Suryaa.co.in

Telangana

బిడ్డా రేవంత్ రెడ్డి… మీకు సంక్రాంతి డెడ్ లైన్

– అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ సర్కార్ బందీ
– భాగ్యనగర్ ను మరో బంగ్లాదేశ్ గా మార్చే కుట్ర
– రేవంత్ ను జనం సీఎంగా గుర్తించడం లేదు
– ఏ సర్వేలో చూసినా కాంగ్రెస్ ది మూడో స్థానమే….
– కాంగ్రెస్ సర్కార్ కు సంక్రాంతి వరకు డెడ్ లైన్…
– ఆలోపు 6 గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామాల్లో తిరగనీయం
– 25 వేల పోస్టులకే నోటిఫికేషన్లకు ఇచ్చారు…మరి 55 వేల పోస్టులు ఎట్లా భర్తీ చేసినట్లు?
– ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కాషాయ జెండాదే
– 6 గ్యారంటీలపై పాదయాత్రకు సిద్ధమా?
– తెలంగాణలో జరిగే అభివృద్ధి పనులన్నింటికీ నిధులిచ్చేది కేంద్రమే….
– కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యంపై బీజేపీ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
– కాంగ్రెస్, బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బీజేపీ ఫైర్ బ్రాండ్

హైదరాబాద్: అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ రెడ్డి సర్కార్ బందీగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో మాదిరిగా భాగ్యనగర్ లోనూ హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇట్లానే ఉంటే భాగ్యనగర్ మరో బంగ్లాదేశ్ గా మార్చే కుట్రలకు తెరదీశారని అన్నారు.

‘భాగ్యనగర్ ప్రజలారా… స్వామి వివేకానంద, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, కొమరం భీం, సేవాలాల్ మహారాజ్ లా మారతారా? లేక నక్సలైట్లుగా మారతారా? ఆలోచించండి’’అని కోరారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాష, ఆడుతున్న అబద్దాలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలెవరూ ఆయనను సీఎంగా గుర్తించడం లేదన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కూ మూడో స్థానం తథ్యమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలపై ఈరోజు బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ‘బహిరంగ సభ’కు విచ్చేసిన బండి సంజయ్ ఈ సందర్బంగా కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఏమన్నారంటే…

బీజేపీ చల్లబడిందని ప్రచారం చేసే వాళ్ల చెంప చెళ్లుమన్పించండి. బీఆర్ఎస్ తూట్ పాలిష్ నాయకుల లెక్క బీజేపీ కార్యకర్తలుండరు. బీఆర్ఎస్ కార్యకర్తలు, క్యాడర్ బయటకు రావడం లేదు. బీజేపీ కార్యకర్తలు ఫైర్ బ్రాండ్స్..

ఇగ కాంగ్రెస్ సంగతి చెప్పనక్కర్లేదు. రేవంత్ రెడ్డి ఎన్నడైనా ప్రజా సమస్యలపై పోరాడిండా? రైతుల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడిండా? వాళ్ల కోసం ఎన్నడైనా జైళ్లకు పోయిండా? మహా అంటే ఓటుకు నోటు కేసు తప్ప ఆయనపై ఉన్న కేసులేంది? కానీ బీజేపీ కార్యకర్తలు ఏనాడూ కాషాయ జెండా వీడలేదు. పోరాటాలను ఆపలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో వికసించేది కమలమే. ఒక సెక్షన్ మీడియా, టీవీ ఛానళ్లు రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నాయని, ఏదో సొంత డబ్బా కొంటుకున్నరు. ఏ సర్వే చూసినా కాంగ్రెస్ ది మూడవ స్థానమే.

రేవంత్ రెడ్డి భాష, నడవడిక చూసి జనం నవ్వుకుంటున్నారు. సీఎంగా గుర్తించడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలే. ఏమైనా అంటే ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ అని కోతలు పెట్టడం తప్ప ఆయన సాధించిందేమిటి? ఈ వేదిక సాక్షిగా మేం అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి.

ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేయనిది నిజమా? కాదా? వ్యవసాయ మంత్రే ఇది నిజమని ఒప్పుకున్నది వాస్తవం కాదా? రైతులకు ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఎగ్గొట్టింది నిజం కాదా? తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొంటామని మాట తప్పింది నిజం కాదా? బోనస్ పేరుతో రైతులను వంచించింది మీరు కాదా?

మహిళలకు తులం బంగారం, స్కూటీ ఇస్తామన్నరు. కోడలకు రూ.2500లు, అత్తామామలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నరు. ఎంతమందికి ఇచ్చారో చెప్పే దమ్ముందా? యూత్ డిక్లరేషన్ పేరుతో 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలో భర్తీ చేస్తామన్నరు. రేవంత్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలాడుతున్నరు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి సాక్షాత్తు 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం… 12 వేలు మాత్రమే భర్తీ చేస్తామన్నడు.

అవిగాక డీఎస్సీ పేరుతో మరో 10 వేల ఉద్యోగాలను భర్గీ చేశారు. మహా అంటే 25 వేలకు మించి ఉద్యోగాలను భర్తీ చేయని మీరు… 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఎట్లా చెప్పుకుంటారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ.4వేల భ్రుతి ఇస్తానన్నడు. ఏడాది కాలంగా ఒక్కో నిరుద్యోగ తమ్ముడికి రూ.48 వేల బాకీ పడ్డడు.

కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు… ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నరు. 6,500 మంది పార్ట్ టైం లెక్చరర్లను నిర్ధాక్షిణ్యంగా తొలగించిన దుర్మార్గుడు. రేవంత్ మూర్ఖత్వంవల్ల నిరుద్యోగుల బతుకులు సర్వనాశనమైనయ్. కోచింగ్ తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇగ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. రూ.7 వేల కోట్ల ఫీజు బకాయిలు పెట్టిండు. ప్రభుత్వ పాఠశాలల్లో చాక్ పీసులు కొనే పరిస్థితి లేదు.

కనీస సౌకర్యాల్లేక మూత పడుతున్నాయి. గురుకులాల్లో పురుగుల అన్నం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. ఉద్యోగులకు 4 డీఏలివ్వకుండా మోసం చేసిండు. 317 జీవోను సవరించకుండా ఉద్యోగులను చెట్టుకొకరు పుట్టకొకరుగా మారారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీంను అమలు చేయలేదు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదు.

అన్ని కులాలను వంచిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ దే. ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తానని మోసం చేసిండు. ఒక్కో తండాకు ఏటా రూ.25 లక్షలిస్తానని మాట తప్పిండు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఏటా బీసీ బడ్జెట్ ను రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తానని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కూడా అమలు చేయలేదు. మాజీ సర్పంచులను అరిగోస పెడుతున్నరు. పెండింగ్ బిల్లులివ్వకుండా రోడ్డున పడేసింది వాస్తవం కాదా? మాజీ సర్పంచుల బతుకులను నాశనం చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే…

త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నయ్… ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించడం తథ్యం. భాగ్యనగర్ ప్రజాలారా.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిపై దాడిని, చాంద్రాయణగుట్ట రక్షాపురం అమ్మవారి ఆలయంపై, శంషాబాద్ లోని నవగ్రహాలపై జరిగిన దాడిని ప్రజలు మర్చిపోరు. పోయిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 సీట్లు ఇచ్చారు. ఈసారి మేయర్ పీఠం బీజేపీదే.

హైదరాబాద్ ఒవైసీ జాగీరనుకుంటున్నరా? ఒక వర్గానికి కొమ్ముకాస్తుంటే చూస్తూ ఊరుకుందామా? బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేస్తున్నరు. అట్లాగే భాగ్యనగర్ లో హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భాగ్యనగర్ ను బంగ్లాదేశ్ గా మార్చే కుట్ర జరుగుతోంది. ఆ కుట్రలను తిప్పికొడదాం.

బిడ్డా రేవంత్ రెడ్డి… మీకు సంక్రాంతి డెడ్ లైన్. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని గల్లీలో తిరగనీయం. రైతులతోసహా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత నీదే. మోదీ తెలంగాణకు ఏం నిధులిచ్చిండని ఎదురుదాడి చేస్తున్నడు. మోదీ పైసలన్నీ మూట కట్టుకుని వచ్చి ఇస్తడా? తెలంగాణలో జరిగే ప్రతి అభివ్రుద్ధి పనులకు నిధులిస్తోంది కేంద్రం కాదా? గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ప్రతి అభివ్రుద్ధి పనులకు నిధులిస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వం కాదా? మున్సిపాలిటీ అభివ్రుద్ధి పనులకు నిధులిస్తోంది కేంద్రం కాదా? చివరకు రేషన్ బియ్యం, వడ్ల కొనుగోలు పైసలన్నీ మోదీ ప్రభుత్వం ఇస్తోంది నిజం కాదా? అయినా ప్రధాని ఫోటో పెట్టకుండా ఇందిరమ్మ, సోనియమ్మ పేరుతో రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నడు.

ఏడాదిలో పేదలందరికీ ఇండ్లు కట్టిస్తానన్నడు. ఒక్క ఇల్లు అయినా కట్టించారా? నరేంద్రమోదీ ప్రభుత్వం లక్షల ఇండ్లు మంజూరు చేస్తే ఆ నిధులను ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ దారి మళ్లిస్తే…ఈనాడు ముగ్గు పోసి ఇల్లు కట్టకుండా మోసం చేస్తున్న ఘనత కాంగ్రెస్ దే. రాష్ట్రంలో నిర్మించే ఇండ్లకు నిధులిస్తున్నది నరేంద్రమోదీ ప్రభుత్వం అనే విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి.

అర్బన్ నక్సల్స్ చేతిలో కీలుబొమ్ముగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బందీగా మారింది. మంత్రివర్గంలో మాజీ నక్సల్స్ ఉన్నరు. విద్యా కమిషన్ లో నక్సల్ భావ జాలమున్నవాళ్లను నియమించండి. రాబోయే రోజుల్లో తెలంగాణ యువతను నక్సల్స్ గా మార్చే కుట్ర చేస్తున్నారు… తెలంగాణ ప్రజాలారా…. స్వామి వివేకానందగా, అంబేద్కర్ గా, మహాత్మాజ్యోతిరావు పూలే, కొమరం బీం కావాలనుకుంటున్నారా?… నక్సల్స్ గా మారాలనుకుంటున్నారా? ఆలోచించండి.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. ఇద్దరూ కుమ్మక్కయ్యారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగితే కాంప్రమైజ్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే అరెస్టుల్లేవు? ఈ ఫార్ములా కార్ల రేసులో స్కాం జరిగితే చర్యల్లేవు. గొర్రెల, బర్రెల స్కాం జరిగితే చర్యల్లేవు. రాష్ట్రంలో ఆర్కే పాలన కొనసాగుతోంది(రేవంత్ రెడ్డి, కేసీఆర్). ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ, వ్యాపార లావాదేవీలు నడుస్తున్నాయి.

ఆ లావాదేవీలను బయట పెట్టేందుకు మేం సిద్ధం. ఈ రెండు పార్టీల కుమ్కక్కు రాజకీయాలు తెలిసే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు. 8 ఎంపీ సీట్లు గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి సంక్రాంతి వరకు డెడ్ లైన్. ఆ తరువాత హామీలను అమలు చేసేదాకా గ్రామాల్లో తిరగనీయం. కాంగ్రెస్ ఎన్ని హామీలను నెరవేర్చిందో బహిరంగ చర్చకు, పాదయాత్రకు సిద్దమా?

LEAVE A RESPONSE