– రేవంత్ రెడ్డి ఎలాగూ డిగ్రీ కాలేజీ పోలేదు..మా పిల్లలు కూడా పోవద్దా?
– అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదాం,తెలంగాణను కాపాడుకుందాం
– తెలంగాణలో జెన్ జీ బిఆర్ఎస్ వైపే ఉంది
– నాదర్ గుల్ లో 374 ఎకరాల ప్రభుత్వ భూమిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెఘా కృష్ణా రెడ్డి లు కలిసి 7 వేల కోట్ల కుంభకోణం చేయాలని చూస్తున్నారు
– బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: బంగ్లాదేశ్,శ్రీలంక దేశాల్లో అక్కడి అధ్యక్షులకు ఏర్పడిన పరిస్థితే తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఏర్పడుతుందని,కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దోపిడీని యువత గమనిస్తుందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ భవన్ లో కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యువతను కల్వకుర్తి మాజీ శాసన సభ్యులు జైపాల్ యాదవ్ తో కలిసి కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు తెలంగాణ భవన్ నేడు జెన్ జీ తో నిండిపోయిందన్నారు.జెన్ జీ కేవలం యువత మాత్రమే కాదు,అదొక విస్పొటక శక్తి అంటూ,రేపు తెలంగాణను దోపిడీ నుండి రక్షించే శక్తి అని పేర్కొన్నారు.
జెన్ జి ఉద్యమాల వల్ల బంగ్లాదేశ్ లో షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చిందని,నేపాల్ ప్రధాని కేవలం రెండు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని, శ్రీలంక అధ్యక్షుడు ఆ దేశం వదిలి పారిపోయాడని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా ఏర్పడవచ్చని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
జెన్ జీ అంటే 14 నుండి 30 ఏళ్ల వయస్సు లోపు పిల్లలేనని, జెన్ జీ పుట్టుకే మొబైల్ ఫోన్లు 25 మెగా పిక్సెల్ కెమెరాలతో పుట్టారన్నారు. అయితే కొంత మంది యువత గంజాయి,డ్రగ్స్,బెట్టింగ్ యాప్ లతో జీవితాలను నాశనం చేసుకుంటుంటే కొంత మంది యువత మాత్రం రాష్ట్ర భవిష్యత్ కాపాడేందుకు,కాంగ్రెస్ పార్టీ దోపిడీని ప్రశ్నించేందుకు కేసి ఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బిఆర్ఎస్ లో చేరారన్నారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వర రావు,మల్లు భట్టి విక్రమార్క కలిసి, 52 ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే, 4 వేల మంది పోలీసుల బందోబస్తుతో, 600 ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చితే, సలోమీ అనే ఒక అమ్మాయి తన పరీక్షలను వదిలేసి బుల్డోజర్లను అడ్డుకున్నదని గుర్తు చేశారు. ఈ రోజు యువత అంతా సలోమిని స్పూర్తిగా తీసుకొని పోరాడాలన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం వేణుగోపాల్ రెడ్డి,ఇషాంత్ రెడ్డి ,సిరిపురం యాదయ్య ఆత్మహత్య చేసుకున్నారని,వారి శవాలు మోసానన్నారు. ఇషాంత్ రెఢ్డి తెలంగాణ వ్యతిరేకులను నిజామాబాద్ ఎన్నికల్లో ఓడిస్తే పెద్దమ్మతల్లికి బలిస్తాను అని మొక్కుకొని,ఇచ్చిన మాట ప్రకారం ఠాగూర్ ఆడిటోరియం ముందు తనువు చాలించారని పేర్కొన్నారు.
కల్వకుర్తి పక్కనే ఉండే నాదర్ గుల్ లో 374 ఎకరాల ప్రభుత్వ భూమిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెఘా కృష్ణా రెడ్డి లు కలిసి పేద రైతులను ప్రైవేట్ బౌనాసర్లతో దాడులు చేసి, 7 వేల కోట్ల కుంభకోణం చేయాలని చూస్తున్నారని, ఈ దోపిడీని జెన్ జీ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మూసీ సుందరీకరణ పేరుతో 1.5 లక్షల కోట్ల దోపిడికి కుట్ర చేస్తున్నారని,మూసీని ఆనుకొని ఉన్న విలువైన భూమిని అక్రమంగా సేకరించి, అదానీ,అంబానీలతో పెద్ద పెద్ద భవంతులు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని, ఈ దోపిడీని కూడా జెన్ జీ అడ్డుకోవాలన్నారు.
