– ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్: దేశంలోని వ్యవసాయ కూలీలు,పేద బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం రెండు దశాబ్దాల కిందట తీసుకువచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా)లో నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం బాధాకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.
గాంధీజీని దేశమంతా జాతిపిత అని గౌరవంగా పిలుచుకుంటారని,ఆయన గ్రామ స్వరాజ్యం గురించి కలలుగన్నారన్నారు.నరేగా పథకంలో నుంచి గాంధీజీ పేరు తొలగించడం పట్ల దేశ ప్రజలందరూ బాధాపడుతున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.రాజ్యసభలో గురువారం సాయంత్రం ఈ పథకంపై జరిగిన చర్చలో ఎంపీ రవిచంద్ర పాల్గొని మాట్లాడుతూ,శ్రీరాముడు అంటే అందరికి ఇష్టమేనని,ప్రాణప్రదమే అని, దైవంగా ఆరాధిస్తామని, దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టిన మహాత్మాగాంధీని కూడా గొప్పగా కొనియాడుతామన్నారు.
అటువంటి మహనీయుడి పేరును తొలగించకుండా అదేవిధంగా కొనసాగించాలని ఎంపీ వద్దిరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.నరేగా పథకాన్ని అదే మాదిరిగా కొనసాగిస్తూ, దేశంలోని పేద,బడుగు, బలహీన, అణగారిన వర్గాల సంక్షేమం,సముద్ధరణకు మరొక కొత్త పథకం తీసుకువస్తే అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తారని ఎంపీ రవిచంద్ర సలహానిచ్చారు.ఈ పథకంలో పని దినాలను 100 నుంచి 125 కు పెంచడం సంతోషకరమన్నారు.అయితే,90:10 నిష్పత్తిలో ఉన్న వాటాను 60:40గా ఇందులో పేర్కొనడం సమంజసం కాదని, సబబుగా లేదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.
ఇది రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారం పెంచేదిగా ఉన్నదని, కొత్తగా ఏర్పడిన మా తెలంగాణకు మరింత ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన వివరించారు.ఇది గ్రామాలు స్వయం సమృద్ధి సాధించే విధంగా, సమగ్రాభివృద్ధికి దోహదం చేసేదిగా,ప్రభుత్వాల ఆస్తులు పెంచేవిధంగా ఉండాలనేది తమ బీఆర్ఎస్ విధానమని ఎంపీ వద్దిరాజు చెప్పారు.అదేవిధంగా వ్యవసాయాన్ని దీనితో అనుసంధానం చేస్తే, పోచంపల్లి, సిరిసిల్ల తదితర చేనేత పరిశ్రమలను ఇందులో పొందుపరిస్తే రైతులు, వ్యవసాయ కూలీలు,నేతన్నలకు మరింతగా లాభం చేకూరుతుందని ఎంపీ వద్దిరాజు వివరించారు.
ఇంటర్ నెట్ లేని చోట దీని డిజిటల్ పని విధానానికి ఆటంకం తలెత్తకుండా చూడాలని, పథకం పర్యవేక్షణకు రాష్ట్ర కౌన్సిళ్లతో పాటు జిల్లా కౌన్సిల్స్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం బడ్జెట్ 2014-15లో 2,038 కోట్లు కాగా, ఇప్పుడు 4,344 కోట్ల రూపాయలుగా పేర్కొనడం సంతోషకరమన్నారు.ఈ పథకం బాగానే ఉందని,అయితే 90:10 నిష్పత్తి స్థానంలో 60:40 నిష్పత్తిలో కేంద్ర-రాష్ట్రాల వాటాను పేర్కొనడం చాలా ఇబ్బందికరంగా ఉందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.
ఈ కారణంగా రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని,మరిన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆర్థిక భారం వల్ల ఈ పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్రాలు ఇతర కార్యక్రమాలకు బదలాయించే అవకాశం ఉందని ఎంపీ వద్దిరాజు అభిప్రాయపడ్డారు. వీబీ-జీ రామ్ జీ పథకాన్ని వెంటనే అమలు చేయాల్సిన అత్యవసరం ఏమి లేదని,ఆరు నెలలు ఆలస్యమైనా కూడా నష్టం లేదన్నారు.
ఈ సున్నితమైన, ముఖ్యమైన బిల్లును జాతీయ అభివృద్ధి మండలి (ఏన్డీసీ)లో పెట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఎంపీ రవిచంద్ర సలహానిచ్చారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపితే బాగుంటుందని ఎంపీ రవిచంద్ర సూచించారు.ఈ పథకాన్ని వెంటనే అమలులోకి తేకుండా పునరాలోచన చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.