– సిగాచిలో 8 మంది శవాలు మొత్తం 14 శవాలు ఏమయ్యాయి?
– మిస్సింగ్ అని ఎలా తప్పించుకుంటారు?
– రేవంత్ రెడ్డి మృతదేహాలను నూనె డబ్బాల్లో ప్యాక్ చేసి ఇచ్చిండు
– 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయం
– సిగాచి కంపెనీ ప్రమాద బాధితుల పక్షాన సంగారెడ్డి అడిషన్ కలెక్టర్ ను కలిసి డెడ్ బాడీలు అప్పగించడంలో, పరిహారం అందించడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు
– అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
సంగారెడ్డి: సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నెల మాసికం చేసుకుంటున్నారు. సీఎం వచ్చి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నెల రోజులు అయ్యింది. ఒక్కరికి అందలేదు.
అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి. బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో, మన రాష్ట్రంలో ఇంత దారుణమైన ప్రమాద ఘటన జరగలేదు. 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయం. బాధ్యతారాహిత్యం.
ఎక్స్ గ్రేషియా, డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు అని బాధితులు అడిగితే, ఎస్ ఎల్ బీ సీ ఘటనలో శవాలు కూడా రాలేదు, మీకు బూడిదైనా దొరికింది అని అత్యంత అమానవీయంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.
ఏపీ, బిహార్, జార్ఖండ్, యూపీ నుంచి రావాలంటే, ఉండాలంటే 20, 30 వేలు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. సీఎం కోటి ఇస్తామన్నరు, ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారు అని అడిగితే ఎవరూ చెప్పడం లేదని అంటున్నారు.
చాలా మంది ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. తీవ్రంగా గాయపడ్డవారికి సీఎం పది లక్షలు ఇస్తామని చెబితే, 50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
తీవ్రంగా గాయపడిన వారికి 50లక్షలు ఇచ్చి, నెల నెలా వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చివరకు హైకోర్టులో సైంటిస్ట్ ఫర్ పీపుల్ స్వచ్చంద సంస్థ బాధితులకు పరిహారం ఇవ్వాలని రిట్ పిటిషన్ వేసింది.
నెల గడిచినా ఎంత మంది చనిపోయారు, ఎంత మంది క్షతగాత్రులు అధికారికంగా వెల్లడించలేదు.
చనిపోయిన వారి పేర్లు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, క్షతగాత్రులకు ఎంత ఇచ్చారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతున్నది.
ఇప్పటి వరకు నష్టపరిహారం వివరాలు వెల్లడించకుండా ఎందుకు గోప్యంగా ఉంచారు సమాధానం చెప్పాలి.
చనిపోయిన జగన్మోహన్ కొడుకు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదులో.. సిగాచి కంపెనీలో పాత మిషన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనేక సార్లు కార్మికులు చెప్పినా, కంపెనీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అంటే యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం ఉంది. ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలేదు
ఫిర్యాదులో స్పష్టంగా ఉంది, ఎఫ్ ఐ ఆర్ కూడా అయ్యింది. ఎందుకు యాజమాన్యం కాపాడుతున్నవు రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యంతో కుమ్మక్కు అయ్యావు? కంపెనీతో ఉన్న లాలూచి ఏమిటి? బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
శవాలు ఇవ్వకుండా 8 మంది మిస్సింగ్ అంటూ ఎందుకు వేధిస్తున్నారు? వెంటనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి, ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. మేం అందరం డిమాండ్ చేస్తే తెల్లారి మెల్లగ సీఎం వచ్చి, మీడియా ముందు ఫోజులు కొట్టిండు. కంపెనీని తట్టినట్లు బిల్డప్ ఇచ్చి పోయిండు.
కోటి ఎవరు ఇస్తారు, ప్రభుత్వమా, కంపెనీనా అని మీడియా వారు అడిగితే ఎవరు ఇస్తే ఏందని ఆరోజు సీఎం దబాయించిండు. కంపెనీ కూడా 15 రోజుల్లో పరిహారం ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇప్పటికీ దిక్కులేదు
ఏపీలో 2024, ఆగస్టు 20 నాడు అనకాపల్లిలో ఓ కంపెనీ ప్రమాదం జరిగి 17 మంది మరణిస్తే, కొందరికి గాయాలు అయితే మూడు రోజుల్లో కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడితే 50లక్షలు, తక్కువగా గాయ పడితే 25లక్షలు ఇచ్చారు.
అక్కడ మూడు రోజుల్లో ఇస్తే, ఇక్కడ నెల రోజులు గడిచింది. ఎందుకు ఇవ్వడం లేదు? చెప్పినట్లుగా కోటి రూపాయలు, తీవ్రంగా గాయ పడితే 50, తక్కువగా గాయపడితే 25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.అసలు ఎవరు ఇస్తరు? ఎక్కడ ఇస్తరు? నువ్వు పట్టించుకోవు, కంపెనీ పట్టించుకోదు.
కరోనా సమయంలో వలస కార్మికులను పట్టించుకున్నడు కేసీఆర్
సీఎస్ కు బాధ్యతలు అప్పగించి జార్ఖండ్, యూపీ, బిహార్ వంటి సొంత రాష్ట్రాలకు రైళ్లలో పంపించాడు.
వలస కార్మికులు తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములు అని వారికి ఎంతో గౌరవం ఇచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మృతదేహాలను నూనె డబ్బాల్లో ప్యాక్ చేసి ఇచ్చిండు. ఇది రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ దుర్మార్గ, అమానవీయ చరిత్ర. వలస కార్మికుల డెడ్ బాడీలను అగౌరవపరిచావు. ఇంత దారుణం ఎందుకు రేవంత్ రెడ్డి?
అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందో ఎందుకు బయట పెట్టడం లేదు.
నువ్వు వేసిన కమీటి రిపోర్టు యాడ పోయింది రేవంత్ రెడ్డి? నెల రోజులు గడస్తున్నా, 54 మంది ప్రాణాలు కోల్పోతే ఎందుకు కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ 2, ఏపీ 9, మరో 43 మంది యూపీ, బిహార్, జార్కండ్ తదితర రాష్ట్రాల వారు ఉన్నారు.
ఎవరిదైనా ప్రాణమే.. ఎందుకు ఇంత నిర్లక్ష్యం. చనిపోయిన వారికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 50లక్షలు, తక్కువగా గాయపడితే 25లక్షలు వెంటనే అందించాలి. అందరికి డెత్ సర్టిఫికెట్, పంచనామా కాపీ, ఎఫ్ ఐ ఆర్ కాపీలు ఒక పోల్డర్ లో పెట్టి కుటుంబ సభ్యులకు అందించాలి.
గతంలో ఇలాంటి ప్రమాదమే సంగారెడ్డిలో జరిగితే వారం రోజుల్లో 5లక్షల ఎక్స్ గ్రేషియా, సర్టిఫికెట్లు ఇంటికి వెళ్లి ఇచ్చినం. నెల గడుస్తున్నది తప్ప ఎప్పుడైనా ఈ ఘటన మీద సమీక్ష చేసావా? ఢిల్లీ వెళ్లడం రావడం తప్ప ఏనాడైనా బాధతో ఒక రివ్యూ అయిన చేసావా? ఎస్ ఎల్ బీ సీ ఘటన జరిగి 150 రోజులు అయినా శవాలు బయటికి రావడం లేదు. చనిపోయారో, బతికి ఉన్నారో తెలియదు.
సిగాచిలో జరిగితే 8 మంది శవాలు ఇవ్వలేదు, బొక్కలు ఇవ్వలేదు, బూడిద ఇవ్వలేదు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం. ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో స్పందించడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం. మృత దేహాలు అప్పగించడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం. పరిహారం చెల్లించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోర వైఫల్యం.
సకాలంలో మంచి ఆసుపత్రులకు చేర్చి ఉంటే ఆరు ప్రాణాలు పోయేవి కాదు. ఆసుపత్రిలో చేరాక సరైన వైద్యం అందక ఆరుగురు చనిపోయారు
ఇప్పటికీ 14 మంది ఆసుపత్రిలో ఉంటే, అందులో 5గురు పరిస్థితి విషమంగా ఉంది.
చావు బతుకుల్లో కొట్టు మిట్లాడుతున్నరు. వారికైనా మంచి వైద్యం అందించు
నీ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉంటే ఇట్లనే చూస్తవా. కాపాడుకోవా? ఆ కుటుంబాలకు కూడా 50లక్షల సాయం చేయండి. ఎస్ ఎల్ బీ సీ ఘటన జరిగితే హెలికాప్టర్లు వేసుకొని వెళ్లారు తప్ప డెడ్ బాడీలు తేలేదు. చేపలు మంచిగుంటయ్యని ఓ మంత్రి చేపల పులుసు తిన్నడు.
పెట్టిన డేట్లు మారాయి తప్ప, డెడ్ బాడీలను బయటికి తేలేదు. ఎస్ ఎల్ బీ సీ, సిగాచి ఘనటలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
మాట్లాడితే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైళ్లలో పెడతావు, కేసులు పెడతావు 54 మంది ప్రాణాలు బలితీసుకున్న కంపెనీపై కేసు మాత్రం పెట్టవు.
ఎస్ ఎల్ బీసీ ఘటన జరిగితే సమన్వయం చేయలేదు, సొరంగం భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. ఎస్ ఎల్ బీ సీలో ఆరు శవాలు, సిగాచిలో 8 మంది శవాలు మొత్తం 14 శవాలు ఏమయ్యాయి? మిస్సింగ్ అని ఎలా తప్పించుకుంటారు? బాధితుల గోస వినపడటం లేదా? రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే బిఆర్ఎస్ తరుపున పోరాటం తీవ్రతరం చేస్తాం.
సీఎం ఇలాంటి విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉండటం సరికాదు. ఇప్పటికైనా కళ్ళు తెరువు.