– పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన కిషన్ రెడ్డి
– విభజన చట్టానికి సవరణ తెచ్చి ఏడు మండలాలను అప్పగించిన ద్రోహం బీజేపీదే?
– కాళేశ్వరం పై రేవంతు చేస్తున్న దుష్ర్పచారాన్ని వల్లెవేస్తూ విషం కక్కుతారా?
– నాడు కాళేశ్వరంపై ప్రశంసలు కురిపించి, నేడు రాజకీయ లబ్ది కోసం అబద్దాలా?
– ఏడు మండలాలు, లోయర్ సీలేరును ఆంధ్రాలో కలిపి తెలంగాణ గొంతు కోసింది బీజేపీనే
– కాళేశ్వరంతో ఆయకట్టు పెరిగిందని కేంద్రమే సర్వేలో చెబితే కిషన్ రెడ్డికి కనిపించడం లేదా?
– కేంద్ర మంత్రి గడ్కరీ కాళేశ్వరాన్ని మెచ్చుకుంటే.. కిషన్ రెడ్డి మాత్రం అక్కసుతో బురద జల్లుతున్నారు
– కూలిపోతే గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?
– పార్లమెంట్ లో పచ్చి అబద్ధాలు ఆడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కిషన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి
– మాజీ మంత్రి హరీష్ రావు
కందుకూరు: సార్లరావులపల్లిలో శ్రీ స్వయంభు పెద్దమ్మతల్లి జాతర, రాజశ్యామల హోమం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అక్కడికి చేరుకున్న వారికి ఆలయ నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
ఈ సందర్భంగా హరీష్రావు ఏమన్నారంటే.. మహేశ్వరం మెడికల్ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఈ కాలేజీ మరియు 250 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సుమారు రూ. 150 కోట్లు మంజూరు చేయడంతో పాటు, స్థలాన్ని కేటాయించి జీవో కూడా ఇచ్చాం. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.
కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షపూరితంగా మహేశ్వరం మెడికల్ కాలేజీని రద్దు చేసి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది. ఎల్బీనగర్ లో కేసీఆర్ గారు మంజూరు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీని పెట్టి, అక్కడి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందకుండా, ఇక్కడ మహేశ్వరం ప్రజలకు మెడికల్ కాలేజీ లేకుండా చేసింది. ఈ హైవే మీద పెద్ద ఆసుపత్రి ఉంటే చుట్టుపక్కల 10 మండలాల ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందేవి. తక్షణమే ఇక్కడ 250 పడకల ఆసుపత్రిని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఫార్మాసిటీ వస్తే ఈ ప్రాంతంలో వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నాడు కేసీఆర్ గారు భూసేకరణ చేశారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీని రద్దు చేసి, ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు..ఇప్పుడు ఆ భూములను ఫ్యూచర్ సిటీ పేరుతో తమ అనుయాయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. ఏ ఉద్దేశం కోసం భూసేకరణ చేశారో, ఆ ఫార్మాసిటీనే ఇక్కడ పెట్టాలి. లేదంటే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలి.
రైతుల భూములతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు వ్యాపారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డాక, బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా తెలంగాణకు కాకుండా చేసింది బీజేపీ ప్రభుత్వమే.
ఆనాటి యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో ఈ విషయాన్ని పెట్టిందని కిషన్ రెడ్డి గారు పూర్తిగా అవగాహన లేకుండా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనా కిషన్ రెడ్డికి అవగాహన లేదు. కాళేశ్వరం నీళ్లతోనే నేడు లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం వల్ల తెలంగాణలో ఆయకట్టు పెరిగిందని సాక్షాత్తూ మీ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో సోషియో ఎకనామిక్ సర్వే నివేదిక పెట్టింది కదా.కిషన్ రెడ్డి కి ఆ సర్వే కనిపించడం లేదా?
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా కాళేశ్వరాన్ని మెచ్చుకున్నారు కదా.. గడ్కరీ మెచ్చుకున్నది నిజమా? మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక నిజమా? లేక కిషన్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు నిజమా?కాళేశ్వరం కూలిపోతే, మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లను హైదరాబాద్ కు ఎలా తెస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కూలిపోతే గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?
కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే, బీఆర్ఎస్ కట్టింది కాబట్టి దానిపై రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి బురద జల్లుతున్నారు.. ఇప్పటికైనా కిషన్ రెడ్డి అబద్ధాలు ఆపాలి. పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.