Suryaa.co.in

Editorial

రవంత భరోసా ఇవ్వని రేవంత్‌!

– మునుగోడు ఓటమితో ప్రమాదంలో కాంగ్రెస్‌ మనుగడ
– తెలంగాణ కాంగ్రెస్‌కు దిక్కెవరు?
– రేవంత్‌ సారథ్యంలో రెండు ఎన్నికల్లోనూ ఓటమి
– వ్యక్తిగతంగా పెరుగుతున్న రేవంత్‌ ఇమేజ్‌
– పెరిగిన రేవంత్‌ గ్రాఫ్‌తో సమానంగా పరుగులు తీయని కాంగ్రెస్‌ ఇమేజ్‌
– డీసీసీ చీఫ్‌లు సొంత మనుషులున్నా కాంగ్రెస్‌ వెనుకబాటే
– కాంగ్రెస్‌ స్థానం ఆక్రమిస్తున్న బీజేపీ
– పారని వ్యూహకర్త సునీల్‌ కనుగోలు పాచికలు
– మునుగోడులో సునీల్‌ కృషి సున్నా
– రేవంత్‌కు సీనియర్ల సహకారం శూన్యం
– ఆర్ధికవనరులు లేక పార్టీ అవస్ధలు
– మునుగోడు అభ్యర్ధి స్రవంతికి సాయం చేయని సీనియర్లు
– ప్రచార భాగస్వామ్యమూ అంతంత మాత్రమే
– పార్టీకి భారమవుతున్న సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్‌కు ఒక్క బహుమతి కూడా ఇవ్వలేకపోయారు. ఫలితంగా పాత దళపతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాదిరిగా, సీనియర్లకు లక్ష్యంగా మారారు. రేవంత్‌ పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత హుజురాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్‌ ఒక్కటీ విజయం సాధించలేకపోయింది. అందులో మునుగోడు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీటు కావడం ప్రస్తావనార్హం. హుజూరాబాద్‌, మునుగోడులో కాంగ్రెస్‌ది ముచ్చటగా మూడోస్థానమే. అలా కాంగ్రెస్‌కు రేవంత్‌.. ‘రవంతభరోసా’ కూడా ఇవ్వలేకపోతున్న పరిస్థితి ఆయనకు వ్యక్తిగతంగా సమస్యలు తెచ్చిపెడుతోంది. అటు ఎన్నికల వ్యూహకర్తగా వచ్చిన సునీల్‌ కనుగోలు పాచికలు కూడా పారడం లేదు. ప్రశాంత్‌ కిశోర్‌ స్థాయిలో ఆయనపై కాంగ్రెస్‌ పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. మరో వైపు రేవంత్‌కు సీనియర్ల సహాయ నిరాకరణ. ఇంకోవైపు నేతలు ఆర్ధికంగా బలవంతులే గానీ, పార్టీమాత్రం పేదదయిన దుస్థితి. ఇవీ తెలంగాణ గద్దెపై కన్నేసిన కాంగ్రెస్‌పార్టీ కష్టాలు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ కలలు, నిజమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమిస్తున్న బీజేపీ దూకుడుకు.. తెలంగాణ కాంగ్రెస్‌ చేష్టలుడిగి చూడటమే తప్ప, ఎదుర్కొనే శక్తి కోల్పోతోంది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీటయిన మునుగోడును మళ్లీ దక్కించుకోవడం అటుంచి, కనీసం రెండో స్థానంలో కూడా నిలబడలేని నిస్సహాయ పరిస్థితి. దీనితో కాంగ్రెస్‌ భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత.. సుదీర్ఘకాలం పీసీసీ చీఫ్‌గా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో, కాంగ్రెస్‌ పూర్తిగా తిరోగమనంలో నడిచింది. ఎంపీగా ఉన్న ఆయన.. ఇప్పటికీ రెండు నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తూ, మరొకరి అవకాశాలకు గండికొడుతున్నారన్న విమర్శలెదుర్కొంటున్న పరిస్థితి. ఆ రెండు నియోజకవర్గాల్లో, పార్టీకి సంబంధించి ఏం నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఉత్తమ్‌ అనుమతి తప్పనిసరి అవుతోంది. సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జనాకర్షణ, వాగ్ధాటి, ఎత్తుపైఎత్తులు వేయగల రేవంత్‌ రాకతో.. కాంగ్రెస్‌కు కళ వస్తుందన్న భరోసా ఉండేది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో అది కూడా కష్టమని తేలిపోయింది. కాంగ్రెస్‌కు ధరావతు కూడా దక్కని విషాదానికి, రేవంత్‌ నాయకత్వమే బాధ్యత వహించాలన్న డిమాండ్‌ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పీసీసీ చీఫ్‌గా అభ్యర్ధిని గెలిపించే బాధ్యతను రేవంత్‌ తీసుకోలేదన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

రేవంత్‌ పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత, తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ వచ్చింది. ఒక దశలో రేవంత్‌ దూకుడుకు, టీఆర్‌ఎస్‌ వణికిపోయే పరిస్థితి వచ్చింది. దానితో రేవంత్‌ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహబృందం దృష్టిపెట్టింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దూకుడు పెంచడంతో, రేవంత్‌రెడ్డి తెరవెనక్కి వెళ్లిపోవలసి వచ్చింది. అది క్రమంగా కేసీఆర్‌ వర్సెస్‌ సంజయ్‌ అనే స్థాయికి వెళ్లింది. దానితో సహజంగానే బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్యనే పోటీ అనే భావన నెలకొంది.

