– 3 వేల కోట్ల విలువైన ఈ భూమిని అనుయాయులకు కట్టబెట్టే కుట్ర
– దళారుల దందా కోసం కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మేస్తారా?
– రైతులు ముఖ్యమా ? వ్యాపారులు ముఖ్యమా?
– కోహెడ పండ్ల మార్కెట్ సందర్శనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
– మార్కెట్ నిర్మాణానికి స్థలంతో పాటు రూ. 350 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు?
– కోర్టు వివాదాల్లో ఉన్న ‘దిల్’ భూములను రైతుల మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఎలా ఇస్తారు?
– కమీషన్ల కోసం వేలాది మంది రైతుల భూమిని TGIIC కి అప్పగించి తమ వాళ్లకు కట్టబెడతారా రేవంత్ రెడ్డి?
– కోహెడలోనే ఫ్రూట్ మార్కెట్ పనులు ప్రారంభించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాడుతాం.
– కోహెడ పండ్ల మార్కెట్‌ను సందర్శించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
కోహెడ: ఈరోజు ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదు రైతుల కోసం వచ్చాను.ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీదో కాంగ్రెస్ పార్టీదో కాదు రైతుల సమస్య ఇది..ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పనిచేయాలని దళారుల కోసం కాదు.
నేను ఈ వేదిక నుండి సీఎం రేవంత్ రెడ్డిని, వ్యవసాయ శాఖ మంత్రికి కోరుతున్నా.. లక్షలాది మంది రైతుల కోసం ఆలోచించండి తప్ప నలుగురు ఐదుగురు దళారుల కోసం కాదు. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ తగ్గించడానికి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక్కడ 200 ఎకరాల్లో ఈ మార్కెట్ ను నిర్మించాలని ఆనాడు కెసిఆర్ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నపుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాతో కొట్లాడి, రూ.10 కోట్లను ఫ్రూట్ మార్కెట్ కోసం చేసిన భూసేకరణలో భాగంగా ఇక్కడ రైతులకి ఇప్పించారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలనుకున్నాము.2020 సంవత్సరంలో జీవో 11 ద్వారా ఈ మార్కెట్ ను నోటిఫై చేశాం.
జీవో 216 ప్రకారం రూ.350 కోట్ల డబ్బులను మార్కెట్ కోసం బ్యాంక్ అకౌంట్లో ఉంచాము..ఎలా కట్టాలని ప్లాన్ కూడా చేసాము. రూ.1,000 కోట్లతో డీపీఆర్ తయారు చేసాము. ఫ్యూచర్ లో ఇక్కడే ఫ్లవర్ మార్కెట్ రావాలి. ఫిష్ మార్కెట్ రావాలని తీర్చిదిద్దాం.100 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ కు రూపకల్పన చేశాం.
డబ్బులు రెడీ, భూమి రెడీ అంతా రెడీగా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పని ముందుకు తీసుకపోగా ఈ భూమిని అమ్మాలని చూస్తున్నది. ఈ భూమి దాదాపు 3 వేల కోట్ల విలువ ఉంది. ఈ భూమిని TGIIC కి ఇచ్చి తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నది. రోజు 25 30 వేల రైతులకు ఉపయోగపడే వారి భవిష్యత్తు ముఖ్యమా ? నలుగురు ఐదుగురు వ్యాపారులు, దళారులు ముఖ్యమా ? రైతులు ముఖ్యమా ? వ్యాపారులు ముఖ్యమా?
ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తాం అంటున్నారు. ఆ దిల్ భూముల జోలికి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉంది. ఎస్సీ రైతులు పంట పండిస్తున్నారు. అలాంటి భూమి ప్రత్యామ్నాయంగా ఇస్తామంటే ఎలా నమ్మాలి ? రేవంత్ రెడ్డికి భూముల మీద కన్ను పడింది..ఎక్కడ భూములు ఉన్నా వాటిని అమ్మేయడమే పనిగా పెట్టుకున్నాడు.
రేవంత్ రెడ్డి నువ్వు రైతుల పక్షాన ఉంటావా ? దళారుల పక్షాన ఉంటావా ? నీ కమీషన్ల కోస రైతుల భూములు కూడా వదిలిపెట్టవా రేవంత్ రెడ్డి ? కబ్జాలకు కాదేదీ అనర్హం అన్నట్లు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ మార్కెట్ భూములపై కన్ను పడింది. కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం ఉన్న మార్కెట్ భూమిని అమ్మేస్తావా ?
ఈ మార్కెట్ ను ఆపే కుట్ర జరుగుతున్నది.అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ మార్కెట్ వచ్చేదాకా బీఆర్ఎస్ కోట్లాడుతది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి ఎకరాల భూమిని నిషేధిత భూముల్లో చేర్చారు.బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నా.. నిషేధిత భూముల్లో రైతుల భూములు చేర్చి రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాం.
నేను వ్యవసాయ శాఖ మంత్రి కోరుతున్న. స్వయంగా మీరు రైతు కాబట్టి ప్రభుత్వంతో కొట్లాడి ఇక్కడే మార్కెట్ నిర్మించాలి. ఇక్కడ మార్కెట్ నిర్మించకపోతే ఎంత దూరమైనా పోరాడుతాం. రైతుల పక్షాన కొట్లాడుతాం.
ఈ కార్యక్రమంలో హరీష్ రావు తోపాటు పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.