– ఆనం, మహీధర్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డిలపై కన్ను
– ఎంపీ మాగుంట, ఆదాలను తీసుకువచ్చే యత్నం?
– తాను పార్టీ మారేది లేదన్న మాగుంట
– ఇప్పటిదాకా ఖండించని ఆనం, మహీధర్‌రెడ్డి, ఎస్వీ
– సోమిరెడ్డి, జెసికి బాధ్యతలు
– పల్నాడు, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో వైసీపీ రెడ్డి నేతల అసంతృప్తి
– దానిని సద్వినియోగం చేసుకునేందుకు రంగంలోకి దిగిన టీడీపీ నాయకత్వం
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగుదేశం పార్టీ నుంచి నిష్ర్కమించిన ప్రముఖులకు మళ్లీ ‘రెడ్డికార్పెట్’ వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన పలువురు రెడ్డి నేతలతో, టీడీపీ సీనియర్లు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కోట్ల, నల్లారి, జేసీ, బొజ్జల, బిజివేముల వంటి కీలక రెడ్డి కుటుంబాలు టీడీపీలోనే కొనసాగుతుండగా, గత ఎన్నికల ముందు పార్టీ వీడిన ప్రముఖులను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలకు టీడీపీ నాయకత్వం తెరలేపింది.
అందులో భాగంగా ప్రస్తుత వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే ఎం. మహీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులను తిరిగి టీడీపీలోకి తీసుకువచ్చేప్రయత్నాలను ఆ పార్టీ నాయకత్వం ముమ్మరం చేసింది. కడపకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
నిజానికి గత ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమయినప్పటికీ, టీటీడీ చైర్మన్ సుధాకర్‌యాదవ్ పట్టుపట్టడంతో డీఎల్‌కు అవకాశం తప్పింది. మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కోడలు, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె, రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఇటీవలి ఒంగోలు మహానాడులో లోకేష్‌ను కలిసిన విషయం తెలిసిందే. కాగా వైసీపీలోని రెడ్డి నేతలను పార్టీ తీసుకువచ్చే బాధ్యతను టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జెసి దివాకర్‌రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా, తమకు ఎలాంటి న్యాయం జరగగలేదన్న అసంతృప్తి ఆ పార్టీకి చెందిన రెడ్డి నేతల్లో బలంగా నాటుకుపోయింది. కేవలం జగన్ చుట్టూ ఉన్న రెడ్డి నేతలు, కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ధి జరిగింది తప్ప, సామాన్య రెడ్డి నేతలకు ఎలాంటి లబ్ధి జరగలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు తమకు పార్టీలో పెద్దగా విలువ లేదన్న అసంతృప్తి వారిలో లేకపోలేదు.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా, ఆ పార్టీ గ్రామ, మండల స్థాయి నేతలు ఆర్ధికంగా బలపడితే.. తాము మాత్రం వాలంటీర్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందన్న ఆవేదన, వైసీపీ రెడ్డి నేతల్లో పాతుకుపోయింది. తాము నియమించిన వాలంటీర్లకు ఉన్న విలువ-పలుకుబడి, ఎన్నికల ముందు లక్షలు ఖర్చు పెట్టి పార్టీని గెలిపించుకున్న తమకు లేవన్న వ్యాఖ్యలు వైసీపీ రెడ్డి నేతల నుంచి బహిరంగంగానే వినిపించడం విశేషం.
అయితే.. రెడ్డి నేతల అసంతృప్తిని వైసీపీ నాయకత్వం కూడా, అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత గుర్తించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ సందర్భంలో టీడీపీ పరాజయానికి జన్మభూమి కమిటీనే కారణమయినందున, అలాంటి సంస్కృతిని తాము ప్రోత్సహించకూడదని వైసీపీ నాయకత్వం స్థిరమైన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొందరు వైసీపీ రెడ్డి నేతలు మాత్రం.. రెడ్లలో ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ, ఎన్నికల్లో వారు టీడీపీకి ఓటువేయరని, వైసీపీకి వేసినప్పటికీ.. గత ఎన్నికల మాదిరిగా, చొరవ తీసుకుని పట్టుదలతో అభ్యర్ధిని మాత్రం గెలిపించకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి చెందిన కమ్మ నేతలు కూడా ఇదే విధంగా.. పార్టీపై అసంతృప్తితో, పార్టీకి మాత్రం ఓటు వేసి మునుపటి మాదిరిగా చురుకుగా వ్యవహరించలేదని గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రెడ్లు కూడా అదే దారి పట్టవచ్చంటున్నారు.
కాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి, ఇప్పటికే కడప జిల్లాకు చెందిన పలువురు రెడ్డి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆ పార్టీ చేయించిన సర్వేలో, ఈసారి కడప జిల్లాల్లో టీడీపీకి 5 స్థానాలువచ్చే అవకాశం ఉన్నట్లు తేలినట్లు చెబుతున్నారు. అదేవిధంగా అనంతపురంలో అత్యధిక స్థానాలు, కర్నూలు జిల్లాలో సగానికిపైగా గెలిచే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లా వైసీపీ నేతలతో జెసి దివాకర్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీ.ఎల్ రవీంద్రారెడ్డితో కూడా మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, తాను పార్టీ మారేది లేదని ఎంపీ మాగుంట చెబుతుండగా.. ఆదాల, ఆనం, మహీధర్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రం ఇప్పటిదాకా ఖండించకపోవడం ప్రస్తావనార్హం. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆదాల అసలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చంటున్నారు. ఎన్నికలకు ముందు ఆనం టీడీపీలో చేరవచ్చని ప్రచారం జరుగుతున్న్పటికీ, ఈసారి ఆయన తన వెంకటగిరి నియోజకవర్గంలో గెలవకపోవచ్చని, అందువల్ల మళ్లీ నియోజకవర్గం మార్చుకోక తప్పదని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఆనంతో పోలిస్తే, మహీధర్‌రెడ్డికి క్యాడర్, పట్టు ఎక్కువ అని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.