Suryaa.co.in

Andhra Pradesh

రామోజీరావుగారూ… అసలు మీ బాధేంటి..?

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని బహిరంగ లేఖ

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఈనాడు అధిపతి రామోజీరావుకు బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇదీ…

1- రామోజీరావుగారూ… అసలు మీ బాధేంటి..?
– చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడమా?
– ఇంకెప్పటికీ అధికారంలోకి రాడన్న ఆక్రోశమా? లేక మీ మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల్ని ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధంగా ప్రశ్నించారన్న తట్టుకోలేనితనమా?
2- రోజూ మీ పత్రికలో పవన్ కల్యాణ్ తమ్ముడిలా- జగన్ అంటూ ఏకవచనంతో ముఖ్యమంత్రిని సంబోధించి ఆనందం పొందుతున్నారు..?
– మీ పత్రికా విలువలను హారతిపళ్ళెంలో పెట్టి చంద్రబాబుకు ఎన్టీఆర్ వెన్నుపోటునాడే సమర్పించేసుకున్నారు.
– ఇప్పుడు మానవతా విలువల్ని కూడా అదే పద్ధతిలో వదిలేసుకున్నారు.
3- మొన్న బెంగుళూరులో భవన నిర్మాణ కార్మికులు కర్ణాటక వైపు వెళ్ళి కారు యాక్సిడెంట్ లో చనిపోయారు.
– కారు యాక్సిడెంట్ లో చనిపోవడం ఘోరమా..? లేక బెంగుళూరు వెళ్ళటం ఘోరమా..?
– ఒక రాష్ట్రంవారు, ప్రత్యేకించి సరిహద్దుల్లో ఉన్నవారు మరో రాష్ట్రంలో పనులకు వెళ్ళటం కొన్ని దశాబ్దాల నుంచీ జరుగుతోంది.
– అది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేక మీ మిత్రులైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నా కూడా ఇలా ఒక రాష్ట్రంవారు మరో రాష్ట్రంలోకి పనుల కోసం వెళ్ళటం సాధారణమే.
– ఉదాహరణకు, ఖమ్మం జిల్లా నుంచి ప్రతిరోజూ కొన్ని వందల మంది పనుల కోసం విజయవాడ వస్తారు.
– అలాగే, ఒడిశా నుంచి ఉత్తరాంధ్రకు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కు, ఛత్తీస్ గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు, రాజస్థాన్- ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు కూడా వలస వస్తారు.
– దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు ఉదయం వచ్చి రాత్రికి వెళ్ళిపోతే… దూరప్రాంతాల్లో ఉన్నవారు కొన్ని నెలలపాటు ఇక్కడే ఉంటారు.
– ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ, కర్ణాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగితే, మీరు పెట్టిన హెడ్డింగ్ ఇక్కడే ఉపాధి ఉంటే.. ఈ ఘోరం జరిగేదా..? అని.
– ఇక్కడ ఉపాధి లేక వారు వెళ్ళిపోయారా? లేక అక్కడ మెరుగైన ఉపాధి ఉందని వెళ్ళారా? అన్నది కనీసం వారి వర్షన్ కూడా లేకుండా రాశారు.
4- ఒకటి చెప్పండి రామోజీరావు గారూ…
– చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళలో కరవు మండలాలు ప్రకటించాల్సిన అవసరం లేని సంవత్సరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఏటా కరవే.
– అటువంటి సందర్భాల్లో ఒక్క 2016నే తీసుకున్నా, ఒక్క రాయలసీమ నుంచే 6 నుంచి 10 లక్షల మంది వ్యవసాయం చేసుకుంటున్నవారంతా వలసపోయారని అప్పట్లో ఇంగ్లీష్ డైలీలే రాశాయి.
– అంటే, వ్యవసాయం చేసుకుంటున్నవారు, వ్యవసాయం మానుకుని వేరే రాష్ట్రాలకు కూలీలుగా వలసపోతే- ఆరోజున మీరు ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉద్యమం చేశారు తప్ప, ఇక్కడే ఉపాధి దొరికి ఉంటే.. ఇన్ని లక్షల రైతు కుటుంబాలు వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారేవారా..? అని ఏనాడూ ప్రశ్నించలేదు.
– మరి తేడా ఎక్కడుంది..?
5- మరొక్క విషయం కూడా రామోజీరావు గారూ…
– గోదావరి పుష్కరాల పేరిట రాజమండ్రిలో చీప్ పబ్లిసిటీ కోసం సాక్షాత్తూ చంద్రబాబునాయుడే 29 మందిని చంపేశాడు.
– ఆరోజు అది బాబు చేసిన ఘోరమే. కానీ, చేసింది బాబు కాబట్టి అది నేరమైనా-ఘోరమైనా మీకు కమ్మగా కనిపిస్తోంది-తియ్యగా అనిపిస్తోంది.
– అటువంటి దుర్మార్గాలను వెనకేసుకొచ్చి, దురదృష్టవశాత్తూ భవన నిర్మాణ కార్మికులు కర్ణాటకలో చనిపోతే వారి కుటుంబాలకు ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత నష్టపరిహారాన్ని, వేరే రాష్ట్రంలో ప్రమాదం జరిగినా ఇచ్చిన జగన్ గారి ప్రభుత్వం మీద, మానవతాసాయం విషయంలో ఏమాత్రం వెనకాడని నాయకుడి మీద, మీవాడు కాదు కాబట్టి, మీకు గిట్టనివాడు కాబట్టి రాళ్ళు వేస్తారా..?
– మరీ ఇంత దుర్మార్గమా..?
6- మిగతా రాష్ట్రాలకు వెళ్ళడం ఘోరం-నేరం అంటున్న మీరుగానీ, మీతోటి ఎల్లో మీడియా అధిపతులుగానీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
– అసలు మా రాష్ట్రంతో, మీ సొంతూళ్ళతో మీకు ఉన్న సంబంధం ఏమిటి..?
– చంద్రబాబుతో ఉన్న వర్గపరమైన అనుబంధం తప్ప, మీకు మా రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంది..?
– చంద్రబాబునాయుడుకు అయినా, పవన్ కల్యాణ్ కు అయినా, సొంత ఇల్లు కూడా లేని ఈ రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంటుంది?
– మీరు మా రాష్ట్రంలో కష్టాల మీద, కన్నీళ్ళ మీద డ్రామా ఆడినంతమాత్రాన మీ చరిత్ర పరిశుద్ధమైపోదు.
– కాస్తంత మానవత్వాన్ని అయినా ఈ 90 ఏళ్ళ వయసులో నిలుపుకోండి.

– కొడాలి నాని

LEAVE A RESPONSE