రేవంత్‌ నిర్వహించిన బహిరంగసభలకు, లక్షల సంఖ్యలో జనం హాజరవుతున్న పరిస్థితి. తెలంగాణలో కేసీఆర్‌, తర్వాత రేవంత్‌ జనాకర్షణ నేతఅన్నది బహిరంగమే. టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే నాయకుడుrevanth1 అయినప్పటికీ, పార్టీ బలహీనంగా ఉండటం రేవంత్‌కు మైనస్‌ పాయింటన్నది ఆయన అనుచరుల వాదన. సీనియర్లు ఆయనకు సహాయనిరాకరణ చేస్తున్నారని, వారికి ఢిల్లీ ఆశీస్సులు ఉండటంతో, రేవంత్‌ తన పని తాను చేసుకోవలసి వస్తోందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

అయితే, రేవంత్‌ జనాకర్షణ.. ఆయన ఇమేజ్‌ పెరగడానికి అక్కరకొస్తుందే తప్ప, పార్టీకి పనికిరావడం లేదన్నది కాంగ్రెస్‌ సీనియర్ల వాదన. టీడీపీలో ఉన్నప్పుడు కూడా, రేవంత్‌రెడ్డి అదే పనిచేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ బ్రాండ్‌ను పెంచకుండా.. రేవంత్‌ తన సొంత ఇమేజ్‌ పెంచుకుంటున్నారని ఇప్పటికే చాలామంది సీనియర్లు, ఢిల్లీ పెద్దలకి ఫిర్యాదు చేశారు. సొంతంగా సోషల్‌మీడియా టీములు పెట్టుకోవడం, సొంత ప్రచారం చేసుకోవడం తప్ప.. పార్టీ విస్తరణకు రేవంత్‌ చేస్తున్నదేమీ లేదన్నది, ఆయనపై ఉన్న మరో ప్రధాన విమర్శ.

మునుగోడు అభ్యర్ధి స్రవంతికి రేవంత్‌ సహా, ఏ ఒక్క సీనియర్‌ నాయకుడూ ఆర్ధిక సాయం చేయలేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అన్నీ అనుభవించిన అగ్రనేతలు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే, ఇక వారివల్ల ఉపయోగమేమిటన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మునుగోడు బాధ్యత తీసుకోవలసి ఉందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్‌ఎస్‌ను అన్ని రంగాల్లో ఢీకొంటున్న బీజేపీ ఉనికి, కాంగ్రెస్‌ మనుగడను దెబ్బతీస్తుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మునుగోడుతో, కాంగ్రెస్‌ మనుగడ దెబ్బతిందన్న భావన పార్టీkcr-bandi-sanjay-and-revanth-reddy వర్గాల్లో నెలకొంది. తాజా ఉప ఎన్నిక ఫలితంతో.. టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్న భావన, ప్రజల్లో నెలకొందని కాంగ్రెస్‌ నేతలు గుర్తించారు. బీజేపీకి రాష్ట్రం మొత్తం మీద ఆ శక్తి ఉందా? లేదా? అన్నది పక్కనపెడితే… ‘ప్రత్యామ్నాయ భావన’ కిందిస్థాయికి వెళితే, కాంగ్రెస్‌ కోలుకోవడం కష్టమని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

ప్రధానంగా.. సీనియర్లు పార్టీకి పెను భారంగా మారుతున్నారన్న ఆందోళన, పార్టీ యూత్‌లో నెలకొంది. దశాబ్దాల నుంచి నియోజకవర్గాలను పట్టుకుని వేళ్లాడుతున్న సీనియర్లను.. తప్పించే సాహసం చేయలేకపోతున్నారన్న చర్చ, పార్టీ వర్గాల్లో చాలాకాలం నుంచీ జరుగుతోంది. ఎన్నిసార్లు ఓడినా, మళ్లీ వారికే ఇన్చార్జి బాధ్యతలు, టికెట్లు ఇస్తున్న విధానంతో యువకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అటు రాజకీయ విశ్లేషకులూ చెబుతున్నారు. వృద్ధులను తప్పించకపోతే, పార్టీ పరుగు కూడా వారి మాదిరిగానే ఉంటుందని యువనేతలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ వెదజల్లే డబ్బుల ముందు, తమ పార్టీ వెలవెలపోతోందని కాంగ్రెస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌-బీజేపీ ధాటిని తట్టుకునేందుకు.. ఇప్పటినుంచే సిద్ధం కాకపోతే, పార్టీ చతికిలపడటం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అన్న భావన తొలగించకపోతే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీటు అడిగేవారు కూడా ఉండరన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

LEAVE A RESPONSE