ప్రైవేటు డిగ్రీ,ఇంజనీరింగ్ కాలేజీలకు విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేసుకోవాలని హై కోర్టు తీర్పు చెప్తే,రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. రేవంత్ రెడ్డి.. నువ్వు ఎలాగూ డిగ్రీ కాలేజీకి పోలేదు. మా బిడ్డలు కూడా పోవద్దా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా బరోడా సంస్థాన మహారాజు ఆర్థిక సహాయంతోనే ఉన్నత విద్యను పూర్తి చేశారన్నారు.
ఫీజు రియంబర్స్ మెంట్ పథకం ద్వారా ఎందరో పేద విద్యార్థులు చదువుకున్నారని, ఆ పథకం లక్ష్యం బాగుందని కేసిఆర్ కూడా పథకాన్ని అద్భుతంగా కొనసాగించారని తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ 10 వేల కోట్లు ఇవ్వకుండా,పేద విద్యార్థుల భవిష్యత్ ను పట్టించుకోకుండా, ఇబ్రహీం పట్నంలో ఎవిఎన్ రెడ్డికి సంబంధించిన లేక్ ఫీల్డ్ ఇంటర్నేషన్ స్కూల్ ఓపెనింగ్ కు వెళ్లి రిబ్బన్ కట్ చేశారని విమర్శించారు. ఆ పాఠశాలలో 5 లక్షల ఫీజు ఉంటది,ఆ ఫీజులు మీ మనుమడు,మనవరాళ్లు కడుతరు… మా పిల్లలు కడుతరా? అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పిల్లలకు సన్నబియ్యం,చికెన్ మటన్,కోడిగుడ్లు ఇస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి విషాహారం పెట్టి 128 మంది విద్యార్థులను చంపారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బ్రదర్స్,మంత్రి పొంగులేటి చేసే వేల కోట్ల రూపాయల దోపిడీతో,విద్యార్థులకు ఎన్నో కాలేజీలు పెట్టొచ్చన్నారు. కేసిఆర్ 8 వేల కోట్లతో చిన్న వయస్సులో పెళ్లిల్లు చేసుకోవద్దని డిగ్రీ కాలేజీలు పెట్టారని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం విద్యార్థుల జీవితాలు పట్టించుకోకుండా, ఫుట్ బాల్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆకునూరి మురళి విద్యా కమీషన్ పేరుతో ఫీజు రియంబర్స్ మెంట్, గురుకులాలు వద్దంటున్నారని, రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారన్నారు. వారికి పేద విద్యార్థులు చదవడం ఇష్టం లేదన్నారు. ఆకునూరి మురళీ ప్రైవేట్ విద్యాసంస్థలు వద్దంటుంటే,రేవంత్ రెడ్డి వెళ్లి ప్రైవేట్ స్కూల్ రిబ్బన్ కట్ చేస్తున్నారన్నారు.
కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 20 వేల మందిని కాంట్రాక్టర్లుగా తయారు చేసి బెంజ్ కార్లలో తిప్పాలని చూస్తే,. రేవంత్ రెడ్డి 20 వేల మంది నోట్లో మన్ను కొట్టారన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల టెండర్లలో రిజర్వేషన్లు రద్దు చేశారని మండిపడ్డారు. అందుకే ఈ దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జెన్ జీ గద్దె దించాలన్నారు. అందుకోసం జన్ జీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ శాసన సభ్యులు మెతుకు ఆనంద్, మాజీ ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,మాజీ ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పోర్ట్స్ చైర్మెఎన్ వెంకటేశ్వర రెడ్డి, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ ఉప్పల వెంకటేష్ గుప్త,బి ఆర్ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు విద్యార్థి నాయకులు మీసాల వీక్షిత్,బాలు నాయక్ తదితరులు వందలాది మంది విద్యార్థుల సమక్షంలో పార్టీలో చేరారు.