Suryaa.co.in

Telangana

నిధులు లేక వాలంతరి సంస్థలో నిలిచిపోయిన పరిశోధనలు

– పొదుపుగా నీటిని వాడి ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలి
– భూ సాంద్రత పెరగాలి
– అధ్యయనం కోసం ప్రతిష్ఠాత్మక ” వాలంతరీ ” సంస్థను సందర్శించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి
– పదేళ్లుగా నయా పైసా ఇవ్వక పోవడం వల్ల

హైదరాబాద్: నీటిని పొదుపుగా వాడటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలి. భూ సాంద్రత పెరగాలి. ఈ అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ప్రతిష్ఠాత్మక నీరు, భూ యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థ ( వాలంతరి ) ను బుధవారం సందర్శించారు. హిమాయత్ సాగర్ లో ఉన్న సంస్థ డైరెక్టర్ నరేందర్, ఇతర అధికారులతో చిన్నారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

నీరు, భూ యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థ ( వాలంతరి ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నీటి, భూ యాజమాన్య పద్ధతులు, భూ సాంధ్రత పెంచేందుకు సాగుతున్న అంశాలను చిన్నారెడ్డి క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు.

వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పొదుపుగా నీటిని వాడటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడం కోసం అనుసరించాల్సిన విధానంపై చిన్నారెడ్డి వాలంతరి సంస్థ ఉన్నతాధికారులతో చర్చించారు.

నీరు, భూ యాజమాన్య అంశాల్లో శిక్షణ, పరిశోధన కోసం ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేయాల్సి ఉన్నా, గత పదేళ్లుగా నయా పైసా ఇవ్వక పోవడం వల్ల వాలంతరి సంస్థలో పరిశోధనలు నిలిచిపోయాయి అన్న విషయం చిన్నారెడ్డి దృష్టికి వచ్చింది. అన్ని అంశాలపై అధ్యయనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారులు బొమ్మిరెడ్డి కృపాకర్ రెడ్డి, డాక్టర్ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE