– ఉపరాష్ట్రపతిని కలిసి వివరాలు అందజేసిన టిడిపి ప్రతినిధులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై జరుగుతున్న తప్పుదోవ పట్టించే ప్రచారంపై స్పష్టత ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సాన సతీష్ , బీద మస్తాన్ రావు యాదవ్ భారత ఉపరాష్ట్రపతి గారిని న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి వివరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు మాట్లాడుతూ, “మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం, అమ్మడం, యాజమాన్యం బదిలీ చేయడం వంటి చర్యలు ఎక్కడా లేవు. ‘ప్రైవేటీకరణ’ అనే పదాన్ని ఉపయోగించి ప్రజల్లో భయాందోళనలు రేపడం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే జరుగుతోంది” అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం ప్రకటించిన 16 మెడికల్ కాలేజీలలో అనేక చోట్ల భూమి స్వాధీనం, DPRలు, టెండర్లు, నిధుల విడుదల పూర్తికాలేదని, భవనాలు 20–30% దశలోనే నిలిచిపోయాయని అధికారులు ఉపరాష్ట్రపతికి వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనం కోసం PPP మోడల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్నారని తెలిపారు.
PPP అంటే ప్రైవేటీకరణ కాదని, అది కేవలం ఫ్యాకల్టీ నియామకం, మౌలిక వసతులు, హాస్పిటల్ ఆపరేషన్లను వేగంగా పూర్తి చేయడానికి తీసుకునే సాంకేతిక–వ్యవస్థాపక సహాయం మాత్రమేనని చెప్పారు. “సాయం తీసుకోవడం వేరే విషయం; అధికారం ఇవ్వడం వేరే విషయం. ఎక్కడా ప్రభుత్వ హక్కు తగ్గదు” అని వారు స్పష్టం చేశారు.
NMC మార్గదర్శకాల ప్రకారం MBBS ఫీజులు, ప్రభుత్వ సీట్లు పూర్తిగా యథాతథంగానే ఉంటాయని, ఫీజులు పెరుగుతాయి అనే ప్రచారం పూర్తిగా అసత్యమని వివరించారు.
PPP మోడల్ వల్ల 24×7 వైద్య సేవలు, ICUలు, ట్రామా కేర్, స్పెషాలిటీ యూనిట్లు త్వరగా ఏర్పడతాయని, జిల్లా వారీగా మెడికల్ సీట్లు పెరిగి స్థానిక యువతకు అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. వేలాది డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లకు కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని వారు తెలిపారు.
“ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, వైద్య ఉద్యోగాల అవకాశాలు—ఇవన్నీ బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్షమని, భయపెట్టే ప్రచారాలను ప్రజలు నమ్మరని, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలకు పూర్తిగా మద్దతు ఇస్తారని” అని సాన సతీష్ ,బీద మస్తాన్ రావు యాదవ్ ఉపరాష్ట్రపతికి వెల్లడించారు.