– కాంగ్రెస్ రాజ్యసభ సీటు వేం నరేందర్‌రెడ్డికే
– నెగ్గిన సీఎం రేవంత్‌రెడ్డి పంతం
– ఢిల్లీపై రేవంత్ పట్టు సాధించినట్లే
– బీసీ, ఎస్సీ, మైనారిటీలకు మొండిచేయి
– సీనియర్లకు మరోసారి నిరాశ
– వేం సీనియారిటీ ఏమిటని ప్రశ్నిస్తున్న బడుగు బలహీన వర్గాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీపై పట్టు సాధించారు. ఇప్పటివరకూ ఆయనకు ఢిల్లీపై పట్టు- రాహుల్ వద్ద పలుకుబడి లేదంటూ వస్తున్న వార్తలను వెక్కిరిస్తూ.. తన సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించుకుని, ఇప్పటివరకూ పార్టీ మారని ‘పుట్టు కాంగ్రెస్’ సీనియర్లకు ఝలక్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా, ఆ సీటు ఆశిస్తున్న బీసీ, ఎస్సీ, మైనారిటీలకు మరోసారి నిరాశ ఎదురయింది.
రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ఖరారు కాగా, ఇంకో సీటు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అందులో భాగంగా సీనియర్ నేత వి.హన్మంతరావు, కమ్మ వర్గానికి చెందిన కుసుమకుమార్‌కు ఇవ్వాలని జగ్గారెడ్డి వంటి సీనియర్లు డిమాండ్ చేశారు.
కాగా సీనియర్ నేతలయిన జనారెడ్డి, మధుయాష్కీ, వంశీచందర్‌రెడ్డి, వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, కేశవరావు, షబ్బీర్‌అలీ, బెల్లయ్యనాయక్, వారికి నిరాశే మిగిలింది. వీరిలో మధు యాష్కీ, వంశీచంద్‌రెడ్డికి ఏఐసీసీ కార్యదర్శులుగా చేసిన అనుభవం ఉందని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
నిజానికి వీరిలో కేశవరావు మినహా మిగలిన వారంతా తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న వారే కావడం గమనార్హం. కేశవరావు బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. వీరికే కాకుండా ఈసారి రాజ్యసభపై నమ్మకం పెట్టుకున్న మాదిగలకు మళ్లీ నిరాశే ఎదురయింది. ఇప్పటివరకూ అన్యాయానికి గురయిన మాదిగలకు, ఈసారి న్యాయం చేస్తారన్న ఆశలు అడియాశలయ్యాయి.
జనగణన తర్వాత బీసీ మంత్రం జపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రాజ్యసభ ఎన్నికల్లో ఆమేరకు బీసీలకు స్థానం కల్పిస్తారన్న అంచనాలు ఆ వర్గంలో లేకపోలేదు. ఆ మేరకు పార్టీకి సేవచేస్తున్న వీహెచ్, అంజన్, మధుయాష్కీ వంటి వారిలో ఒకరికి అవకాశం దక్కుతుందని బీసీ వర్గాలు భావించాయి.
అటు ముస్లిం వర్గాలు సైతం, వేం నరేందర్‌రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతున్నాయి. గత ఎన్నికల నుంచి మొన్నటి స్థానిక ఎన్నికల వరకూ, పార్టీకి దన్నుగా నిలిచిన ముస్లిం వర్గానికి కాంగ్రెస్ మొండి చేయి చూపించడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ సీనియర్ నేత, గత ఎన్నికల్లో రేవంత్ కోసం కామారెడ్డిలో సీటు త్యాగం చేసిన షబ్బీర్ అలీ కంటే.. రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన, వేం నరేందర్‌రెడ్డి సీనియరా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కాగా మళ్లీ ‘రెడ్డి కార్పెట్’ వేయడంపై, కాంగ్రెస్ లోని బీసీ-ద ళిత వర్గాలు భగ్గుమంటున్నాయి. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన వేం నరేందర్‌రెడ్డికి, ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిన రేవంత్.. మళ్లీ ఇప్పుడు రాజ్యసభ పదవి ఎలా సిఫార్సు చేస్తారు? అంత అవసరం ఏం వచ్చింది? రాజ్యసభలో బలంగా పార్టీ వాణి వినిపించే వారిని కాదని.. ఏ అర్హతతో వేంకు సీటు ఇచ్చారని, బడుగు బలహీన వర్గాలు విరుచుకుపడుతున్నాయి. అసలు వేం నరేందర్‌రెడ్డి పార్టీకి చేసిన సేవలు ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
ఇప్పటికే అన్ని ప్రధాన పదవులు రెడ్లకు కట్టబెట్టిన రేవంత్‌రెడ్డి.. మళ్లీ ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా రెడ్లకే కట్టబెట్టడం వల్ల, పార్టీకి బడుగు-బలహీన-మైనారిటీ వర్గాలు అవసరం లేదన్న సంకేతాలు ఇవ్వడమేనన్న వ్యాఖ్యలు బీసీ,ఎస్సీ,మైనారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆయా వర్గాలు పార్టీకి దూరమవుతే నష్టపోయేది పార్టీయేనని స్పష్టం చేస్తున్నారు.
‘‘ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ బలపడుతున్నాయి. ఈ పరిస్థితిలో మేం బీసీ, ఎస్సీ, మైనారిటీలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వడం తెలివైన పని. కానీ సీఎం గారు తన మిత్రుడైన వేం నరేందర్‌రె డ్డికి ఆ సీటు ఇప్పించారు. అసలు నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలేమిటి? ఎంపి సీటు ఇవ్వడానికి ఆయనకు ఉన్న అర్హతలేమిటి? కేవలం రేవంత్‌రెడ్డి స్నేహితుడన్న ఒక్క అర్హత తప్ప, ఎంపీ అయ్యేందుకు ఆయనకున్న రాజకీయ అర్హత ఏమిటి? ఈ రెండేళ్లలో ఆయన ఎప్పుడైనా బీజేపీ-బీఆర్ఎస్ను విమర్శించారా? ఇప్పటికే రెడ్లకు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలను రేవంత్‌రెడ్డి లెక్కచేయకపోవడం దురదృష్టం. ఈవిధంగా పార్టీని రెడ్లకు కట్టబెడితే భవిష్యత్తులో బీసీ-ఎస్సీ-మైనారిటీ వర్గాలు మాకు దక్కరు. అయినా ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన పనేమిటి? మా నాయకత్వం కూడా కుల సమీకరణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం దారుణం’’ అని ఓ బీసీ నేత వ్యాఖ్యానించారు.