Suryaa.co.in

Editorial

రాజాసింగ్‌ రాద్ధాంతం!

– టీఆర్‌ఎస్‌కు డైవర్షన్‌ అస్త్రమందించారా?
– లిక్కర్‌ కుంభకోణం చర్చ పక్కదారి పట్టించేందుకు రాజాసింగ్‌ వ్యాఖ్యలు చాన్సు ఇచ్చాయా?
-మీడియాలో సంజయ్‌ అరెస్టు కంటే రాజాసింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం
– రాజాసింగ్‌ బహిష్కరణపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు
– పార్టీ నిర్ణయంపై కమలం కార్యకర్తల అసంతృప్తి
– పార్టీ కోసం నిలబడితే ఇదా బహుమానమన్న ప్రశ్నలు
– లిక్కర్‌ కుంభకోణ సమయంలో ఆయన వ్యాఖ్యలు సరికావంటున్న మరికొందరు నేతలు
– టీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో రాజాసింగ్‌ పడ్డారంటున్న సీనియర్లు
– రాజాసింగ్‌ బహిష్కరణ వెనుక బీజేపీ కీలక నేత?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ బీజేపీఎల్పీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన వ్యవహారంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పార్టీని శాసిస్తున్న ఓ కీలకనేత సిఫార్సుతోనే, రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడిందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అదే సమయంలో.. తెలుగు రాష్ర్టాలను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కూతురయిన కవిత పేరు మారుమోగుతున్న సమయంలో.. దానిని రాజాసింగ్‌ తన అసందర్భ వ్యాఖ్యల ద్వారా పక్కదారి పట్టించారన్న విమర్శలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

హిందీ కమెడియన్‌ మునావర్‌ హైదరాబాద్‌ రాకను చాలాకాలం నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. ఆయన షోను అనుమతించవద్దని స్వయంగా డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. హిందూ దేవతలను అవమానిస్తున్న మునావర్‌ షోను అనుమతిస్తే, తానూ ఓ షో చేస్తానని రాజాసింగ్‌ పోలీసులకుfullస్పష్టం చేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌.. మునావర్‌కు స్వాగతం చెబుతూ ట్వీట్‌ చేయడంతో, కథ కొత్త మలుపు తిరిగింది. స్వయంగా మంత్రి కేటీఆర్‌ ఆయనకు స్వాగతం చెబుతూ ట్వీట్‌ చేసినందున, సహజంగా పోలీసులకు మునావర్‌ షోకు అనుమతివ్వడం అనివార్యమవుతుంది. ఆయన షోలో అదే జరిగింది. దీనికి నిరసనగా.. రాజాసింగ్‌ ఓ వీడియో విడుదల చేశారు.

రాజాసింగ్‌ విడుదల చేసిన ఆ వీడియో పాతబస్తీలో అగ్గిరాజేసింది. దానికి నిరసనగా మైనారిటీలు ఆకస్మికంగా పోలీసుస్టేషన్లను ముట్టడించడంతోపాటు, వందలమంది ఒక్కసారిగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ ముందు ప్రార్ధనలు చేయటం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేయడం, నిబంధనల ప్రకారం రాజాసింగ్‌ను అరెస్టు చేయలేదు కాబట్టి, కోర్టు ఆయనకు బెయిలివ్వడం జరిగిపోయింది. ఇదీ రాజాసింగ్‌ అరెస్టు నేపథ్యంలో కీలకాంశాలు. అయితే రాజాసింగ్‌కు బెయిల్‌ అనంతర పరిణామాలు, హైదరాబాద్‌లో టెన్షన్‌ వాతావరణం సృష్టించింది. ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో నష్టనివారణకు దిగిన బీజేపీ నాయకత్వం.. రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆయన వివరణ కోరింది. ఈ పరిణామాలు బీజేపీలో భిన్నాభిప్రాయాలకు కారణమయ్యాయి. రాజాసింగ్‌పై వేటు విషయంలో బీజేపీ వర్గాలు రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. చాలాకాలం నుంచీ రాజాసింగ్‌ను వ్యతిరేకిస్తోన్న ఓ జాతీయ స్థాయి ప్రముఖుడే, ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయించారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో జరుగుతుండటం ప్రస్తావనార్హం. గతంలో సదరు నేత వ్యవహారశైలిపై, రాజాసింగ్‌ బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సదరు జాతీయ స్థాయి నాయకుడే అదను చూసుకుని, రాజాసింగ్‌ను సస్పెండ్‌ చేయించారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

