Suryaa.co.in

Telangana

రేవంత్‌ కు పరామర్శించే తీరిక లేదా?

– లా అండ్ ఆర్డర్ బాగుందన్న కాంగ్రెస్ నేతలకు ఇది చెంపపెట్టు
– రేవంత్ రెడ్డికి ఈ వలసలు కనిపించడం లేదా?
– సుల్తానాబాద్ లో కూడా గంజాయి దొరుకుతుంది
– సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు

రెండ్రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో దారుణ ఘటన జరిగింది. జూన్ 13న ఆరేళ్ళ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. సభ్య సమాజానికి తల వంపులు తెచ్చేలా ఈ ఘటన ఉంది. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి గంజాయి మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. సీసీ టీవీలో అమ్మాయిని ఎత్తుకెళ్లిన వీడియో రికార్డు అయ్యింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంది అంటున్న కాంగ్రెస్ నేతలకు ఇది చెంపపెట్టు.

పోక్సో చట్టం కింద కేసు పెట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ, ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. పది రోజుల క్రితమే నిందితుడు కాట్నపల్లిలోని రైస్ మిల్లులో చేరినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లుల్లో లేబర్ రికార్డులు కూడా మెయింటైన్ చేయని పరిస్థితి ఉంది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి కి వలస జీవుల గురించి బాగా తెలుసు. మా కాగజ్ నగర్ నియోజకవర్గం నుండి , 15 రోజుల క్రితం వలస వెళ్లిన కుటుంబానికి చెందిన చిన్నారిపై ఈ ఘటన జరిగింది. అదే రోజు మంచిర్యాలలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. వాళ్లు కూడా మా కాగజ్ నగర్ నియోజకవర్గానికి చెందినవారే. వలసలు తగ్గాయని చెబుతున్నసీఎం రేవంత్ రెడ్డి కి ఈ వలసలు కనిపించడం లేదా? రాష్ట్రంలో 8 నెలలుగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇంటి తగాదాల వల్ల రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రిని నియమించడం లేదు. కేబినెట్ విస్తరణ చేపట్టి మంత్రిని నియమించే పరిస్థితి లేదు. హోంమంత్రిని నియమిస్తే జరుగుతున్న ఘటనలపైన కనీసం చర్యలు అయినా తీసుకునేవారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీకి డబ్బులు పంపించే పనిలో ఉన్నారు. మంత్రులు వాళ్ళ సంపాదనలో వాళ్ళున్నారు.

రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట మర్దర్లు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిపై కనీసం రివ్యూ చేసే సమయం కూడా సీఎం రేవంత్ రెడ్డి కి లేదు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లో కూడా గంజాయి దొరుకుతుంది. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చింది?

రాష్ట్రంలో ఉపాధి దొరికే పరిస్థితి లేకపోవడంతోనే వలస వెళ్తున్నారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మంత్రులను పంపి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. నిందితునికి కఠిన శిక్ష వేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి ఇల్లు, రూ.20 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లకు జీతాలు కూడా లేవు. పంచాయతీ రాజ్, రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖలో కూడా బిల్లులు చెల్లించడం లేదు. మున్సిపాలిటీలకు 8 నెలలుగా ఒక్క రూపాయి రాలేదు. నాలాల సమస్యలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ అన్ని అంశాలపై త్వరలో ప్రారంభమయ్యే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం.

సమస్యలు పరిష్కరించలేదని రాష్ట్ర ప్రభుత్వం చెంపలేసుకుని తప్పును ఒప్పుకోవాలి. ప్రధానమైన శాఖలకే మంత్రులు లేకపోవడం చాలా బాధాకరం. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE