– మళ్లీ తెరపైకి ‘వంగవీటి రంగా’వాదం
– డిసెంబర్ 26న విశాఖలో ‘రంగానాడు’
– ఆర్కే బీచ్‌లో లక్షమందితో భారీ బలప్రదర్శన
– ఉత్తరాంధ్రలో భారీ జనసమీకరణ
– సభకు సిద్ధమవుతున్న కాపు, తూర్పుకాపులు
– ఉత్తరాంధ్ర కాపు నేతలకు ఆహ్వానాలు
– టీడీపీ, జనసేన నేతలు హాజరవుతారా?
– కులరహిత సభ అంటున్న నిర్వహకులు
– వంగవీటి రాధా వస్తారా?
– రంగా కూతురు ఆషా హాజరు
– ఇప్పటికే రాజకీయంగా చీలిపోయిన రంగా కుటుంబం
– మరి రంగాపై పేటెంటీ ఎవరికి?
– రంగా కుటుంబంపై రాధా-రంగా మిత్రమండలి ఒత్తిడి
– మళ్లీ క్రియాశీలపాత్ర పోషించాలంటూ రాయబారాలు
– కాపులను అనాధలుగా మిగిల్చవద్దంటూ మిత్రమండలి ఒత్తిళ్లు
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఒక ఆకాశం
ఒకే సూర్యుడు
ఒకే చంద్రుడు
ఒకే భూమి
ఒకే ఒక్కడు మోహనరంగా
కొండమీద దుర్గమ్మ
కొండ కింద రంగన్న
సాగర ఒడ్డున కాళీమాత
సాగర తీరాన రంగానాడు
– ఇదీ ఇప్పుడు సోషల్‌మీడియాలో కాపు సంఘాల పోస్టింగుల వర్షం
* * *
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసి.. చివరకు ప్రభుత్వాలను కూలగొట్టేందుకు కారణమయిన వంగవీటి రంగా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. చర్చల్లోకి వచ్చింది. మరో ‘కుల’కలానికి తెరలేపింది. దానికి కారణం ఈనెల 26న విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న రంగానాడు బహిరంగ సభ.
కాపులకు రాజ్యాధికార లక్ష్యంతో గతంలో వచ్చిన చిరంజీవి ‘ప్రజారాజ్యం’ ప్రయోగం విఫలమయి, కాపులను దారుణంగా నిరుత్సాహపరచగా.. పవన్ కల్యాణ్ ‘జనసేన’ కూడా తమను దూరంగా ఉంచుతున్న వైనం, కాపులను ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకునేందుకు కారణమవుతోంది. జనసేనతో పొత్తు ఉన్నందున, గతంలో తమను ప్రోత్సహించిన టీడీపీ ఇప్పుడు పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి.. కొత్త ప్రత్యామ్నాయ వేదికలకు కారణమవుతోంది. ఫలితంగా రాష్ట్రంలో మళ్లీ ‘కుల’కలానికి తెరలేవనుంది.
అయితే.. పల్లకీ ఎత్తేందుకు కాపులు-రంగా అభిమానులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రంగా కుటుంబం మాత్రం, పగ్గాలందుకునేందుకు సిద్ధపడకపోవడమే ఇక్కడ ఆశ్చర్యం. దానితో నాయకత్వ పగ్గాలందుకోవాలంటూ.. రంగా కుటుంబంపై ఒత్తిడి చేసేందుకు, రాధా-రంగా మిత్రమండలి రంగంలోకి దిగింది. కుల-మతాలకు అతీతంగా రంగా ఆశయాలను కొనసాగించాలంటూ, రంగా కుటుంబంపై ఒత్తిడి పెంచుతోంది. అందులో భాగంగా ఈనెల 26న విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా, లక్షమందితో ‘రంగానాడు’ నిర్వహించనుండటం ఆసక్తిగా మారింది.
వంగవీటి రంగా ఆశయ సాధనను కొనసాగించి, బడుగు బలహీన వర్గాలకు గొంతుకయ్యే లక్ష్యంతో రాధా -రంగా మిత్రమండలి, సుదీర్ఘ విరామానంతరం ‘రంగానాడు’ పేరిట భారీ బలప్రదర్శనతో బహిరంగసభకు సన్నద్ధమవటం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
సభకు లక్షమందికి పైగా హాజరవుతారన్నది నిర్వహకుల అంచనా. ఆ మేరకు టీడీపీ-జనసేన-వైసీపీకి చెందిన కాపు-మున్నూరు కాపులతోపాటు.. మందకృష్ణమాదిగ, ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ మాజీ ఎంపి జీవీఎల్ నరసింహారావును కూడా ఆహ్వానించారు. విశాఖ జిల్లాలోని కాపులు, విజయనగరం-శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని తూర్పు కాపులు.. సమీపంలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపులతో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా, రాజకీయాల్లో మళ్లీ కీలకపాత్ర పోషించాలన్నది రంగానాడు లక్ష్యంగా కనిపిస్తోంది.
నిజానికి విజయవాడ వేదికగా తొలినాళ్లలో టీడీపీ నిర్వహించిన ‘మహానాడు’ సభ ప్రాంగణంలోనే ‘రంగానాడు’ జరగాల్సింది. టీడీపీ నిర్వహించిన అదే ప్రాంత ంలో రంగానాడు నిర్వహించి, వంగవీటి రంగా సత్తా చాటాలని కాపునేత పిళ్లా వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. అందుకు రంగా కూడా అంగీకరించారు. రాష్ట్రంలో రంగా ఇమేజీని పెంచాలన్నది వారి అసలు లక్ష్యం.
అయితే ఆ వాదనను వారించి.. రంగానాడు పేరు పెడితే కొందరే వస్తారని, దానిని ‘కాపునాడు’గా మారిస్తే చరిత్ర సృష్టించవచ్చని నాటి కాపు నేత, కాపునాడు సృష్టికర్త మిరియాల వెంకట్రావు చేసిన సూచనను రంగా సహా, అంతా అంగీకరించారు. దానితో టీడీపీ మహానాడు నిర్వహించిన చోటనే కాపులతో ‘కాపునాడు’ నిర్వహించారు. దానికి రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా లక్షలాదిమంది హాజరయ్యారు. ఆవిధంగా కాపునాడు వ్యవస్థాపకుడు మిరియాల వెంకట్రావు ఆలోచన ఫలితంగా.. ఇప్పటికీ విజయవాడలోగానీ, రాష్ట్రంలో గానీ అదే భారీ బహిరంగసభ అన్న రికార్డు.. దశాబ్దాల నుంచి విజయవంతంగా కొనసాగుతోంది.
ఆ తర్వాత చాలామంది కాపునేతలు సభలు పెట్టినా, అవి పెద్దగా సక్సెస్ కాలేదు. గత చంద్రబాబు హయాంలో.. ముద్రగడ పద్మనాభం తునిలో నిర్వహించిన సభ మాత్రం సూపర్ డూపర్ హిట్టయింది. బాబు హయాంలో ముద్రగడ, వైసీపీ తెరవెనక మద్దతుతో చేసిన ఆందోళన కాపుల ఏకీకరణకు కారణమయింది.
ముద్రగడ దూకుడుకు ఓవి రమణ చెక్
అయితే ఆ సమయంలో ముద్రగడ ఉద్యమానికి వ్యతిరేకంగా.. బలిజనాడు న్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు డాక్టర్ ఓ.వి.రమణ ప్రారంభించిన యాత్ర, బలిజలను కాపుల నుంచి వేరు చేసేందుకు కారణమయింది. ‘జనాభా సంఖ్యలో బలిజలు అధికం. అయినా మాకు రాజకీయ ప్రాధాన్యం లేదు. మేం కాపుల నీడలో ఎందుకు బతకాలి? మీరు మా సంఖ్యాబలం అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. ఇకపై ఆ రాజకీయం చెల్లదు. కాపు-బలిజలు వేర్వేరు. కాపు కార్పొరేషన్‌ను విడదీసి, బలిజ కార్పొరేషన్ పెట్టాల్సిందే. రాయలసీమలో బలిజలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించాల్సిందే. నిజంగా ముద్రగడ-ఇతర కాపు నాయకులకు బలిజ-కాపు ఐక్యతపై చిత్తశుద్ధి ఉంటే, బలిజలకు జనాభా నిష్పత్తి ప్రకారం పదవులివ్వాలని డిమాండ్ చేయాలి. అయినా కాపులు-బలిజలు వేర్వేరు. మీరు మమ్మల్ని అడ్డుపెట్టుకుని మీ స్వార్ధరాజకీయాలు చేయవద్ద’’ని బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ గోదావరి జిల్లాలకు వెళ్లి మరీ హెచ్చరించిన వైనం కలకలం సృష్టించింది. ఆ సమయంలో ఆయనపై ముద్రగడ అనుచురులు కొందరు దాడి చేయడం, వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముద్రగడ వైసీపీలో చేరగా, ఓ.వి.రమణ టీడీపీలో చేరారు. అది వేరే విషయం.
మళ్లీ కొన్నేళ్ల తర్వాత.. ‘రంగానాడు’ పేరుతో విశాఖలో భారీ బహిరంగసభకు నడుం బిగించడం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి ఉత్తరాంధ్ర-ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు-తూర్పు కాపు అగ్రనేతల దన్ను ఉన్నట్లు సమాచారం.
‘‘ ఇది కాపులకు సంబంధించిన సభ కాదు. రంగా అభిమానులది. రంగాకు అన్ని కులాల్లోనూ అభిమానులున్నారు. ఇది కులసభ కాదు. అందుకే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, బీసీ నాయకుడు, ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ మాజీ ఎంపి జీవీఎల్ నరసింహారావు హాజరవుతున్నారు. రంగా 38వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఏవిధంగా కొనసాగించాలన్నదే ఈ సభ అజెండా. ఆ సందర్భంగా కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతాం’’ అని రాయలసేన కన్వీనర్ పోరుమామిళ్ల ఈశ్వర్ రాయల్ వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం కాపుల్లో నెలకొన్న గందరగోళం, కాపు సంఘాల అసంతృప్తి పరిశీలిస్తే.. విశాఖ సభ కాపుల బలప్రదర్శనగానే కనిపిస్తోంది. ఈశ్వర్ రాయల్ చెప్పినట్లు.. విశాఖ సభ రంగా అభిమానుల కోసమే అన్నది నిజమే అయినప్పటికీ, అది విజయవాడ వరకే పరిమితం. అది కూడా ఒకప్పుడు మాత్రమే.
నిజానికి రంగా జీవించి ఉన్న సమయంలో, విజయవాడలో ఆయన అన్ని కులాలతో సన్నిహితంగా ఉండేవారు. బ్రాహ్మణులు ఆయనతో కలసి నడవగా, కమ్మకులంలో ఒక వర్గం ఆయనతో నడిచారు. ఒక్కో కులం నుంచి ఒకరిని సలహాదారులుగా నియమించుకునేవారు. కానీ రాష్ట్రం విషయానికొస్తే మాత్రం.. రంగా అభిమానులంతా కేవలం కాపులే అన్నది నిర్వివాదం. రాష్ట్రంలో కనిపించే రంగా విగ్రహాలు ఏర్పాటుచేసింది కూడా కాపులేన న్నది విస్మరించకూడదు.
ఇప్పుడు విశాఖలో జరగనున్న ‘రంగానాడు’ బహిరంగసభ సమీకరణ కూడా, కాపుల కేంద్రంగానే జరుగుతోంది. లక్షమంది హాజరవవుతారని చెబుతున్నప్పటికీ, అది రెండు లక్షలు కావచ్చన్నది తమ అంచనా అని నిర్వహకులు చెబుతున్నారు. ఆ మేరకు కాపు సంఘాలు, పార్టీలకు అతీతంగా భారీ జనసమీకరణకు నడుం బిగిస్తున్నాయి.
కూటమి అధికారంలోకి రాకముందు తాము పెట్టుకున్న ఆశలు, అంచనాలు తల్లకిందులయ్యాయని.. తమ కులానికి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, కాపు సంఘాలు ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘పవన్ మాకేదో చేస్తారని, మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారని ఆశించి జనసేన- ఆ పార్టీ మద్దతునిచ్చిన టీడీపీకి ఓట్లు వేశాం. మాకు ఇష్టం లేకపోయినా పవన్‌ను చూసి, జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీకి ఓట్లు వేశాం. కానీ అసలు పవన్ కాపు సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. కాపు సంఘాలను దగ్గరకే రానీయడం లేదు. గతంలో మనకు టీడీపీలో ప్రాధాన్యం ఉండేది. చంద్రబాబు మనల్ని బాగా చూసుకున్నారు.
ఇప్పుడు కూటమిలో పవన్ ఉన్నందున ఆ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మనం వెళ్లి టీడీపీ కాపు ఎమ్మెల్యేలకు సమస్యలు చెబితే.. పార్టీ మమ్మల్నే పట్టించుకోవడం లేదు. ఇక మేం మీకేం చేయగలం? పరిస్థితులు అప్పటిలా లేవు. మీరు వెళ్లి పవన్‌ను కలవండి అని తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. పవన్ తమతో ఉన్నందున మిగిలిన కాపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధోరణిలో టీడీపీ ఉంది. దీనితో మనం రెంటికీ చెడ్డ రేవడి అయ్యాం.
అటు చూస్తే జగన్ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో మీరే ఆలోచించి చెప్పండి’’ అంటూ వనభోజనాల్లో కాపు సంఘ నేతలు, తమ కులస్తులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా విశాఖలో ఈనెల 27న జరగనున్న కాపునాడులో.. ఈ అసంతృప్తి ప్రతిబింబించబోతోందని, కాపు నేతలు జోస్యం చెబుతున్నారు.
సభకు వచ్చిన వారే రంగా వారసులా?
అయితే అక్క ఆర్భాటమే కానీ బావ బతికుంది లేదన్నట్లు.. ‘‘రంగా అభిమానుల హడావిడే తప్ప, రంగా కుటుంబానికి ఆయన పై పేటెంటీ సంపాదించాలన్న పట్టుదల లేదు. ఆయన పేరు చిరస్థాయిగా నిలపాలన్న ధ్యాస లేదు. అందుకే మా ఈ ప్రయత్నం. రంగా కుటుంబం నుంచి ఎవరో ఒకరు బయటకు వచ్చి, రంగా అభిమానులు-కాపులను నడిపించాలని ఒత్తిడి చేస్తున్నాం. విశాఖ సభకు రంగా కుటుంబసభ్యులు ఎవరొస్తారో చూద్దాం. వచ్చిన వారే రంగా నిజమైన వారసులు’’ అని ఓ కాపు నేత వ్యాఖ్యానించారు.
రంగా కుటుంబంపై పెరుగుతున్న ఒత్తిడి
నిజానికి రాధా-రంగా మిత్రమండలి ఆ మేరకు చాలాకాలం నుంచీ ప్రయత్నాలు చేస్తోంది. రంగా కుటుంబంపై ఒత్తిడి చేస్తోంది. అయితే రంగా కుటుంబం పార్టీల పరంగా చీలిపోయారు. రంగా తనయుడు రాధా తన వెంట కాపులంతా ఉండాలని కోరుకుంటారు గానీ, ఆ మేరకు తన కార్యాచరణ ఉండదు. రంగా మాదిరిగా సీరియస్ పాలిటిక్స్ చేయరు. ఆయన నాయకత్వం కోసం కాపులు-రంగా అభిమానులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన నాన్ సీరియస్‌నెస్ వైఖరి, వారిని అసహనానికి గురిచేస్తోంది. రాధా వైఖరి రంగా అభిమానులకు ఇప్పటికీ అర్ధం కావడం లేదన్నది కాపు నేతల వ్యాఖ్య.
ఇక రంగా కుటుంబానికే చెందిన శంతన్‌కుమార్ కొద్దికాలం రాజకీయాల్లో కొనసాగినా, ప్రస్తుతం కనుమరుగయ్యారు. మేఘనాధ్, శ్రీనివాస ప్రసాద్ పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక వంగవీటి నరేంద్ర వైసీపీలో చురుకుగా ఉన్నారు. రంగా సతీమణి రత్నకుమారి పేరు వినిపించడం మానేసి చాలా కాలమయింది.
ఆషా కిరణ్ కాపుల కాపుల ఆశాకిరణమవుతారా?
ఈ నేపథ్యంలో రంగా ఆశయ సాధనకు నేనున్నానంటూ.. ఆయన కుమార్తె ఆషాకిరణ్ హటాత్తుగా తెరపైకి వచ్చి, చేస్తున్న హడావిడి ఆసక్తికరంగా మారింది. తాను రాధా-రంగా మిత్రమండలి సూచనల ప్రకారం.. తన భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తానని, ఏ పార్టీలో చేరాలన్నది వారితో చర్చించి ప్రకటిస్తానంటూ ఇటీవ ల ఆమె చేసిన ప్రకటన, కాపులలో ఆసక్తి పెంచేందుకు కారణమయింది. ఆ మేరకు విశాఖ సభకు ఆషా కిరణ్ ఆశాకిరణంగా చెబుతున్నారు. సభకు వంగవీటి రాధాను కూడా ఆహ్వానించినప్పటికీ, ఆయన వస్తారో-గైర్హాజరవుతారో చూడాలని రంగా అభిమానులు చెబుతున్నారు.
వంగవీటి బ్రాండ్‌ను పాడుచేయవద్దు
కాగా రంగా కుటుంబసభ్యుల నిర్లిప్త వైఖరిపై కాపు సంఘాలు, కాపు సోషల్‌మీడియాలో ఇటీవలి కాలంలో చేస్తున్న పోస్టింగులు ఆసక్తికరంగా మారాయి. ‘‘ రాజకీయాలను శాసించే కుటుంబం నుంచి వచ్చిన వారు మీరు. కానీ ఈరోజు మీరు వేరే పార్టీల వద్ద పదవులు ఆశించే స్థాయిలో ఉన్నారు. తప్పు మీదా? లేక మీరు ఉన్న పార్టీ నాయకులదా అని మీరు తప్పసరిగా ఆలోచించుకోవాలి. మీరంతా కలసి ప్రజల మధ్య ఉంటూ ప్రజాపోరాటాలు చేస్తే.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ముందు క్యూ కడతాయి. రాజకీయం పేరుతో వంగవీటి బ్రాండ్‌ను పాడుచేయవద్దు’’ అంటూ రంగా కుటుంబసభ్యుల ఫొటోలు పెట్టి.. ‘నేటి తరం రంగా వారసులు’ అంటూ.. రాధా, ఆషాకిరణ్, శంతన్‌కుమార్, మేఘనాధ్, శ్రీనివాస ప్రసాద్, నరేంద్ర ఫొటోలతో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి.
టీడీపీ-జనసేన-వైసీపీ నేతలు వెళతారా?
విశాఖలో జరిగే రంగానాడు సభకు టీడీపీ,జనసేన, వైసీపీకి చెందిన కాపు నేతలను ఆహ్వానించారు. అయితే వారిలో ఎంతమంది సభకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీడీపీకి చెందిన కాపు నేతలు-ప్రజాప్రతినిధులు అత్యంత ఇరకాట పరిస్థితిలో ఉన్నారు. కులం పేరెత్తేందుకే ఇబ్బంది పడుతున్నారు. కాపు సభలు పెడితే కుటుంబసభ్యులను పంపిస్తున్న ఇరకాటం. ఇక జనసేన నేతలు సభకు వెళితే, ఏమవుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వైసీపీ తొలినుంచీ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నందున, ఆ పార్టీ నుంచి ఎవరు హాజరవుతారో చూడాలి. కానీ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ తూర్పు కాపు నేతలు దీనికి భారీ జనసమీకరణ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.