అయితే, అదే సమయంలో రాజాసింగ్‌ వ్యూహాత్మక తప్పిదం- తొందరపాటుతనంతో , టీఆర్‌ఎస్‌కు ఊపిరిపీల్చుకునే అవకాశం ఇచ్చారన్న విమర్శలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం టీఆర్‌ఎస్‌ను కుదిపేస్తోంది. ఆ కుంభకోణంలో కేసీఆర్‌ కుమార్తె కవిత పాత్ర ఉందంటూ స్వయంగా బీజేపీ జాతీయ నేతలే ఆరోపించారు. లిక్కర్‌ వ్యాపారుల పక్షాన కేజ్రీవాల్‌ సర్కారుతో ఆమెనే లాబీయింగ్‌ చేశారని బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మీడియాకు వెల్లడించారు. తాజాగా ఆ కేసుకు సంబంధించి ఢిల్లీ ఆప్‌ మంత్రి సిసోడియా, తెలుగు ఐఏఎస్‌ గోపీకృష్ణపై కేసు నమోదు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు దానిని అస్త్రంగా మలచి టీఆర్‌ఎస్‌పై రాజకీయంగా దాడి చేసి, కేసీఆర్‌ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చే స్తున్నారు. వరస వెంట వరస నాయకులంతా కవిత ఆస్తులు, సంపాదనపై నలుచెరుగులా ఆరోపణ దాడి చేస్తున్నారు. ఒక దశలో కవిత ఇంటివద్ద బీజేపీ నేతలు జరిపిన ధర్నా వ్యవహారం రాజకీయ ఉద్రిక్త వాతావరణం సృష్టించింది.

ఈ సమయంలో, రాజాసింగ్‌ చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల కవిత లిక్కర్‌ కేసు ఆరోపణల వ్యవహారం, విజయవంతంగా పక్కదారి పట్టిందని బీజేపీలోని ఓ వర్గం విశ్లేషిస్తోంది. రాజాసింగ్‌ టీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో పడ్డారని నేతలు విశ్లేషిస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న రాజాసింగ్‌కు తన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌కు లాభిస్తాయా? లేదా అన్నది అంచనా వేయకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మరోవైపు బండి సంజయ్‌ పాదయాత్రకు అనుమతి లేదంటూ.. పోలీసులు ఆయనను అరెస్టు చేసిన వ్యవహారం కూడా, తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. బీజేపీ అగ్రనేతలు దానిపై గవర్నర్‌ను కలసి, కేంద్రబలగాలను పంపించేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు. ఇంకోవైపు పార్టీపరంగా న్యాయపోరాటం ప్రారంభించింది. ఈ పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌కు ఫోన్‌ చేయగా, బీజేపీ ఇన్చార్జి తరుణ్‌చుగ్‌ బీజేపీ అధ్యక్షుడి అరెస్టును ఖండించారు.

ఇప్పుడు రాజాసింగ్‌ వ్యాఖ్యల ఫలితంగా రాజకీయ యుద్ధం కాస్తా మతయుద్ధంగా మారడం వల్ల, బీజేపీ ఆత్మరక్షణలో పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ సమరంగా మొదలైన ఈ పరిణామాలు, హటాత్తుగా మతరాజకీయాల మలుపు తీసుకోవడంతో.. అటు కవితపై లిక్కర్‌ ఆరోపణలు, ఇటు సంజయ్‌ అరెస్టు వ్యవహారాన్ని పక్కదారిపట్టించి, కేవలం రాజాసింగ్‌ వ్యాఖ్యలు-ఆయన అరెస్టుకు పరిమితమయ్యాయని బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రజలు కవితపై లిక్కర్‌ ఆరోపణలు, సంజయ్‌కు పాదయాత్ర నిరాకరణ అంశాల కంటే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలపైనే చర్చించుకుంటున్నారంటే.. టీఆర్‌ఎస్‌పై పోరాడే అద్భుతమైన రాజకీయ అవకాశాన్ని, రాజాసింగ్‌ ఏ స్ధాయిలో దూరం చేశారో స్పష్టమవుతోందని బీజేపీ నేతలు నిరాశకు గురవుతున్నారు. మీడియా కూడా సంజయ్‌ అరెస్టు, కవితకు వ్యతిరేకంగా ఆందోళన వార్తల కంటే.. రాజాసింగ్‌ అరెస్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయని గుర్తు చేస్తున్నాయి. దాన్నిబట్టి రాజాసింగ్‌ వ్యాఖ్యలు పార్టీకి, ఏ స్థాయిలో నష్టం కలిగించాయో స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు.

నిజానికి మునావర్‌ విషయంలో రాజాసింగ్‌ అంత సీరియస్‌గా వ్యవహరించాల్సిన అవసరం లేదంటున్నారు. కేవలం టీఆర్‌ఎస్‌కు పనిగట్టుకుని రాజకీయ ప్రయోజనం కలిగించేందుకే ఆయన వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తున్నాయని, మరికొందరు బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మునావర్‌ అంశాన్ని హిందూపరివార్‌ సంస్థలు పరిశీలిస్తున్నప్పుడు, అందులో రాజాసింగ్‌ జోక్యం చేసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక్కరోజులోనే రాజకీయ పరిణామాలు హటాత్తుగా తలకిందులయి, టీఆర్‌ఎస్‌ రక్షణాత్మక స్థితిలో-బీజేపీ ఆత్మరక్షణ స్థితిలో ఉండేందుకు రాజాసింగ్‌ వ్యాఖ్యలు దోహదపడ్డాయని మెజారిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయడం సమంజసమేనన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అయితే ఈ రాజకీయ పరిణామాలతో సంబంధం లేని బీజేపీ కార్యకర్తలు- సానుభూతిపరులు మాత్రం, రాజాసింగ్‌ సస్పెన్షన్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. పాతబస్తీలో హిందువుల గొంతుకగా ఉన్న రాజాసింగ్‌ను సస్పెండ్‌ చేయడం, తెలివితక్కువ నిర్ణయమంటున్నారు. రాజాసింగ్‌ లేకపోతే మజ్లిస్‌ను ఎదుర్కోవడం కష్టమన్న విషయం తెలిసినా కూడా, పార్టీ అలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పార్టీలోని ఓ కీలకనేత చేస్తున్న రాజకీయ కుట్రగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో రాజాసింగ్‌కు టికెట్‌ దక్కకుండా సదరు నాయకుడే అడ్డం పడ్డారని, ఇప్పుడు కూడా అదే నాయకుడి సిఫార్సు కారణంగానే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారని ఆరోపిస్తున్నారు.

గతంలో నూపూర్‌ శర్మను బహిష్కరించి పొరపాటు చేసిన బీజేపీ, తాజాగా హిందూమతానికి పాతబస్తీలో రక్షకుడిగా ఉన్న రాజాసింగ్‌పై వేటు వేసి, మరొక పొరపాటు చేసిందని బీజేపీ కార్యకర్తలుNupur-Sharma-Raja-Singh-1200-24082022-PTI-Fileవ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఆయన చేస్తున్న హిందూమత రక్షణ పోరాటానికి పార్టీ నాయకత్వం ఇచ్చిన బహుమతిగా మరికొందరు అభివర్ణిస్తున్నారు. హిందూ దేవతలకు వ్యతిరేకంగా మునావర్‌ వ్యాఖ్యలను పట్టించుకోని బీజేపీ నాయకత్వం, మునావర్‌ రాకను వ్యతిరేకించిన రాజాసింగ్‌ను సస్పెండ్‌ చేయడం బట్టి.. తమ పార్టీ హిందుత్వ సిద్ధాంతం కేవలం రాజకీయ ప్రయోజనాలకేనన్న విషయం అర్ధమవుతుందని, నూపుర్‌ శర్మ బహిష్కరణ కూడా దానినే రుజువుచేసిందని విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE