– చంద్రబాబు రూ. 4000 ఇస్తున్నారు.. ఇక్కడ రేవంత్ రెడ్డికి చేతులు రావడం లేదు
– అక్కాచెల్లెళ్లకు రూ. 60,000 బాకీ పడ్డ కాంగ్రెస్ సర్కార్.
– ఐదు పంటల్లో మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టిన ఘనుడు రేవంత్.
-దేవుడి మీద ఒట్టు వేసి రైతులను మోసం చేసిన పాపాత్ముడు.
– జిన్నారం ప్రజలపై పన్నుల భారం మోపడానికే మున్సిపాలిటీ చేశారు
– మాజీ మంత్రి హరీష్ రావు
జిన్నారం: పటాన్చెరువు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపాలిటీలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు పర్యటించారు. జిన్నారం గ్రామ వాకిటి వద్ద స్థానికులతో ముచ్చటించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగట్టారు.
మేము అధికారంలో ఉన్నప్పుడు జిన్నారం గ్రామ పంచాయతీగానే ఉండాలని కోరుకున్నాం. మున్సిపాలిటీ అయితే ప్రజల మీద పన్నుల భారం పడుతుందని ఆపాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జిన్నారంను మున్సిపాలిటీ చేసి మీ మీద పన్నుల భారం మోపింది. ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం? మనల్ని మంచిగా చూసుకున్న వాళ్ళకి, మన భారాన్ని తగ్గించే వాళ్ళకే ఓటేద్దాం.
కేసీఆర్ రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 2000 చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే చేసి చూపించారు. రేవంత్ రెడ్డి రూ. 4000 ఇస్తానని చెప్పి రెండేళ్లు గడిచినా ఇవ్వడం లేదు. పక్కనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రూ. 4000 ఇస్తానని చెప్పి ఇస్తున్నాడు కదా? మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎందుకు చేతులు రావడం లేదు.
మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2500 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశాడు. ఈ 24 నెలల్లో ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ. 60,000 బాకీ పడింది. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మకు ప్రతి మహిళకు చీర ఇచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చాక చీర లేదు, గాజులు లేవు.
ఏదో గ్రూపులో ఉన్న కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఫ్రీ బస్సు అని చెప్పి మగోళ్లకు డబల్ టికెట్ కొట్టారు, ఆడోళ్ళకు సీటు దొరక్క తిప్పలు పడుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక 5 పంటలు వస్తే.. రెండింటికి ఇచ్చి మూడింటికి రైతుబంధు ఎగ్గొట్టాడు. నాటేసిన వాళ్లకే రైతుబంధు ఇస్తా, శాటిలైట్ లో చూసి ఇస్తా అని కొత్త నిబంధనలు పెట్టి రైతులను గోస పెడుతున్నాడు.
దేవుడి మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏ ఊర్లో చూసినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు కారు గుర్తుకు ఓటు గుద్దితే.. రేవంత్ రెడ్డికి గూబ గుయ్యి అనాలి. అప్పుడే భయపడి హామీలైనా అమలు చేస్తాడు.
ఓటుకు 5 వేలు ఇస్తామంటారు.. అవి తీసుకొని మోసపోవద్దు. మహిళలకు రావాల్సిన రూ. 60,000 అవ్వ తాతలకు రూ. 4000 పెన్షన్ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. అవ్వతాతలు పెన్షన్ అడిగితే లాగుల తొండలు తీసి పెడతా అంటాడు.. మహిళలు హామీలు అడిగితే మెడలో పేగులు వేసుకుంటా అంటాడు.. తులం బంగారం ఏది అని అడిగితే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడు. ప్రశ్నిస్తే కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పి ఆయన అహంకారాన్ని దించాలి.
ఇంకా రెండేళ్లు ఓపిక పట్టండి. వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే. జిన్నారం సమస్యలు పరిష్కరించుకుందాం. మైనార్టీలకు అండగా నిలిచింది, షాదీ ముబారక్ ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమే. రేవంత్ రెడ్డి ముస్లింలకు ఒక్క రూపాయి పని చేయలేదు. కాబట్టి అందరూ ఏకమై కారు గుర్తు అభ్యర్థులను గెలిపించండి అని హరీష్ రావు కోరారు.