రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత
అమరావతి : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిని చర్చలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమన్నారు.
రాయలసీమ ప్రజల తరఫున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం చంద్రబాబుతోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమని రాయలసీమ ప్రజల నమ్మకం పెట్టుకున్నారన్నారు. నేడు ఆ నమ్మకం నిజమైందన్నారు. వెనుకబడిన రాయలసీమలో ఎన్నో పరిశ్రమలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. తాగు, సాగునీరు కల్పనలోనూ సీఎం చంద్రబాబు పాత్రే కీలకమన్నారు.
ప్రస్తుతం రాయలసీమలో జరిగిన అభివృద్ధి అంతా చంద్రబాబు చలువేనని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ పాలాభిషేకాలు చేయించుకుని, రాయలసీమ వాసులను జగన్ మోసం చేశాడని మండిపడ్డారు.
జగన్ రాయలసీమ ద్రోహిగా ప్రజల్లో మిగిలిపోయాడన్నారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిన్న(బుధవారం) మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం… ఈరోజు(గురువారం) సభలో బిల్లు ప్రవేశపెట్టడం చాలా ఆనందకర విషయమని మంత్రి సవిత తెలిపారు.