బనకచర్లను వ్యతిరేకించి తీరాలి
– చంద్రబాబుకు వంతపాడుతున్న రేవంత్
– కాళేశ్వరం ను రికార్డ్ లో నుంచి మాయం చేయాలనే కుట్ర
– దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెస్తామనేది మోసం
– గోదావరిపై ఇంకో ట్రిబ్యునల్ వచ్చిన తర్వాతనే ఏపీ ప్రాజెక్టులకు అనుమతించాలి
– సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట: నిన్న రేవంత్ మాట్లాడిన తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపే. గోదావరి లో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే కేవలం బనకచర్లకు మద్దతు ప్రకటించడమే. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సింది. ఇది చెప్పలేదు అంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుంది.
బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు ఉంది.ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు మోసం చేయడానికే. వాస్తవంగా గోదావరిలో మిగులు నీళ్లు లేవు. పక్క రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టులకు నిరాకరించాలి. కానీ రేవంత్ మాత్రం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ని ఇక్కడ వినిపించారు.
బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరం ను రికార్డ్ లో నుంచి మాయం చేయాలనే కుట్ర. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం పై ఉన్న నంది మేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్ లను ప్రారంభించినారంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లే. కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే, ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలి.
ఇక్కడి మంత్రి ఉత్తమ్ దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారు. దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎస్సారెస్పీ 40 ఏళ్లు గడిచిన మొత్తం ఆయకట్టుకు ఇప్పటివరకు నీళ్లు ఇవ్వలేదు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెస్తామనేది ఒక మోసం.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంపు హౌస్‌ను ప్రారంభించి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్దం అని రుజువైంది. వర్షపు నీళ్లతో రైతాంగం పంటలు వేసుకుంటున్నారు. కొద్ది రోజులైతే నీళ్ళులేక మళ్ళీ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. నంది మేడారం పంపు ఆన్ చేస్తే మిడ్ మానేరుకు నీళ్ళొచ్చినయ్. మిగతా పంపులు ఆన్ చేస్తే సూర్యాపేటకు కూడా నీళ్లు వస్తాయి.
మీరు ప్రారంభించిన పంప్ హౌస్ లన్ని కాళేశ్వరంలో భాగమే. నాలుగేళ్లుగా సూర్యాపేటకు వచ్చింది కాళేశ్వరం జలాలే. ఇప్పుడొచ్చే నీళ్లకు ఏ పేరు పెట్టిన పర్వాలేదు. కానీ ఒక ఎకరం ఎండిపోకుండా నీళ్లు ఇవ్వాలి. చంద్రబాబు తానా అంటే రేవంత్ తందనాలు ఆడుతున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లో బనక చర్లను వ్యతిరేకించి తీరాలి. గోదావరిపై ఇంకో ట్రిబ్యునల్ వచ్చిన తర్వాతనే ఏపీ ప్రాజెక్టులకు అనుమతించాలి. ఎట్టి పరిస్థితిలో ఇప్పుడున్న నీళ్ల మీద ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు. గోదారిలో మనకిచ్చిన హక్కుల ప్రకారమే మనం కాళేశ్వరం నీళ్లు వాడుతున్నాం. ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ దాచి పెట్టడం కెసిఆర్ ని విమర్శించడం సరికాదు.
చంద్రబాబుకు వంతపాడుతున్న రేవంత్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుండు. వ్యవసాయ మోటార్లకు బిఆర్ఎస్ ఇచ్చిన పద్ధతుల్లోనే నిరంతరం విద్యుత్ అందించాలి. రైతులకు నాణ్యమైన విద్యుత్ తో పాటు సరిపడా నీళ్లందించాలి.