Suryaa.co.in

Telangana

యూత్ డిక్లరేషన్ కొనసాగింపుగా రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ పోటీ

-ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరం
-కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ సిప్లిగంజ్ కు రూ. 10 లక్షల బహుమతి
-అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. కోటి నగదు బహుమతి
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లాంఛింగ్, బ్రోచర్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఆస్కార్ అవార్డుతో తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిన రాహుల్ ను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధకరమన్నారు రేవంత్. రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ విజేతలకు బహుమతి ప్రదానం చేసే కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారు.

ఆ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ ను కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా సన్మానం చేస్తామన్నారు. పార్టీ తరపున రూ. 10 లక్షల బహుమతి ఇస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ కు రూ. కోటి నగదును బహుమతి ఇస్తామన్నారు. జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని విద్యార్ధులు, యువతకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE