేం అందరూ దాని ఫలితం అనుభవిస్తాం. కానీ కేవలం మీ ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే మీరు సర్వనాశనం కావడం ఖాయం.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారిపైనా, లడ్డూ ప్రసాదంపైనా దుష్ప్రచారం చేసిన వారు ఆయన ఆగ్రహానికి గురి కాక తప్పదు. మేము లడ్డూ ప్రసాదంపై తిరుమలలో ప్రమాణం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం, మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా?