Suryaa.co.in

Andhra Pradesh

ఏపీఐఐసీ ఎండీని కలిసిన ప్రపంచస్థాయి దేహదారుఢ్య కాంస్య పతక విజేత రవికుమార్

-ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాదిని కలిసిన ప్రపంచ స్థాయి దేహదారుఢ్య పోటీలలో కాంస్య పతక విజేత రవికుమార్ 
-ముఖ్యమంత్రి, స్వర్గీయ మంత్రి మేకపాటి, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఆర్జాస్ స్టీల్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపిన బాడీబిల్డర్ రవి
-స్వర్గీయ మంత్రి మేకపాటికి కాంస్య పతకం అంకితమిచ్చినట్లు బాడీ బిల్డర్ రవి వెల్లడి
-ఇకపై సాధించబోయే పతకాలను కూడా గౌతమ్ రెడ్డికే అంకితమివ్వనున్నట్లు తెలిపిన రవి
-పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో రవిని సత్కరించిన ఎండీ సుబ్రమణ్యం

అమరావతి, ఏప్రిల్, 27 : ప్రపంచ స్థాయి దేహదారుఢ్య పోటీలలో ఇటీవల కాంస్య పతకం సాధించిన బాడీబిల్డర్ రవికుమార్ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాదిని కలిశారు. 170కి పైగా దేశాలు పాల్గొన్న మిస్టర్ యూనివర్స్ – 2022 పోటీలలో 70 కిలోల విభాగంలో పురస్కారం కైవసం చేసుకున్న రవికుమార్ ని ఎండీ అభినందించారు. శాలువాతో సన్మానించి మరింత రాణించి ముందు ముందు అంతర్జాతీయ స్థాయి పోటీలలోనూ పతకాలు సాధించాలని శుభాభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నిశ్శంకరరావు రవికుమార్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి ఆదేశం, స్వర్గీయ మంత్రి మేకపాటి ఆచరణ, ప్రోత్సాహం , ఏపీఐఐసీ ఎండీ ప్రత్యేక చొరవ వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. 2020 అక్టోబర్ లో సీఎంని కలవడం, అక్కడే ఉన్న మంత్రి మేకపాటికి తన బాధ్యతని అప్పగించడం జరిగాయని రవి ఎండీ గారితో గుర్తు చేసుకున్నారు. అయితే మార్చి, 2021 కల్లా తనకు ప్రస్తుత ఏపీఐఐసీ ఎండీ, నాటి పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా ఉన్న సుబ్రమణ్యం గారి ఆధ్వర్యంలో స్వర్గీయ మంత్రి మేకపాటి చొరవతో రూ.9 లక్షలు ఆర్జాస్ స్టీల్ కంపెనీ సామాజిక బాధ్యత నిధులను అందించి ఎంతగానో ప్రోత్సహించారని రవికుమార్ జ్ఞప్తి చేసుకున్నారు. ప్రతి నెలా రూ.70వేల చొప్పున సంవత్సరంలోగా రూ. 7లక్షల ఆర్థిక సాయం అందించారన్నారు. అంతేకాకుండా , గత నవంబరులో దక్షిణ కొరియాలో జరిగిన పోటీలకు కూడా కావలసిన ప్రయాణ ఖర్చు సహా కనీస వసతులను మరో రూ. 2లక్షలుగా ‘ఆర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్’ అందించినట్లు స్పష్టం చేశారు. అందుకే తాను సాధించిన పతకాన్ని స్వ ర్గీయ మంత్రి మేకపాటికి అంకితమిచ్చినట్లు బాడీ బిల్డర్ రవి వెల్లడించారు. ఇకపై సాధించబోవు పురస్కారాలను కూడా ఆయనకే అంకితమిస్తానని రవి స్పష్టం చేశారు.

స్వర్గీయ మంత్రి మేకపాటి చొరవ, రవి కుమార్ తపన వల్లే ఇదంతా జరిగిందని ఈ సందర్భంగా ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. స్వర్గీయ మంత్రి మేకపాటి ఎక్కడున్నా రవికి ఆయన ఆశీస్సులు ఉంటాయని, భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించాలని ఎండీ వెన్నుతట్టారు. సామాజిక బాధ్యతలో భాగస్వామ్యమై రవికి సాయం చేసిన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ సంస్థ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తిని , ఆ సంస్థ ప్రతినిధి రామ్, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ రత్నంని కూడా ఏపీఐఐసీ ఎండీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల జాయింట్ డైరెక్టర్ విజయ్ రత్నం, ఏపీఐఐసీ సీజీఎం జ్యోతి బసు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE