– ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో భారం
– విద్యుత్ ఛార్జీలను పెంచితే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు
– విద్యుత్ ను మేము కేవలం వ్యాపార వస్తువుగా చూడలేదు
– రైతులకు ఉచిత విద్యుత్ అందించాం
– కేన్స్ సహా కొన్ని పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి
– అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతామంటే అంగీకరించవద్దని ఈఆర్సీ ఛైర్మన్ ను కోరాం
– జీవో 29 అనేది ఓపెన్ కోటాను కూడా రిజర్వ్ చేసేలా ఉంది
– జీవో 29 విషయంలో పిల్లల తరఫున టాప్ లాయర్ ను పెట్టి కొట్టాడుతాం
– రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడు
– తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపనున్నట్లు మాకు సమాచారం అందింది. విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ 9 ప్రతిపాదనలు ఏవైతే డిస్కంలు చేశాయో వాటిని విరమించుకోవాలని ఎలక్ట్రిసిటి రెగ్యులేషన్ కమిటీ ఛైర్మన్ ని కలిసి కోరాం. ఇళ్లలో వాడుకునే కరెంట్ కు సంబంధించి నెలకు రూ. 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు, 10 రూపాయల నుంచి ఏకంగా రూ. 50 పెంచాలని ప్రతిపాదన చేశారు.
ఇది అతి ప్రమాదకరమైన ప్రతిపాదన. ఈ ఒక్క నిర్ణయం మొత్తం ప్రజల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి నెడుతుంది. సామాన్యుల గృహాలకు సంబంధించి బలంగా, భారీగా విద్యుత్ బిల్లుల భారం పడుతుంది. పరిశ్రమల అన్నింటినీ ఒకే కేటగిరీ అనే ప్రతిపాదన చేస్తున్నారు. ఇది చాలా అసంబద్ధమైన, సిల్లీ ఆలోచన. పరిశ్రమలకు తీవ్ర అన్యాయం చేసే నిర్ణయం. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పిచ్చి ఆలోచన చేస్తున్నారు.
పరిశ్రమలన్నింటికీ ఒకే టారిఫ్ చేసే విధంగా చేయటమంటే, అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మందగమనంలో ఉంది. ఫాక్స్ కాన్ సంస్థ కూడా తమ విస్తరణకు సంబంధించి వాళ్లు ఏమీ చెప్పటం లేదు. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రా అంటున్నారు. కానీ మన తెలంగాణ పేరు చెప్పటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేన్స్ సహా కొన్ని పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి.
ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఏమీ చెప్పటం లేదు. విద్యుత్ సరఫరా విషయంలో ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారు.కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా డిస్కం లు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించాయి. ట్రూ అప్ ఛార్జీలు 12 వందల కోట్లు కావాలంటే అప్పుడు కేసీఆర్ మేమే భరిస్తామని ప్రజల మీద ఆ భారం పడనియలేదు.
విద్యుత్ ను మేము కేవలం వ్యాపార వస్తువుగా చూడలేదు. అది సామాన్యుడి జీవితంలో దైనందిక అవసరమని భావించాం. అందుకే మేము రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ను రైతులకు అందించాం. 24 గంటల కరెంట్ ఇచ్చాం. నాయి బ్రహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంట్, దళితులకు ఉచిత కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాం. రాష్ట్రం ఏర్పడిన నాడు 7 వేల మెగావాట్ల సామర్థ్యం ఉంటే దాన్ని 24 వేల మెగావాట్లకు తీసుకెళ్లాం.
విద్యుత్ ఛార్జీలను పెంచితే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుంది., విద్యుత్ ఛార్జీల పెంపు అనేది రాష్ట్ర అభివృద్ధి అంశంతో ముడిపడి ఉన్నది. సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ, కాటేదాన్ లో పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చాం. ఈ ప్రతిపాదనలతో వారికి సబ్సిడీ లేకుండా పోతుంది. అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతామంటే అంగీకరించవద్దని ఈఆర్సీ ఛైర్మన్ ను కోరాం. ఈ నెల 23 నాడు పబ్లిక్ హియరింగ్ లో పాల్గొనాలని ఈఆర్సీ ఛైర్మన్ కోరారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ముందే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ 23 న హియరింగ్స్ లో మా వాదనలు వినిపిస్తాం. అశోక్ నగర్ వెళ్లకుండా నన్ను అడ్డుకుంటే…పిల్ల లు తెలంగాణ భవన్ కు వచ్చి కలిశారు. వారు కోరటంతో మేమే కపిల్ సిబాల్ లాంటి లాయర్ ను పెట్టి సుప్రీంకోర్టులో కేసు వేశాం. శుక్రవారమే విచారణ జరుగుతుందని భావించాం. కానీ సోమవారం విచారణకు తీసుకున్నారు.
సుప్రీంకోర్టు మేము లేవనెత్తిన ఏ అంశాన్ని వ్యతిరేకించలేదు. జీవో 29 పై తీర్పు వచ్చే వరకు రిజల్ట్స్ ఇవ్వవద్దని తెలిపింది. అదే విధంగా పిటిషన్ ను వేగంగా విచారణ జరపాలని కోరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్ల్యూసీ రిజర్వేషన్లకు అనుగుణంగా మేము జీవో నంబర్ 55 ను తీసుకొచ్చాం. ఓపెన్ కోటాలో కూడా మెరిట్ ప్రకారం అందరికీ అవకాశం కల్పించాం.
జీవో 29 అనేది ఓపెన్ కోటాను కూడా రిజర్వ్ చేసేలా ఉంది. ఫిబ్రవరి నుంచే మేము ఇది అన్యాయమైన జీవో అని చెబుతూనే ఉన్నాం.
మా పార్టీ నాయకులు హరీష్ రావు, దాసోజు శ్రవణ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లు దీనిపై వ్యతిరేకంగా మాట్లాడారు. గ్రూప్ వన్ కు మెయిన్స్ పరీక్ష రాసే పిల్లలకు ప్రశాంతమైన వాతావారణం లేకుండా చేశారు. ఈ ప్రభుత్వం వాళ్లను బతకనివ్వకుండా ఎగ్జామ్ కు వారం రోజుల ముందు ఇబ్బందులు పెట్టింది. కోర్టు కేసు తేలేదాక మేము విద్యార్థులకు అండగా ఉంటాం. ఆ విద్యార్థులు అడిగింది ఏముంది? వాళ్ల డిమాండ్లను ఎందుకు పరిష్కరించలేదు?
జీవో నంబర్ 29 రాజ్యాంగ విరుద్దమని చెప్పటం తప్పా? లోకల్స్ కు 95 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ తెచ్చారు. కానీ దాంట్లో నాన్ లోకల్స్ వచ్చేలా కుట్రలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెబితే ఎట్ల అని ప్రశ్నిస్తున్నారు. ఈ అన్ని అంశాలు తేలే వరకు ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయమంటే ప్రభుత్వానికి ఎందుకంత ఈగో?
రేవంత్ రెడ్డి తన చర్య ద్వారా బలహీన వర్గాల పై ఉన్న వ్యతిరేకతను చాటుకున్నారు. జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల ను పెద్ద తీసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణేతరులకు కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించే కుట్ర చేస్తోంది.ఎగ్జామ్ విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా, మొండిగా పోయింది.జీవో 29 విషయంలో పిల్లల తరఫున టాప్ లాయర్ ను పెట్టి కొట్టాడుతాం.
మా మీద తప్పుడు ప్రచారం చేసి ఆ పిల్లలను నమ్మించి వారి వల్లనే మీరు గద్దెనెక్కారు. జీవో 29 మాత్రమే కాదు… జీవో 48 విద్యార్థులు, గ్రూప్ 4 ఉద్యోగులు కూడా అండగా ఉండాలని కోరారు. వారి కోసం కూడా మేము కోర్టులో పోరాడుతాం. ప్రభుత్వమన్నప్పుడు బేషజాలకు పోవద్దు, కిరీటం పడిపోయిందని భావించవద్దు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లకు తూట్లు పొడవటమంటే అంతకన్నా దుర్మార్గమైన నిర్ణయం మరొకటి లేదు.
నేను జర్నలిస్ట్ లను అవమానించానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జర్నలిస్ట్ లకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిందే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో యాజమాన్యాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ…జర్నలిస్ట్ లు తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారు. వారంటే బీఆర్ఎస్ కు ఎంతో గౌరవముంది. జర్నలిస్ట్ లను నేను అవమానించాను అని అంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.
మా కళ్ల ముందే మూసీ పేరుతో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ప్రశ్నించ వద్దా? మూసీ విషయంలో మాకన్నా ఎక్కువ పోరాడాల్సిన బాధ్యత మీడియాదే. వానాకాలం రైతు భరోసాకు పైసలు లేవు కానీ మూసీలో రూ. లక్షా 50 వేల కోట్లు పోయటానికి డబ్బులున్నాయా? అటు పైన దామగుండంలో, ఇటు కింద అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కి అనుమతులిచ్చి మూసీని సంపుతావ్. మళ్లీ మూసీ పునరుజ్జీవనం అంటే ఎలా నమ్మేది?
ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే నేను మాట్లాడవద్దా? ముఖ్యమంత్రి సొంతూరులో ఇద్దరు మహిళా జర్నలిస్ట్ లపై దాడి జరిగితే ఎందుకు జర్నలిస్ట్ లు మాట్లాడలేదు. ఉస్మానియాలో ఒక జర్నలిస్ట్ పై, శంకర్ అనే జర్నలిస్ట్ పై దాడి జరిగితే ఎందుకు జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడలేదు?. జర్నలిస్ట్ లు అంటే నాకు గతంలోనూ ఇప్పుడు ఎంతో గౌరవముంది. భవిష్యత్ లోనూ అలాగే ఉంటుంది.
మూసీ లూటీని కవరప్ చేసేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. మూసీ విషయంలో ఎలాంటి లూటీ జరిగిన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రులు కూల్చేస్తారంటూ బండి సంజయ్ బాధపడిపోతాడు. పొంగులేటి ఇంటి మీద రైడ్ జరిగి 20 రోజులైనా ఎవరూ మాట్లాడారు. కర్ణాటకలో మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని సిద్దిరామయ్య అంటాడు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్, బీజేపీ రహస్య స్నేహం కొనసాగుతుంది.
కర్ణాటకలో అంత పెద్ద వాల్మీకి స్కాం తెలంగాణ కాంగ్రెస్ పెద్ద నేతల హస్తం ఉంటే ఇప్పటి వరకు ఎందుక ఒక్క అరెస్ట్ జరగలేదు. అమృత్ స్కాం లో సీఎం బావమరిదికి కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి చేస్తున్నారని నేను కేంద్రమంత్రికి లేఖ రాసిన ఇప్పటికీ స్పందించ లేదు.ఎవరికీ ఎవరు దోస్తులో ప్రజలకు అన్ని తెలుసు. అవసరమైనప్పుడు అన్ని బయటపడుతాయి.
బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్క మత ఘర్షణల సంఘటన కూడా జరగలేదు. ముత్యాలమ్మ గుడి సంఘటనపై నేను ఖండిస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని నా మీద సైబర్ క్రైమ్ వాళ్లు ట్విట్టర్ కు ఫిర్యాదు చేశారు. మత ఘర్షణ ల సంఘటన పై కూడా మేము ఖండన చెప్పవద్దా? ఈ ముఖ్యమంత్రికి చేతనైతే శాంతి భద్రతలను కాపాడాలి. కానీ మా సోషల్ మీడియాను ఏదో చేయాలని ప్రయత్నించటం అరాచకం.
బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటు. మేము లక్షా 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? వాళ్లకు మీ ప్రభుత్వ జీతాలు ఇస్తున్నది నిజం కాదా? ముఖ్యమంత్రికి ఇన్ని అబద్దాలు మాట్లాడేందుకు సిగ్గు కూడా లేదా? కాంగ్రెస్ వచ్చాక 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకొని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు.
60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలు ఎప్పుడూ నిర్వహించారో చెప్పాలి. గతేడాది అక్టోబర్ లో అశోక్ నగర్ కు వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి విద్యార్థులకు నమ్మబలికారు. దాదాపు ఏడాది పూర్తైంది. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు అశోక్ నగర్ కు రావాలి. విద్యార్థులు వాళ్లకు సన్మానం చేస్తారు. గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వెళితే సెక్యూరిటీ ఇచ్చి మేము పంపించాం. కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు.
ప్రజాపాలన అంటూనే అరెస్ట్ చేస్తున్నారు. వాళ్లకు మా పాలనకు అది తేడా. పోలీసు అమరులకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు