– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేక బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీలకు ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ్ చందర్ రావు విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్లు నిజంగా ఇవ్వాలంటే, అది న్యాయపరమైన ప్రక్రియను పాటిస్తూ, చిత్తశుద్ధితో మాత్రమే సాధ్యమయ్యేది.
గతంలోనే నేను చెప్పాను. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2018 పంచాయతీ రాజ్ చట్టం (Section 285) సవరణ చేయాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిని అర్థం చేసుకోలేకపోయారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ విమర్శించారు. సెక్షన్ 285 సవరణ లేకుండా రిజర్వేషన్లు అమలు చేయలేం. ఈ సందర్భంలో, గతంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం 50% క్యాప్ మించరాదు అని కూడా స్పష్టంగా తీర్పునిచ్చింది.
22 నెలల ఆలస్యం తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేసిన తప్పును గ్రహించి, చివరికి బీజేపీ ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని, ఇటీవల అసెంబ్లీ సమావేశంలో Section 285 సవరణ చేసి మళ్లీ రెండోసారి బిల్లు తీసుకొచ్చింది. కానీ, ఈ చట్ట సవరణ గతంలో ఎందుకు చేయలేదు? ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారు? కాంగ్రెస్ పార్టీలో కపిల్ సిబల్ వంటి అనేక న్యాయ నిపుణులు ఉన్నారు. వారిని ఎందుకు సంప్రదించలేదు? లేదా న్యాయపరమైన ప్రక్రియ కోసం న్యాయనిపుణుల సలహాలను ఎందుకు తీసులేదు?
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చేసింది బీసీ డిక్లరేషన్ కాదు.. బీసీలకు ద్రోహం. కాంగ్రెస్ పార్టీ నిజంగా చట్టబద్ధతను పాటించాలనుకునేవాళ్లైతే, ఎందుకు 22 నెలలు ఆలస్యం చేసింది? నిజం చెప్పాలంటే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే, 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి, ఆనాడే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాస్ చేయించి, గవర్నర్ గారి వద్దకు పంపి ఉండాలి. అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు వచ్చినప్పుడు, బిజెపి పూర్తి మద్దతు తెలిపింది. కానీ, మొన్నటివరకు కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు బిజెపి అడ్డుపడింది, కేంద్రం అడ్డుపడింది అని తప్పుడు ప్రచారం చేశారు. న్యాయ సలహాల్లోనూ, చట్టబద్ధత కల్పించడంలో ఎక్కడా అడ్డుపడింది లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం చట్టబద్ధత లేకుండా, కేంద్రం, బిజెపిపై నింద వేయడం తప్పు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెంది బిజెపిపై నెపం నెట్టడం దారుణం. అబద్ధపు వాగ్ధానాలు, మోసపూరిత చర్యలతో, తెలంగాణ ప్రజలు, బీసీలను మోసం చేస్తోందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం, శాస్త్రీయ పద్ధతిలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే దాకా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసి ఏడాదిన్నర గడిచింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడం దారుణం.
దీని ఫలితంగా, తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో, 73వ మరియు 74వ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ. 1,600 కోట్లు ఆగిపోయాయి, మొత్తంగా సుమారు రూ.3,000 కోట్ల కేంద్ర నిధులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.