– రాజమండ్రిలో వైభవంగా దళిత సాంస్కృతిక పండుగ
– సెంటర్ ఫర్ డెమోక్రసీ పబ్లికేషన్స్ మూడు పుస్తకాల ఆవిష్కరణ
రాజమండ్రి: చరిత్ర మరిచినవాడు చరిత్రను సృష్టించలేడు. చరిత్ర స్మరణతోనే చరిత్ర సృష్టి సాధ్యమనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని ఉపదేశానుసారం.. చరిత్ర స్మరణ నేటితరం దళితుల ప్రథమ కర్తవ్యమని ప్రముఖ రచయిత, సెంటర్ ఫర్ డెమోక్రసీ పబ్లికేషన్స్ అధినేత కనికర్ల వెస్లీ అన్నారు.
రాజమండ్రి ఆనంద్ రీజెన్సీలోని కాటన్ హాల్ వేదికగా ఆదివారం ‘దళిత సాంస్కృతిక ఉద్యమ పండుగ’ సంబరం వైభవంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి హాజరైన దళిత మేధావుల సమక్షంలో కనికర్ల వెస్లీ రచించిన మూడు పుస్తకాలు (150 ఏళ్ల ఉద్యమ పండుగ, దళితులు యుద్ధవీరులు, భక్తి ఉద్యమం) ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు.
దేశం గర్వించేలా దళిత ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి, వారి భవిష్యత్తు తరాలకు బంగారుబాటలు వేసే అద్బుతమైన ఆలోచనే మూడ్నెల్ల (ఆగస్టు 26 నుంచి నవంబర్ 26 వరకు) దళిత సాంస్కృతిక ఉద్యమ పండుగ అని వెస్లీ చెప్పారు. పలువురు దళిత నేతలు, వక్తలు మాట్లాడుతూ కులాన్ని వ్యతిరేకిస్తూ.. అందరినీ సమానంగా చూడటం, నిజాయితీగా ఉండటం, శ్రమను, స్త్రీలను గౌరవించడం.. పరమత సహనం వంటి అంశాలు ఈ మూడు పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
దాచేసిన చారిత్రిక విషయాలను ఈ మూడు పుస్తకాల ద్వారా వెలికితీశారంటూ సెంటర్ ఫర్ డెమోక్రసీ పబ్లికేషన్స్ ను వక్తలు అభినందించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు, రాజమండ్రి మేధావులు పలువురు పాల్గొన్నారు.