Suryaa.co.in

Andhra Pradesh

సాగర తీరంలో ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపు

మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌

విశాఖ‌: మన చుట్టూ ఉన్న పర్యావరణం పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత.. అలా చేసినప్పుడే ఆహ్లాద‌క‌రమైన జీవనం మన సొంతం అవుతుంది అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్య‌క్షులు, మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాల‌ తొలిగింపు.. మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో భాగంగా విశాఖ సాగర తీరం నుంచి భీమిలి బీచ్ వరుకూ 28 కిలో మీట‌ర్లు 40 ప్రాంతాలలో స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వ్య‌ర్థాల తొల‌గింపు కార్య‌క్ర‌మంలో అవంతి శ్రీ‌నివాస్, నేవీ ఉద్యోగులు, ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని అవంతి శ్రీ‌నివాస్ సూచించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఈరోజు 28 కిలోమీట‌ర్లు బీచ్ ప‌రిస‌రాల‌ను పరిశుభ్రం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈరోజు జరిగిన ఈ క్లీనింగ్ స్వచ్ఛంద కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకోవడం ఖాయం అన్నారు. దీని వలన సముద్ర జలాలను శుభ్రం గా ఉంచడమే కాక జీవరాశులను కాపాడినట్లు అవుతుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ అవంతి శ్రీ‌నివాస్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

LEAVE A RESPONSE