Suryaa.co.in

Editorial

జగన్‌ కు రజనీ ఝలక్?

-బీజేపీలోకి విడదల రజనీ?
-ఓడిపోయే సీటిచ్చారని ఆగ్రహం
-నమ్మినవారే నట్టేట ఉంచారన్న అసంతృప్తి
-చిలకలూరిపేట ఇస్తే గెలిచేదానినన్న రజనీ
-తాజాగా బీజేపీ అగ్రనేతలతో మంతనాలు?
-వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఆందోళన
( మార్తి సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్ హైటెక్‌సిటీలో టీడీపీ నాటిన ఒకనాటి మొక్క..మొన్నటి వరకూ జగన్ జమానాలో వెలిగిపోయిన మాజీ మంత్రి విడదల రజనీ.. తన పార్టీ అధినేత జగన్‌ కు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇక వైసీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదన్న ఆందోళనతో, కమలవనంలో సేదదీరేందుకు సిద్ధమవుతున్నారట. ఆ మేరకు బీజేపీ అగ్ర నేతలతో మాటాముచ్చట్లు చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో.. సీనియర్లను కాదని, మంత్రిపదవి సాధించిన రజనీ జిల్లాలో హవా సాగించారు. దానితో నాటి వైసీపీ ఎంపి కృష్ణదేవరాయలు సహా, పార్టీ నేతలు దూరమయ్యారు. అయితే మళ్లీ చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని భావించిన ఆమె ఆశలను జగన్ నిరాశ చేశారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో, ఆమె అక్కడికి బదిలీకాక తప్పలేదు. ఈ విషయంలో ఆమెను సజ్జల రామకృష్ణారెడ్డి నమ్మించి మోసం చేశారని, రజనీ అనుచరులు మండిపడుతున్నారు.

నిజానికి గుంటూరుకు బదిలీ అయిన, ఆమెకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వర్గం సహకరించలేదు. ఆయన వర్గీయులైన కార్పొరేటర్లు కూడా, ఆమెను నమ్మించి మోసం చేశారన్న ఆగ్రహం లేకపోలేదు. అప్పిరెడ్డి అనుచరులైన కొందరు కార్పొరేటర్లకు, కొన్ని పోలింగ్ బూత్‌లు అప్పగిస్తే, ఆ పరిథిలో వారు డబ్బులు పంచకుండా మింగేశారన్న ఫిర్యాదులు కూడా అప్పట్లో వచ్చాయి.

అందుకే రజనీ, ముందుజాగ్రత్త చర్యగా.. టీడీపీలో సీటు ఆశించిన కొందరు కమ్మ వర్గ నేతలను, తన వైపు మళ్లించుకోవడంలో విజయం సాధించారు. వారు ఎన్నికల ప్రచారం-పోలింగ్ సమయంలో, ఎక్కడా బయట కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే పోలింగ్ రోజు టీడీపీ కమ్మ నేతలెవరూ పార్టీ అభ్యర్ధి మాధవి వెంటగానీ, పోలింగ్ బూత్‌లో గానీ కనిపించలేదు.

మాధవి ఈ ఎన్నికల్లో గెలిస్తే, ఇక తమకు భవిష్యత్తులో సీటు రాదన్న ముందుచూపుతో, ఆ సీటు ఆశించిన కమ్మవర్గ నేతలు అంటీముట్టనట్లు ఉన్నారన్న సమాచారం.. ఎమ్మెల్యే మాధవి, ఎంపి చంద్రశే ఖర్‌తోపాటు,పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. కీలకమైన పోలింగ్‌ రోజున బ్రాహ్మణవర్గ నేత శ్రీధర్‌శర్మ, వైశ్య కార్పొరేటర్ బుజ్జి మాత్రమే టీడీపీ అభ్యర్ధికి బాసటగా నిలిచి, రజనీని పోలింగ్‌ బూత్ నుంచి బయటకు వెళ్లేంతవరకూ పోరాడారు. ఇది వేరే కథ.

కాగా తాను చిలకలూరిపేట నుంచి పోటీచేసి ఉంటే, ఖాయంగా గెలిచేదానినన్న నమ్మకం రజనీలో బలంగా ఉంది. అదే విషయాన్ని ఇటీవల జగన్‌తో జరిగిన సమీక్ష సమావేశంలో కూడా స్పష్టం చేశారట. అయితే చిలకలూరిపేటలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేనందున, గుంటూరుకు మారుస్తున్నామని సజ్జల నచ్చచెప్పడం వల్లే రజని ఆయన మాటలు నమ్మి, ఓడిపోయారని ఆమె అనుచరులు మండిపడుతున్నారు. పైగా ఒక సర్వే సంస్థ అధిపతి.. రజనీకి వ్యతిరేకంగా ఇచ్చిన నివేదికను నమ్మి, ఆమెను బలిపశువు చేశారని విరుచుకుపడుతున్నారు.

దానితో ఇక వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చిన రజనీ, ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగూ టీడీపీలో చేరే అవకాశం లేనందున, బీజేపీలో చేరడమే ఉత్తమమని భావించిన రజనీ, ఆమేరకు తన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిసేందుకు, ఆమె అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. ‘ఆమెపై ఒక్క అవినీతి ఆరోపణలు తప్ప మిగిలినవేమీ పెద్దగా లేవు. అవి ఇప్పుడు సహజం. కాబట్టి పార్టీలోకి తీసుకోవచ్చు. కాకపోతే వచ్చిన వెంటనే ఆమెకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ముందు పార్టీకి పనిచేయమని చెప్పవచ్చు’’ అని ఒక బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

కాగా రజనీని చేర్చుకుంటే టీడీపీ నుంచి పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండవని చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత.. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే, మాజీ ఎంపి రాయపాటి, తాజా ఎన్నికల్లో గుంటూరు సీటు ఆశించిన మరో మాజీ ఎమ్మెల్యేతోపాటు, ఇప్పుడు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఆదినారాయణరెడ్డితోపాటు.. టీడీపీ హయాంలో కీలక శాఖ నిర్వహించి, ఇటీవలి ఎన్నికల్లో సీటు దక్కని కృష్ణాజిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి.. బీజేపీలో చేరేందుకు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నించారు. విచిత్రంగా తాజా ఎన్నికల్లో వీరికి చివరి వరకూ సీటు ప్రకటించకపోవడం, ఒకరికి అసలు సీటు ఇవ్వకపోవడం ప్రస్తావనార్హం.

అయితే అప్పట్లో ఒక్క ఆదినారాయణరెడ్డిని మాత్రమే బీజేపీలోకి తీసుకుని, వివిధ కారణాలు.. అప్పట్లో బీజేపీలో ఉన్న వైసీపీ అనుకూల నేతల అభ్యంతరాల కారణంతో, మిగిలిన వారిని చేర్చుకోలేదు. నాటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాజీ ఎంపి రాయపాటిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంగీకరించలేదు. వీరిలో ఒక్క ఆదినారాయణరెడ్డిని మాత్రం బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఢిల్లీకి తీసుకువెళ్లి నద్దా, అమిత్‌షాను కలిశారు.

ఆదినారాయణరెడ్డి వస్తే కడప జిల్లాలో పార్టీ బలపడుతుందని వాదించి, ఆయనను బీజేపీలోకి తీసుకురావడంలో సత్యకుమార్ సక్సెస్‌అయ్యారు. ఇప్పుడు రజనీ విషయంలో అలాంటి అడ్డంకులు లేనందున, ఆమెను పార్టీలో చేర్చుకోవచ్చని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE