-మురుగునీటి శుద్ధి కేంద్రం, బొందిలిపాలెం వద్ద ఉన్న ఓగేరు వాగు పై ఉన్న వంతెన వద్ద ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్
-వైకాపా పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి
-మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
మంత్రి రజినికి వసూళ్లపై ఉన్న శ్రద్ధ చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలపై లేదని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో మురుగునీటి శుద్ధి కేంద్రం, పసుపర్రు వంతెన వద్ద ప్రత్తిపాటి సెల్ఫీ తీసుకుని మంత్రి రజిని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ మంత్రి రజిని అసమర్థత, చేతకానితనం, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం, ఓట్లేసిన ప్రజలకు కనబడకుండా పోవడం, ప్రజలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం లేకపోవడంతోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయని విమర్శించారు. తెదేపా ప్రభుత్వంలో రూ.16 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభించామని… వైకాపా 4.3 ఏళ్లలో అంగుళమూ కదల్లేదని ప్రత్తిపాటి అన్నారు.
అమృత్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం మురుగునీటి శుద్ధి కేంద్రం మంజూరు చేసిందని.. 2018లో శంకుస్థాపన చేశామని తెలిపారు. దాన్ని పూర్తి చేసి ఉంటే ప్రజలు అంటువ్యాధులు, అనారోగ్యాల బారినపడకుండా ఎంతో ఉపయోగపడేదని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. బ్రిడ్జి టు బ్రిడ్జి మధ్య 3 కిలోమీటర్లు ఉంటే మంజూరు చేయకూడదనే జీవో ఉందని.. నిబంధనలు అధిగమించి ఆనాడు చంద్రబాబు ప్రత్యేకంగా పసుమర్రు వంతెనకు రూ.7.68 కోట్లు మంజూరు చేశారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. వైకాపా 4.3 ఏళ్ల పాలనలో గుత్తేదారుకు రూపాయి కూడా చెల్లించలేదని… రూ.7.68 కోట్ల పనులను పూర్తి చేయలేని అసమర్థ మంత్రి రజిని నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రత్తిపాటి ప్రశ్నించారు.
వంతెన పూర్తయితే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని… వారి భూముల ధరలు పెరిగేవని అన్నారు. మంత్రి స్పందిస్తారని కాదని… సమస్యను ప్రజలకు తెలియజేయడానికే సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మంత్రి కుటుంబం బాగుపడటానికి తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆరోపించారు. శ్మశానానికి దారి లేకుండా కూడా చేశారని… ఎవరైనా చనిపోతే శ్మశానానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
ఎక్కడ ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వాటిపై ఉన్న దృష్టి ఓట్లేసిన ప్రజల గురించి ఒక్క క్షణమైన ఆలోచించడం లేదని మండిపడ్డారు. వంతెనను రజిని తీసుకొచ్చినట్లు రూ.20 లక్షలు ఖర్చు చేసి పైలాన్ మాత్రం పెట్టించుకున్నారని ఎద్దేవా చేశారు. పైలాన్ వేయించుకోవడం కాదని.. పనులు పూర్తి చేయాలన్నారు. డబ్బులు వసూలు చేసుకోవడం కాదని… ఓట్లేసిన ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు.
పైలాన్ లాంటివి సామాజిక మాధ్యమాల్లో పెట్టుకోవడానికి ఉన్న శ్రద్ధ ఓట్లేసిన ప్రజల గురించి ఒక్క క్షణమైనా ఆలోచించాలని మంత్రి రజిని ప్రత్తిపాటి ఛాలెంజ్ చేశారు. వైకాపా ప్రభుత్వానికి, మంత్రి రజినికి ప్రజలు వీఆర్‌ఎస్ ఇవ్వడం ఖాయమని ప్రత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.