– మోదీ వచ్చాక మారుతున్న రైల్వేల రూపురేఖలు
– తెలంగాణలో రైల్వే వ్యవస్థను పడావు పెట్టిన యుపిఏ
– సికింద్రాబాద్ – జోథ్‌పూర్ రైలు ప్రారంభోత్సవంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్–జోథ్‌పూర్ మధ్య నేరుగా రైలు సదుపాయం కల్పించాలని కోరుతూ వస్తున్నారు. ఈ డిమాండ్ దాదాపు 40 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని కోరడం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు ఈ డిమాండ్‌కు స్పందిస్తూ, సికింద్రాబాద్ నుంచి జోథ్‌పూర్‌కు రోజువారీ నేరుగా రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజే స్వయంగా జోథ్‌పూర్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది సంతోషకరమైన విషయం.
మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, బేగంపేట స్టేషన్లు అభివృద్ధి చేసి ప్రారంభించాం.
బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా సిబ్బందితో నడపడం గర్వించదగిన విషయం. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో రైల్వే కోచ్‌లు, రైల్లు, వ్యాగన్లు తయారీకి మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణం ప్రారంభమైంది. ఇది ప్రధాని మోదీ ఆదేశాలతో జరుగుతోంది.
పీవీ నరసింహారావు హయాంలో కూడా కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు జరిగాయి. అప్పటి పోరాటాలు నేడు ప్రధాని మోదీ గారి నాయకత్వంలో సాకారం అవుతున్నాయి. తెలంగాణలో అన్ని రైల్వే స్టేషన్లలో విద్యుదీకరణ పూర్తయింది. అలాగే వైఫై సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు.
నాలుగో రైల్వే టర్మినల్ అయిన చర్లపల్లిలో భూమిపూజ చేసి, నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.720 కోట్లతో ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తూ నిర్మాణం కొనసాగుతోంది. దీని భూమిపూజ ప్రధాని మోదీ స్వయంగా చేశారు. వచ్చే సంవత్సరం ఈ కొత్త స్టేషన్ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.