Suryaa.co.in

Telangana

రేవంత్‌రెడ్డిగారూ.. మీ పాలన అధ్వానం

పగ,ప్రతీకారాలతో మీ పాలన అధ్వానం
– తెలంగాణ సీఎ, రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ బహిరంగలేఖ

హైదరాబాద్: నిత్యం పగ-ప్రతీకారాలతో రేవంత్‌రెడ్డి పాలన అధ్వానంగా మారిందని బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసులు, విచారణలతో కేసీఆర్‌ను వేధిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

సీఎంకు దాసోజు రాసిన బహిరంగలేఖ ఇదీ..

బహిరంగ లేఖ
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు..

పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా మీ పరిపాలన చాలా అద్వాన్నంగా మారింది. విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కి సంజాయిషీ నోటీసులా??

తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా??
ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకు సంజాయిషీ నోటీసులా??

రేవంత్ రెడ్డి గారు, మీ ప్రతీకార రాజకీయాలను ప్రక్కనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండి.
గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే మీ దుష్ప్రయత్నాలను విరమించండి.
కేసీఆర్ నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని మీ ప్రతీకార రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదు.
హామీల అమలు చేతకాని గుంపుమెస్త్రీగా డివెర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల ప్రతీకార రాజకీయాలకు మీరు తెరలేపారు.
రుణ మాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు. 4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళకు 2500 రూపాయలు లాంటి పథకాలు అమలు చెయ్య మీకు చేతకాక, కేసీఆర్ ను బద్నాం చెయ్యాలని చూస్తున్నారు..
ఈ సమయంలో, రాజకీయ కుయుక్తులను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మీ ఆలోచనలు, కృషిని కేంద్రీకరించండి.
మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను, వారి అభివృద్ధిని అణగదొక్కే ప్రయత్నాలను విరమించండి.

ఇట్లు
డా. దాసోజు శ్రవణ్

LEAVE A RESPONSE