– ఎంపీ డీకే అరుణ
తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు ముట్టడి చేసి, గృహనిర్బంధం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేసిందని ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావుని పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టు చేయడం, పెద్దమ్మగుడి ఆలయ కార్యక్రమానికి, “హర్ ఘర్ తిరంగా” దేశభక్తి యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దౌర్జన్యానికి దిగజారిందో స్పష్టంగా చూపుతోందని ఆమె అన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “హర్ ఘర్ తిరంగా” దేశభక్తి కార్యక్రమం, అలాగే పెద్దమ్మగుడి ఆలయంలో జరుగుతున్న పూజలు, దైవ కార్యక్రమాలు.. ఇవన్నీ ప్రజల మౌలిక స్వేచ్ఛా హక్కులు. ఇలాంటి పవిత్రమైన, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను అడ్డుకోవడం, పోలీసు బలగాలను వినియోగించి ప్రతిపక్ష నాయకుల స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆమె ఖండించారు.
“దేశభక్తి కార్యక్రమం చేయడం నేరమా? ఆలయ పూజల్లో పాల్గొనడం తప్పా?” అని డీకే అరుణ ప్రశ్నించారు. ప్రజలు తమ ఆచారాలు, మతపరమైన హక్కులు, దేశభక్తి కార్యక్రమాలు స్వేచ్ఛగా నిర్వహించుకునే హక్కును ఎవరూ హరించలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని ఆమె పేర్కొన్నారు.