– ఢిల్లీలో చంద్రబాబుతో ఎంపి రఘురామరాజు భేటీ
– ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన ఎంపి రాజు
– బాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా భేటీ వెనుక ఆంతర్యమేమిటి?
– ఢిల్లీ వెళ్లే జగన్ వ్యతిరేక శక్తులకు రాజుగారి ఆశ్రయం
– ప్రతినిధుల బృందాన్ని కేంద్రమంత్రుల వద్దకు తీసుకువెళుతున్న రాజు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తన పార్టీ-ప్రభుత్వ అధినేత జగనన్నపై ప్రతిరోజూ పిడుగులు కురిపిస్తూ, ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు సర్వాంతర్వామిలా మారారు.
వైసీపీ సర్కారు అక్రమాలపై ప్రధాని నుంచి కేంద్రమంత్రుల వరకూ, ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్న రాజు.. అక్కడ సొంత పార్టీ ఎంపీలకు కనిపిస్తున్నారు. వారు వెళ్లి వినతిపత్రాలు ఇవ్వడం.. ఈయన వెళ్లి ఫిర్యాదులు చేయడం. ఇదీ కొన్నేళ్లుగా ఢిల్లీలోని కేంద్రమంత్రుల పేషీల్లో కనిపించే దృశ్యాలు. ఆయన చేసిన ఫిర్యాదులపై కేంద్రం స్పందించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడగటం కూడా రివాజుగా మారింది.
పోనీ అక్కడితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. జగనన్న సర్కారుపై సమరశంఖం చేసే వ్యక్తులు, సంస్థలు, నేతలకు రాజు ఢిల్లీలో ఆశ్రయం ఇస్తున్నారు. ఆంధ్రా నుంచి వెళ్లే జగన్ వ్యతిరేక శక్తులంతా.. ముందు రాజుగారితో భేటీ వేసి, ఆయన ఆతిధ్యం స్వీకరిస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రతినిధుల బృందాన్ని సంబంధిత కేంద్రమంత్రుల దగ్గరకు తీసుకువెళ్లి, వినతిపత్రాలు ఇప్పిస్తున్నారు. అసలు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లన్నీ, ఆయనే తీసుకోవడం మరో విశేషం.
నిజానికి పాపం ఈ విషయంలో, ఆయన పార్టీ సహచర ఎంపీలను చూస్తే జాలివేయక తప్పదు. వారు తమ నియోజకవర్గాలకు సంబంధించి, ఎవరినైనా కేంద్రమంతులను కలవాలంటే, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అనుమతి కావాలి. ఆయనను కాదని ఏ ఎంపీ కూడా, కేంద్రమంత్రులను కలిసే సాహసం చేయరు. ఇది మనం మనుషులం అన్నంత నిజం.
అలాంటి రాజుగారు హటాత్తుగా.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బాబుతో కాసేపు ముచ్చటించారు. ఎన్టీఆర్ వందరూపాయల నాణెం విడుదల సందర్భంగా.. రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్యక్రమానికి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఢిల్లీకి చేరారు. దానికోసం వచ్చిన బాబును రాజు కలిశారు.
నిజానికి చంద్రబాబు ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా.. ఎయిర్‌పోర్టు, ఆయన గెస్ట్‌హౌస్‌లో రఘురాముడు దర్శనమిస్తుండటం చర్చనీయాంశమయింది. తాజాగా ఆయనతోపాటు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కూడా బాబుకు స్వాగతం చెప్పారు. ఇదీ వైసీపీకి స్వక్షంలో విపక్షమైన రఘురాముడి ఢిల్లీ హవా.