– అద్వానీని గుర్తు చేసి వైసీపీ ఎదురుదాడి
– తొలగించకపోతే కూల్చేస్తామన్న బీజేపీ
-బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ ట్వీట్‌తో రాజుకుంటున్న అగ్గి
( మార్తి సుబ్రహ్మణ్యం)
గుంటూరు నగరంలో దశాబ్దాల నుంచి మహ్మద్ అలీ జిన్నా పేరుతో ఉన్న జిన్నా టవర్ పేరు
మార్చాలంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన ట్వీట్, రాష్ట్రంలో అనుకోకుండా భావోద్వేగాల అగ్గిరాజేసింది. ‘దేశద్రోహి జిన్నా పేరు గుంటూరు టవర్‌కు పెట్టడం ఏంటి? ఎక్కడో
పాకిస్తాన్లో ఉండాల్సిన పేరు ఇక్కడ ఉండటం అభ్యంతరకరం. ఆ టవర్‌కు అబ్దుల్ కలాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాల’ని సత్యకుమార్ గురువారం ఉదయం తన ట్వీట్లో డిమాండ్ చేశారు.
దానితో బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్మీట్లు, ట్వీట్లు, ప్రెస్నోట్లు శరపరంపరగా విడుదల చేసి, జిన్నా టవర్ పేరు మార్చకపోతే తామే టవర్‌ను కూల్చేస్తామని హెచ్చరించడంతో వేడి రాజుకుంది. బీజేపీ రాష్ట్ర
కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు ఒక అడుగు ముందుకేసి, ‘జిన్నా టవర్ పేరు తొలగించే విషయంలో జగన్ పాకిస్తాన్ వైపు ఉంటారా? భారతదేశం వైపు ఉంటారా తేల్చాలి. అలాగే దేశభక్తి ఉన్న క్రైస్తవులు కూడా ఈ విషయంలో స్పందించాల్సిందే’నని స్పష్టం చేసి, జిన్నా టవర్ అంశాన్ని మరింత రాజేశారు.
దానితో బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు కూడా రంగంలోకి దిగి, జిన్నా పేరు మార్చాల్సిందేనని
ప్రకటించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన గుంటూరు బీజేపీ నాయకత్వం, జిన్నా టవర్ పేరు మార్చాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్ల అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. టవర్
పేరు మార్చకపోతే కరసేవ చేస్తాం. అయోధ్యలో ఏం జరిగిందో రేపు అదే జరుగుతుందని హెచ్చరించారు.
జిన్నా కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు మీడియాలో ప్రముఖంగా రావడంతో, వైసీపీ రంగంలోకి దిగి ఎదురుదాడి చేయడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రంగంలోకి దిగి.. మతసామరస్యం కోసం అప్పట్లో జిన్నా పేరు పెట్టారని, ఏపీలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గాంధీని చంపిన గాడ్సేను పూజించే బీజేపీకి దేశం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అద్వానీ పాకిస్తాన్ వెళ్లి జిన్నా సమాధిని సందర్శించినప్పుడు జిన్నా లౌకికవాది అన్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ నేతలు కావాలంటే అద్వానీ వద్దకు వెళ్లి క్లారిటీ తీసుకోవాలని చురకలు అంటించారు.
అయితే జిన్నా కేంద్రంగా రాష్ట్రంలో మొదలైన కొత్త వివాదం బీజేపీకి కాస్త కలసివచ్చేలా కనిపిస్తోంది. ప్రజాసమస్యలు తప్ప రాష్ట్రంలో, తెలంగాణ మాదిరిగా భావోద్వేగ అంశాలు లేని బీజేపీకి, తాజాగా మొదలైన జిన్నా అంశం రాజకీయంగా కొంత లాభించే అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతునారు. పైగా తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామన్న సోము వీర్రాజు వ్యాఖ్యలతో,జాతీయ స్థాయిలో పరువు పోయిన బీజేపీకి ఇది కొంత ఊరట కలిగించే అంశమేనని అటు బీజేపీ నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవిధంగా సత్యకుమార్ గుంటూరు జిన్నా టవర్‌పై ట్వీట్ చేసి, వీర్రాజు వ్యాఖ్యలతో పూర్తిగా డామేజీ అయిన పార్టీ పరువును కాపాడారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.