– వారం రోజుల వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశం
– ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ కు ఆదేశాలు
– ఫార్ములా ఈ-కార్ రేసు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వారం రోజుల వరకూ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ తన దర్యాప్తును కొనసాగించవచ్చని తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఏబీసీ తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఇరువర్గాల వాదనలు వినింది.
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని న్యాయస్థానానికి సుందరం తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేసిందని, ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్‌కు వర్తించవని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి, అసలు ఆధారాలే లేవని చెప్పారు. కేటీఆర్ లబ్ధి చేకూరినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేటీఆర్‌ను వారం రోజుల వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఒక ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారని, కానీ సదరు ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని కేటీఆర్ పిటిషన్ లో తెలిపారు. 2023 అక్టోబర్ 30న చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని చెప్పారు. అగ్రిమెంట్ కు ముందు నిధులు పంపడం ఎఫ్ఈఓ ఉల్లంఘన కాదని తెలిపారు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ కు ఇది కొనసాగింపు మాత్రమేనని చెప్పారు.
అగ్రిమెంట్ ద్వారా తాను వ్యక్తిగతంగా లాభపడినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్ లు ఉంటాయని ఒక మంత్రి బహిరంగంగానే మాట్లాడారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి, ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.