– ఈవీఎం తెచ్చిందే రాజీవ్‌గాంధీ
– ఇప్పుడు దానిని రాహుల్ వద్దంటున్నారు
– రాహుల్.. రాజీనామా చేసేందుకు మీకు ధైర్యం ఉందా?
– రాయబరేలిలో బ్యాలెట్ పేపర్స్‌తో పోటీ చేస్తాం
– రాహుల్ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తికి, కాంగ్రెస్ పార్టీకి దేశంలోని ఏ వ్యవస్థలపై కూడా నమ్మకం లేకపోవడం బాధాకరం. ఎందుకంటే, రాజీవ్ గాంధీ 1989లో ఓటమి తర్వాత బ్యాలెట్ పేపర్లు మంచివి కావని, బ్యాలెట్ పేపర్లతోనే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఓడిపోయిందని, అందుకే, బ్యాలెట్ పేపర్లను తీసేసి, ఈవీఎంలను తీసుకురావాలని నిర్ణయించారు.
మొట్టమొదటి సారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షాద్ నగర్ అనే నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి, బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి, ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. మూడు రోజుల క్రింద ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో.. ఈ దేశంలో దురదృష్టవశాత్తూ ఎంపీ అయ్యానంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బాధ్యత ఏంటో కూడా రాహు ల్ కు తెలియకపోవడం సిగ్గుచేటు.
ఓటు చోరీ అంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, తను పోటీ చేసి గెలిచిన రాయ్ బరేలిలో రాజీనామా చేసి, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు రండి. మాకు అభ్యంతరం లేదు. కానీ, పోటీ చేయడానికి రాజీనామా చేసేందుకు మీకు ధైర్యం ఉందా? బ్యాలెట్ పేపర్లకు మరియు ఈవీఎంలకు మధ్య తేడా ఏంటని, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎప్పుడైనా శాస్త్రీయంగా ఒక స్టడీ చేశారా?
భారతీయ జనతా పార్టీ కూడా ప్రారంభ దశలలో ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉంది. కానీ, ఒక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను ఉపయోగించమని చెప్పింది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక శాస్త్రీయ అధ్యయనం తరువాత “ఈవీఎం సరే” అని పేర్కొంది. అప్పటినుండి 1989 నుంచి 2025 వరకు, ఈవీఎంలపైనే ఎన్నికలు జరుగుతున్నాయి.
కానీ కాంగ్రెస్ నేతలు, రాజకీయ దురుద్దేశంతో తమ పార్టీ గెలిస్తే ఈవీఎంలు “సరే” అని, ఓడితే “తప్పు” అని ఉద్దేశపూర్వకంగా చెబుతున్నారు. మొన్న కేరళ వయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలిచినప్పుడు, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు సరిగ్గా పనిచేశాయట. కానీ రేపు బిహార్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసిన సందర్భంలో ఈవీఎంలు “తప్పు” అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
తమిళనాడులో స్టాలిన్ గెలిస్తే, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ గెలిస్తే – ప్రజాతీర్పుకు అనుగుణంగానే ఈవీఎంలు సరిగ్గా పనిచేశాయని మాట్లాడుతారు. కానీ ఆ పార్టీ ఓడితే, రాజకీయ నేతలు “ఈవీఎం తప్పు” అని ఆరోపిస్తారు. ఇది వారి నైజం. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ 2024లో దేశవ్యాప్తంగా 99 సీట్లు గెల్చినప్పుడు, వారికి ఈవీఎంలపై ఏ అనుమానం లేదట, ఆందోళన లేదట. కానీ తర్వాతి కొన్ని ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన ఎన్నికల్లో, కాంగ్రెస్ ఓడిపోగానే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తండ్రి (రాజీవ్ గాంధీ) బ్యాలెట్లు వద్దని, ఈవీఎంలను తీసుకొచ్చారు. 20వ శతాబ్దంలో దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిన తన నాన్న ఆలోచన ప్రోగ్రెసివ్, కొడుకు ఆలోచనేమో డిస్ట్రక్టివ్..!
కాంగ్రెస్ పార్టీ “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దు” అంటోంది. కానీ, రేపు పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికల సందర్భంలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎస్ఐఆర్ చేసి, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడినవారి ఆధార్/ఎలక్షన్ కార్డులను గుర్తించి, ఓటు హక్కును రద్దు చేస్తారేమో అనే భయం కలగడంతో కాంగ్రెస్ పార్టీ ముందే దీన్ని వ్యతిరేకిస్తోంది.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద వాళ్లకు విలువ లేదు. వాళ్లు గెలిచిన ఈవీఎంలకే విలువ చూపడం లేదు. 1989లో ఈవీఎంలను తీసుకువచ్చిన తండ్రి (రాజీవ్ గాంధీ) మీద కూడా రాహుల్ గాంధీకి నమ్మకం లేదు. రాహుల్ గాంధీ , టెక్నాలజీ వాడితే ఎందుకు ఇబ్బంది పడతారో అర్థం కావట్లేదు. నిజానికి, కొన్ని పార్లమెంట్ కాన్స్‌టెన్సీలలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలను పరిశీలిస్తే, రెండు లక్షల డౌట్ఫుల్ ఓట్లు ఉన్నట్లు అనిపిస్తోంది.
రాహుల్ గాంధీ గెలిచిన రాయబరేలీలో 71,977 ఫేక్ అడ్రెస్‌లను గుర్తించాం. తర్వాత, మా కార్యకర్తలతో డోర్-టు-డోర్ వెరిఫికేషన్ ప్రారంభించాం. రాహుల్ గాంధీ గెలిచిన రాయబరేలిలో చేర్పించిన దొంగ ఓట్లు కూడా గుర్తించాం. మేము కూడా ఎన్నికల కమిషన్‌కు రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం.
ఎందుకంటే రెండు లక్షల డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి. కొత్తగా జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య 92,747. రాయబరేలీలో 52,000 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు తీసుకురావడం జరిగింది. అందుకే, ఈవీఎంలపై విశ్వాసం లేకుంటే, వెంటనే రాజీనామా చేయండి. మేము బైఎలక్షన్ కోసం రాయబరేలిలో బ్యాలెట్ పేపర్స్‌తో పోటీ చేస్తాం. అప్పుడు ఏది పాలు, ఏది నీళ్లో అనేది స్పష్టంగా తెలుస్తుంది.
ప్రజలకు వయనాడ్ లో కూడా డౌట్ ఉంది. మొన్నటి ఎన్నికల్లో 93,499 మంది ఒకే కమ్యూనిటీకి చెందిన ఓట్లతో ప్రియాంక గాంధీ గెలిచారు. అదే విధంగా, బెంగాల్లో డైమండ్ హార్బర్, మమతా బెనర్జీ ప్రాతినిధ్యంలోని నియోజకవర్గాలపై కూడా డౌట్ ఉంది. అలాగే, డింపుల్ , అఖిలేష్ ప్రాతినిధ్యంలోని నియోజకవర్గాల్లో కూడా అనుమానం ఉంది.
దొంగ ఓట్లను అరికట్టడానికి, డూప్లికేట్ ఓట్లను తొలగించడానికి, దేశంలో ఒక వర్గానికి చెందిన ప్రజలకు అడ్డగోలుగా చొరబడినవాళ్లకు ఓట్లు ఇచ్చే పరిస్థితిని అరికట్టడానికి “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా, దేశ ప్రజల ఓట్లను కాపాడటానికి, దొంగతనంగా దేశంలోకి చొరబడిన రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఇచ్చిన తప్పుడు ఓట్లను తీసివేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ చర్యలు అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్, హైదరాబాద్‌లోనూ ఉన్నాయి.
నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటులో కూడా ఇలాంటివి ఉన్నాయి. సదాశివుపేట, ఇస్నాపూర్, ఐలాపూర్ ప్రాంతాల్లో సుమారు 1,000 దొంగ ఓట్లను గుర్తించాం. రాహుల్ గాంధీకి ఇవి ఎందుకు కనిపించడంలేదు? కానీ కాంగ్రెస్ నాయకులలో పెద్దవాళ్లు గెలిస్తే, ఈవీఎంలు సరిగ్గా పని చేస్తున్నాయని అంటారు. ఓడిపోతే, ఈవీఎంలపై ప్రజలలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తారు. దీనికి కారణం.. వీళ్ళకు ఫండింగ్ చేసే కొన్ని ఫారిన్ ఏజెన్సీలు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో నుంచి మూడో స్థానానికి ఎదుగుతున్నప్పుడు, కొంతమంది భారతీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కక్ష కట్టారు. దేశంలో ప్రజల చేత మన్నన పొందలేని వ్యక్తులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
డీప్ స్టేట్ పేరిట, సొరేన్ అనే వ్యక్తి దేశంలోని మీడియా, సంస్థలను దెబ్బతీసి, దేశ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. దయచేసి ప్రజలు ఫాక్ట్స్ తెలుసుకోవాలి.
నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశహితం కోసం సీఏఏ, ఎన్ఆర్సీ వంటి అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకొస్తే.. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ మాత్రం విదేశీ శక్తుల ప్రేరణతో వారి ఏజెంట్లా మారి వీటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
జవహర్ లాల్ నెహ్రూ ఓటు రాకపోయినా ప్రధానమంత్రి అయ్యారు. దొంగ ఓట్లతో గెలిచినందున ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కానీ దాన్ని కప్పిపుచ్చుకునేలా ఎమర్జెన్సీ తీసుకువచ్చారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. కాంగ్రెస్ ఏ రాజ్యాంగ వ్యవస్థను గౌరవించదు. సుప్రీం కోర్టు షాబాను అనే ముస్లిం మహిళకు భరణం ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను బయట పారేసి, ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది.
కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్‌ని గౌరవించరు, భారత రాజ్యాంగాన్ని గౌరవించరు, న్యాయ వ్యవస్థలను గౌరవించరు. ఎలక్షన్ కమిషన్ ను గౌరవించరు. ఆఖరికి, ప్రియాంక గాంధీ కూడా జడ్జీల గురించి, న్యాయ వ్యవస్థలపై అగౌరవపర్చేలా మాట్లాడుతున్నారు.
రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థలపై విలువ లేదు. అందుకే ప్రజలు వాళ్లకు విలువనివ్వడం లేదనేది అర్థం చేసుకోవాలి. ఒక వ్యవస్థపై ఆరోపణ చేస్తున్నప్పుడు, ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ శాస్త్రీయంగా ఆ వ్యవస్థపై స్టడీ చేయాలి.
కాంగ్రెస్ పార్టీకి ఓపిక ఉంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలను బ్యాలెట్ పేపర్లతోనే పెట్టండి. లేదంటే రాయబరేలిలో రాహుల్ రాజీనామా చేసి, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలకు పోవాలి. ప్రజాస్వామ్యాన్ని అవమానించే రీతిలో, విశ్వాసం లేకుండా వ్యవహరించకూడదు. పారదర్శకత కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడితే తప్పు అనే ఆరోపణలను మానుకోవాలని కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నాం.