హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27 వ వర్థంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళ్లు అర్పించారు. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ వరకు అన్ని పదవులకు వన్నె తెచ్చిన నేత అని ఆయన కొనియాడారు. శాసనసభ ఔనత్యాన్ని పెంపొందిస్తు హుందాగా ఆయన సభను నడిపిన తీరు శ్లాఘనీయమని ముఖ్యమంత్రి అన్నారు. దుద్దిళ్ల శ్రీపాదరావు జీవితం నేటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఎంపీ వేం నరేందర్ రెడ్డి,ఎంఎల్ ఏ సంజయ్ పాల్గొన్నారు.